ప్రశ్న: వర్షం అంటే ఆకాశం నుంచి నీరు మాత్రమే కురియడమేనా? వర్ష తీవ్రత ఎలా తెలుస్తుంది?
జవాబు: వాతావరణ శాస్త్రవేత్తలకు వర్షం అంటే ఆకాశం నుంచి భూమి పైకి కురిసే నీరు మాత్రమే కాదు. మామూలు వర్షంలో బిందువుల పరిమాణం 0.6 మిల్లీమీటర్ల నుంచి 3 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది. శాస్త్రవేత్తలు 0.6 మి.మీ. కన్నా తక్కువ వ్యాసం ఉండే వర్షపు బిందువుల జల్లులను కూడా గుర్తించగలుగుతారు. భారీగా వర్షం కురుస్తున్నప్పు భూమిపై పడేది వట్టి నీరు మాత్రమే కాదు. ఆ వర్షంలో వాతావరణంలోని దుమ్ము, ధూళి కణాలతో పాటు ఆక్సిజన్, నైట్రోజన్ వాయువులు, కొన్ని రసాయనిక ద్రవాలు కలిసి ఉంటాయి. ఈ పదార్థాలు భూమిపై ఉండే రాళ్లను కోతకు గురి చేయడమే కాకుండా పంట పైరులకు ఎరువులుగా కూడా పనిచేస్తాయి.
ప్రత్యేకమైన రెయిన్‌గేజ్‌లు, వాతావరణ రాడార్లు వర్షం నీటితో పాటు మంచు, మంచుగడ్డలు కూడా పడుతున్నాయా అనే విషయాన్ని తెలియజేస్తాయి. రాడార్ వెలువరించే రేడియో తరంగాలు కురుస్తున్న వర్షపు బిందువులపై పతనమై పరావర్తనం(reflection) చెందుతాయి. అలా పరావర్తనం చెందిన రేడియో తరంగాల తీవ్రతను బట్టి మేఘాలలో నీటి బిందువులు ఎంత ఎక్కువగా ఉన్నాయో, వర్షం ఎంత తీవ్రతతో కురుస్తోందో తెలుసుకుంటారు. ఇలాంటి వివరాల ద్వారా విమానాల పైలట్లకు ఏ ప్రాంతం ప్రయాణానికి అనుకూలమైనదో తెలుస్తుంది.
- ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్@ఈనాడు హాయ్ బుజ్జి
- ===================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...