Monday, April 22, 2013

What about chocolate hills? చాక్లెట్‌ హిల్స్ సంగతేమిటి?

  •  
  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. 
చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

  

ఒకేచోట... ఒకే రంగులో... వందలాదిగా పరుచుకున్న గుట్టలు... ఎలా ఏర్పడ్డాయో? ఎప్పుడు ఏర్పడ్డాయో... అంతా అంతుపట్టని వింత... అవే చాక్లెట్‌ హిల్స్‌!

ఇంట్లో అమ్మ పిండి వడియాలు పెట్టినప్పుడు చూడండి, అన్నీ ఒకే తీరుగా పొందిగ్గా పరుచుకుని ఉంటాయి. అచ్చు అలాగే ప్రకృతి పెట్టిన పెద్దపెద్ద వడియాలు ఫిలిప్పీన్స్‌లో ఉన్నాయి. వీటిని ఆకాశం నుంచి చూస్తే ఆ ప్రాంతంలో అచ్చు వడియాలు ఎండబెట్టినట్టే ఉంటుంది. దగ్గర్నుంచి చూస్తే మాత్రం ఒక్కోటి వందలాది అడుగుల ఎత్తుండే గుట్టలే. ప్రపంచంలోని అంతుపట్టని ప్రకృతి వింతల్లో ఇవీ ఒకటి. ఫిలిప్పీన్స్‌లో 50 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పరుచుకుని ఉన్న వీటిని చాక్లెట్‌ హిల్స్‌ అంటారు. మొత్తం వీటి సంఖ్య ఎంతో తెలుసుకునేందుకు ఇటీవలే ఓ సర్వే చేశారు. ఆ సర్వేలో ఇవి మొత్తం 1776 ఉన్నట్టు తేలింది. ఈ ప్రాంతం యునెస్కోవారి ప్రపంచ వారసత్వ సంపదల్లో కూడా చోటు సంపాదించింది.

అయినా వీటికి చాక్లెట్లకి ఏమిటి సంబంధం? అంటే ఏమీ లేదు. కాస్త వర్షాలు పడి పచ్చగా ఉన్నప్పుడు ఈ గుట్టలపై గడ్డి పెరిగి అన్నీ ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి. అదే ఎండాకాలంలో మొత్తం ఎండిపోయి చాక్లెట్‌ రంగులోకి మారిపోతాయి. అందుకే వీటికి చాక్లెట్‌ హిల్స్‌ అని పేరు పెట్టారు. ఇవి ఒక్కోటి 98 అడుగుల నుంచి 390 అడుగుల వరకు ఎత్తు ఉంటాయి. అయితే ఈ గుట్టలు ఎప్పుడు? ఎలా ఏర్పడ్డాయో? మాత్రం ఇప్పటివరకు శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోయారు. కోట్ల ఏళ్ల క్రితం సముద్రంలో ఏర్పడిన అగ్నిపర్వతం వల్ల ఇవి ఏర్పడ్డాయని కొందరు చెపితే, పగడపు దీవులు ఇలా గుట్టలుగా ఏర్పడ్డాయని మరికొందరు భావించారు. అయితే ఈ గుట్టల్లో ఉండే సున్నపు రాయి మాత్రం సముద్రానికి చెందిందేనని తేల్చారు. అంతేకాదు ఈ గుట్టల్ని తవ్వితే సముద్ర జీవుల అవశేషాలు బయటపడ్డాయి. వీటి రహస్యాన్ని కనిపెట్టేందుకు ఇప్పటికీ పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి.

చాక్లెట్‌ హిల్స్‌ వెనుక ఆ ప్రాంతంలో కొన్ని కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. చాలా ఏళ్ల క్రితం ఆ ప్రాంతంలో కొండంత ఎత్తుండే ఇద్దరు రాక్షసులు కొట్టుకున్నారు. పెద్ద రాళ్లను విసురుకున్నారు. చాలా రోజులు యుద్ధం చేసుకున్నాక, అలసిపోయి వెళ్లిపోయారు. వారు విసురుకున్న రాళ్లు మాత్రం అక్కడే ఉండిపోయాయి. అవే చాక్లెట్‌ హిల్స్‌ అంటారు. మరో కథలో అరోగో అనే ఓ ప్రేమికుడు అలోయో అనే అమ్మాయిని ఇష్టపడతాడు. అయితే అనుకోకుండా ఆమె చనిపోవడంతో 'అలో... అయో...' అని ఏడవసాగాడు. అతడి కన్నీటి చుక్కలే భూమిపై పడి ఇలా చాక్లెట్‌ హిల్స్‌ కింద మారాయని అంటారు.
  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...