ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్రశ్న: ఎడారులలో వర్షాలు కురవవు. ఎందువల్ల?
జవాబు: భూమిపై ఒక ప్రాంతం ఉండే ఉన్నతాంశం(Altitude)అంటే ఎత్తు లేక లోతులపై అక్కడ కురిసే వర్షపాతం ఆధారపడి ఉంటుంది. వర్షాలు కురిసేది ఆకాశంలో ఏర్పడే మేఘాల వల్లే. నీటికి నిలయమైన నదులు, సరస్సులు, సముద్రాల నుంచి నీరు సూర్యరశ్మికి ఆవిరయి భూ ఉపరితలం నుంచి పైకి వెళ్లి అక్కడ ఘనీభవించడంతో మేఘాలు ఏర్పడతాయి. ఈ మేఘాలు వాతావరణ పీడనంలోని హెచ్చుతగ్గులు, గాలులు వీచే దిశలను బట్టి పయనించి చెట్లు, అరణ్యాలు ఉండే ప్రదేశాల్లో, వాతావరణంలో తగినంత తేమ ఉండే ప్రాంతాల్లో వర్షిస్తాయి.
ఎడారులలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం వల్ల చెట్లు, చేమలు లేకపోవడంతో అక్కడి గాలి పొడిగా ఉంటుంది. ఆ ప్రాంతాలకు చేరుకున్న మేఘాలు కురవకుండానే ఆ ప్రాంతాలను దాటివెళ్తాయి. నీటి వనరులు ఏమీ లేకపోవడంతో, ఎడారులుండే ప్రాంతాల్లో మేఘాలు ఏర్పడే అవకాశం కూడా ఉండదు. అక్కడక్కడ ఉండే ఒయాసిస్సులలోని కొద్ది పాటి నీరు సూర్యరశ్మికి ఆవిరయి, చిన్న చిన్న మేఘాలు ఏర్పడినా, అవి అక్కడి అధిక వేడితో ఆవిరయిపోతాయి.
ఆకాశంలో పయనించే మేఘాలను ఎత్తయిన పర్వతాలు అడ్డుకున్నా వర్షాలు కురుస్తాయి. ఎడారులను ఆనుకొని సాధారణంగా పర్వతాలు ఉంటాయి. ఉదాహరణకు అతిపెద్దదైన సహారా ఎడారిని ఆనుకొని ఉండే పర్వత శ్రేణులు నీరు, మంచు ముక్కలను మోసుకొస్తున్న మేఘాలను అడ్డుకోవడంతో ఆ పర్వతాలకు ఒక వైపున ఉండే ప్రాంతంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. ఆ ప్రాంతంలోని నేల అతిసారవంతంగా ఉంటే, ఆ పర్వతాలకు మరోవైపున వర్షాలు ఏమాత్రం కురవక పోవడంతో ఆ ప్రాంతం ఎడారిగా మారుతుంది. భూమిపై ఉండే ఎడారులన్నీ ఇలా ఏర్పడినవే. ఎడారుల్లో అప్పుడప్పుడూ కొన్ని జల్లులు పడతాయి.
- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్
- ======================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...