ప్రశ్న: మన శరీరంలో కాళ్లకు, చేతులకు మాత్రమే తిమ్మిర్లు ఏర్పడుతాయెందుకు?
జవాబు: మన శరీరంలో పరిసరాలతో సంధానించుకుని పనికి ఉపక్రమించేవి ప్రధానంగా కాళ్లు, చేతులే. మన ఉదరభాగం, వీపు, ముఖం, వక్షస్థలం, మెడ తదితర భాగాలు పరిసరాల ఒత్తిడి (pressure)కి కానీ, తాకిడి (impact)కి కానీ లోను కావు. కానీ మనం ప్రతి పనిలోను చేతుల్ని వాడకుండా ఉండలేము. కూర్చున్నప్పుడు, ఇతర భంగిమల్లోను కాళ్లు యాంత్రిక ఒత్తిడి (mechanical stress)కి లోనవుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో కాళ్లు, చేతుల్లో ఉండే రక్తనాళాలు (blood capillaries), నాడీ తంత్రులు (nerve fibres) అడకత్తెరలో పోకలాగా ఒత్తిడికి లోనవుతాయి. అప్పుడు ఆయా కణాలకు, నాడీ తంత్రులకు సరిపడా రక్తప్రసరణ అందదు. ఫలితంగా ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. ఈ విషయాన్ని అక్కడున్న నాడీ తంత్రులు మెదడుకు సంకేతాల రూపంలో చేరవేయడం వల్ల తిమ్మిర్లు (fingling and numbness) అనే భావనను మనం పొందుతాము. ఒత్తిడికి లోనవుతున్న చేతులు, కాళ్ల భాగాల్ని కాస్త విదిలిస్తే తిమ్మిర్లు తగ్గిపోతాయి. అంటే తిరిగి ఆక్సిజన్ సరఫరా సజావుగా సాగడం వల్ల సమస్య తగ్గినట్టు మెదడు భావించి తిమ్మిర్ల భావన నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్;-రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- ===================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...