ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్రశ్న: విశ్వంలో ఉష్ణోగ్రత స్థాయి కాలంతో పాటు ఎక్కువవుతుందా?
జ: కోట్లాది సంవత్సరాల నుంచి విశ్వంలో ఉండే నక్షత్రాలన్నీ అంతరిక్షంలోకి వెలుగు, వేడిని వెదజల్లడం వల్ల ఈ పాటికి విశ్వమంతా కొంత మేరకు వేడెక్కుతూ ఉంటుందని అనుకోవచ్చు. కానీ విశ్వం నిరంతరం వ్యాపిస్తూ ఉండటం వల్ల (Expanding Universe) నక్షత్రాలు వెదజల్లే ఉష్ణ వ్యాపనం కూడా అతి నెమ్మదిగా జరుగుతుందనే విషయాన్ని కూడా మనం మరవకూడదు. అందువల్ల 14 బిలియన్ల సంవత్సరాల క్రితం బిగ్‌బ్యాంగ్ వల్ల ఏర్పడిన విశ్వంతోపాటు ఆవిర్భవించిన ఉష్ణం క్రమేపీ నెమ్మదిగా తగ్గిపోతూ ఉంది.
ఖగోళ శాస్త్రవేత్తలు 2008లో ప్రపంచంలో ఉండే అతి పెద్ద టెలిస్కోపుతో 11 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉండే గెలాక్సీలోని కార్బన్ మోనాక్సైడ్ అణువులను పరిశీలించారు. ఆ అణువుల ప్రవర్తన ఆధారంగా వాటి పరిసరాలలో ఉండే ఉష్ణోగ్రతలను అధ్యయనం చేశారు. ఆ పరిశోధనల మూలంగా ప్రస్తుతం ఉండే ఉష్ణోగ్రతల కన్నా అప్పటి ఉష్ణోగ్రతలు ఏడు డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉన్నాయని ధృవీకరించారు. అంటే విశ్వంలో ఉష్ణోగ్రత స్థాయి నెమ్మదిగా తగ్గుతుందని తేలిందన్నమాట. కానీ భూవాతావరణంలో మాత్రం మానవ తప్పిదమైన వాతావరణ కాలుష్యం వల్ల ఉష్ణోగ్రత స్థాయి నెమ్మదిగా హెచ్చుతుంది!
- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్
- ===========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...