ప్రశ్న: కొన్ని రకాల టానిక్కులు గాజు సీసాలలో, మరి కొన్ని ప్లాస్టిక్ సీసాల్లో వస్తున్నాయి. గాజు సీసాలలో ఉంచే వాటిని ప్లాస్టిక్ బాటిళ్లలో ఉంచకూడదా?
జవాబు: పదార్థాల రసాయనిక స్వభావాన్ని బట్టి నిల్వ ఉంచే పాత్రల్ని ఎన్నుకోవాలి. ఉదాహరణకు వూరగాయల్ని అల్యూమినియం, రాగి, ఇత్తడి, వంటి పాత్రల్లో నిల్వ ఉంచకూడదు. అందుకే వాటిని పింగాణీ పాత్రల్లో నిల్వ ఉంచుతారు. వూరగాయల్లో ఉన్న ఆమ్లత్వం(Acidity)పాత్రల లోహాల్ని ఆక్సీకరణం(Oxidation)చేయడం వల్ల ఏర్పడే లవణాలు(Salt) వూరగాయల్ని పాడయ్యేలా చేస్తాయి. అదే పింగాణీ మీద ఆమ్ల ప్రభావం దాదాపు శూన్యం.
అదే విధంగా ఆల్కహాలు, ఈథర్, క్లోరోఫాం వంటి సేంద్రియ ద్రవాల్ని ప్లాస్టిక్ బాటిళ్లలో నిల్వ ఉంచరు. ఎందుకంటే ఈ ద్రావణులు (solvents)ప్లాస్టిక్ పదార్థాల్ని కరిగించుకుంటాయి. అంటే పాత్ర ఖరాబు కావడంతో పాటు లోపలున్న పదార్థాలు కూడా చెడిపోతాయి. ఇలాంటి వాటిని గాజు పాత్రల్లోనే ఉంచాలి. అలాగే కొన్ని ద్రవాల్ని పారదర్శకంగా (Transparent)ఉండే గాజు పాత్రల్లో ఉంచరు. ఎందుకంటే అవి కాంతి సమక్షంలో చెడిపోయే లక్షణాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి దట్టమైన గోధుమ రంగు (Deep brown)గాజు పాత్రల్లో ఉంచుతారు. హైడ్రోఫ్లోరిక్ ఆమ్లాన్ని గాజు పాత్రల్లో ఉంచరు. ఇది గాజుని తినేస్తుంది. దీన్ని విధిగా ప్లాస్టిక్ సీసాలోనే నిల్వ ఉంచాలి. అందువల్ల రకరకాల టానిక్కులను వాటిలో ఉండే పదార్థాలకు అనుగుణంగా తగిన పాత్రల్లోనే ఉంచుతారు.
- ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్ర కమిటీ, జనవిజ్ఞానవేదిక
- ======================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...