Wednesday, March 20, 2013

Ghee burns Why?,నెయ్యి మండనేల?

  •  


ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: పాలకు, పెరుగుకు, వెన్నకు మండే స్వభావం ఉండదు. కానీ వెన్న నుంచి తీసిన నెయ్యికి మాత్రం మండే స్వభావం ఉంటుంది. ఎందుకు?

జవాబు: పాలల్లోనే పెరుగు, వెన్న, నెయ్యి దాగున్నాయి. ఒక వస్తువు మండే స్వభావాన్ని ప్రదర్శించాలంటే దాన్ని వెలిగించినా లేదా నిప్పు పెట్టిన వెంటనే మండాలి. అందుకు ముందుగా దానికి తగినంత ఉష్ణోగ్రత ఉండాలి. అంటే సాధారణ ఉష్ణోగ్రత వద్ద చాలా ఇంధనాలు (fuels) మండవు. పాలల్లో నీటి శాతం 80 శాతం కన్నా ఎక్కువ ఉంటుంది. కాబట్టి పాల మీదకు అగ్గిపుల్ల పెడితే అగ్గిపుల్ల ఆరిపోతుంది. దీనికి కారణం అగ్గిపుల్లలో ఉన్న వేడిని పాలలో ఉన్న నీరు సంగ్రహించడమే. ఎంత మంట పెట్టినా పాలలో ఉన్న నీరు కొంచెం మాత్రమే వేడెక్కుతుంది. మహా అయితే 100 డిగ్రీల సెంటిగ్రేడుకు చేరుకుంటుంది. పాలలో నీరు ఉన్నంత వరకు పాల ఉష్ణోగ్రత అంతకు మించి ఎదగదు. కాబట్టి పాలు మండలేవు. వెన్న ఓ విధమైన ఎమల్షన్‌. అంటే అది రెండు ద్రవాల మిశ్రమణం. అందులో నీరు ఎక్కువ, వెన్న శాతం తక్కువ. కాబట్టి వెన్నకు మంట పెట్టినా అందులో నీరు ఆ మంటలోని ఉష్ణాన్ని సంగ్రహించి ఆవిరవుతూ వెన్న మండడానికి కావలసిన ఉష్ణోగ్రతను చేరకుండా అడ్డుకుంటుంది. ఇక నెయ్యి అంటే నీటి శాతం దాదాపుగా ఏమీ లేని నూనె పదార్థం. ఇలాంటి నెయ్యికి నిప్పు పెట్టినా, మంట తాకినా నెయ్యి ఉష్ణోగ్రత బాగా పెరిగిపోతుంది. నెయ్యి బాష్పీభవన ఉష్ణోగ్రత (boiling point) చాలా ఎక్కువ. అంటే అంతవరకు మంట ద్వారా ఉష్ణోగ్రతకు పెంచగలం. కానీ ఆ లోగానే అది గాలిలోని ఆక్సిజన్‌తో కలిసి మండడానికి అవసరమైనంత ఉష్ణోగ్రత రావడం వల్ల మండుతుంది.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, -వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • =========================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...