ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్రశ్న : మేఘాలు గాలి కన్నా బరువైనవి కదా? మరి కింద పడవెందుకు?
జవాబు : ఒక వస్తువు గాలిలో తేలుతుందా లేక పడిపోతుందా అన్న విషయం బరువును బట్టి ఆధారపడదు. శాస్త్రీయంగా బరువు అంటే భారం (Weight). దీని విలువ వస్తువు ద్రవ్యరాశి, గురుత్వ త్వరణాల (Acceleration due to gravity)లబ్దానికి సమానం. దీన్ని బట్టి కాకుండా వస్తువుల సాంద్రతను (Density) బట్టి వస్తువు తేలడం, కిందపడటం ఆధారపడుతుంది. గాలికన్నా మేఘాల సాంద్రత తక్కువ. మేఘాల్లో నీటి శాతం ఎక్కువ ఉన్నపుడు మేఘాల సాంద్రత కొంచెం పెరగడం వల్ల కిందకు రావడానికి ప్రయత్నిస్తాయి. ఆ క్రమంలో అవి తక్కువ ఉష్ణోగ్రత ప్రాంతానికి దిగడం వల్ల నీటి బిందువులు వర్షించి మేఘాల సాంద్రత తిరిగి తగ్గి అలాగే ఉండిపోతాయి. కాబట్టి మేఘాలు కింద పడవు.
మేఘాలు వాయు రూపంలోను, కొన్ని కొన్ని అణువులు బృందాలుగా కొల్లాయిడల్ రూపంలోను ఉన్న భౌతిక పదార్థాలు. భూమికి ఆకర్షణ ఉన్నంత మాత్రాన భూమ్మీద ఉన్నవన్నీ నేల మీదకు పడవు. ఆ మాటకొస్తే మేఘాలే కాదు. భూ వాతావరణంలో కొన్ని వందల కిలోమీటర్ల పైవరకు విస్తరించి ఉన్న ఆక్సిజన్ నైట్రోజన్ వంటి రూప పదార్థాలు కూడా భూమి మీద పడటం లేదు. అణువుల మధ్య పరస్పర తాడనాలు, వికర్షణలు ఎపుడూ ఉంటాయి.
భూమికి చేరువగా ఉన్న గాలి పొరల కన్నా కొంచెం పైనున్న పొరల సాంద్రత తక్కువగా ఉండటం వల్ల పైపొరల్లోని పదార్థాలు కింది పొర మీద తేలి ఉంటాయి. మేఘాల సాంద్రత, మేఘాల కింద ఉన్న గాలి సాంద్రత కన్నా తక్కువ కాబట్టి మేఘాలు గాల్లో పైపొరలో ఉంటాయి. మేఘాలలోని నీటి అణు బృందాల్లో అణువుల సంఖ్య పెరిగినా, వాతావరణ ఉష్ణోగ్రత తగ్గినా మేఘాల సాంద్రత పెరుగుతుంది. అపుడవి నేలకు మరింత దగ్గరవుతాయి. కొన్ని పర్వత ప్రాంతాల్లో మేఘాలు కొండల నేలల్ని తాకుతూ ప్రయాణిస్తుంటాయి. ఉష్ణోగ్రత మరీ తగ్గినట్లయితే ఆ మేఘాల్లో ఉన్న నీటి తుంపర్లే నీటి బిందువులుగా మారి వర్షపు చినుకుల్లా వాన కురుస్తుంది. అపుడిక మేఘాలు భూమి మీద రూపం మార్చుకుని పడ్డట్టే!
-ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్,వరంగల్; రాష్ట్ర కమిటీ, జనవిజ్ఞానవేదిక@ఈనాడు హాహ్ బుజ్జీ.
- =====================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...