Tuesday, March 15, 2011

What is the history of Robo?,రోబో పుట్టుక చరిత్ర ఏమిటి ?




దేవుడు తన సృష్టి ద్వారా మనిషిని పుట్టిస్తే, మనిషి తన ప్రతి సృష్టి ద్వారా 'మరమనిషి' ని పుట్టించాడు. ఆ మరమనిషినే ఇంగ్లీషులో 'రోబో' అంటున్నారు. 1948 లో ఇంగ్లాండుకు చెందిన గ్రేవాల్టర్ తొలి "ఎలక్ట్రానిక్ ఆటోనామస్ రోబోట్" ను తయారు చేసినా అంతకు ముందే అనేక మంది ఈ మరమనిషి ఊహను చేశారు. క్రీ.పూ 450 సంవత్సరంలోనే గ్రీకు గణితవేత్త ఆర్కిటస్ ఒక 'మరపక్షి' ని తయారుచేసి (ఆవిరి ద్వారా) ఎగరేశాడట. ఆ తర్వాత సాహిత్యంలో, సైన్సు ఫిక్షన్‌లో కూడా రోబో ప్రత్యక్షమయింది. మొదట 'రోబో' అనే మాట 'కారెట్ లేపెక్' అనే 'చెక్ రచయిత' ఉపయోగించాడు. 'చెక్' భాషలో 'రోబో' అంటే బానిస అని అర్థం. అతడికి ఈ పదాన్ని అందించింది అతని తమ్ముడైన జోసఫ్ లేపెక్ అట. ఏమైనా 1950ల తర్వాత ఊపందుకున్న రోబోల తయారీ కాలక్రమంలో అమెరికా, జపాన్ దేశాల శాస్త్రజ్ఞుల ద్వారా రోజు రోజుకూ పరిణితి చెందింది. రోబోల తయారీ కోసమే రోబోటిక్స్ అనే సైన్సు పుట్టింది. మనిషి చేయలేని ప్రమాదకరమైన పనులకు (బాంబ్ డిప్యూజింగ్), లేదంటే మనిషితో అవసరం లేని పనులకు (ఫ్యాక్టరీల్లో కార్మికుల్లా) రోబోలను ఉపయోగించసాగారు. కాలక్రమంలో డొమెస్టిక్ రోబోలు వచ్చాయి. అభివృద్ది చెందిన దేశాల్లో పని మనుషులను పెట్టుకోవడం కంటే ఒక రోబోను కొనుక్కోవడం సులభం కనుక ఇంటి పనులు చేయడానికి డొమెస్టిక్ రోబోల అవసరం ఏర్పడి ప్రస్తుతం వాటి గిరాకీ ఎక్కువగా ఉంది. కాని రోబోల వల్ల జరుగుతున్న ఉపయోగకరమైన పనుల్లో అవి ఆపరేషన్లో సాయపడటం ఒకటి. డాక్టర్లకు సహాయంగా సూక్ష్మ భాగాల సర్జరీ కోసం అతి చిన్న రోబోలు తయారయ్యాయి. వీటిని "టినీ రోబోట్స్" అంటున్నారు. ఆపరేషన్ల సమయంలో మనిషి ద్వారా రోగికి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ. కాని టినీ రోబోట్స్ ద్వారా ఆ ప్రమాదం పూర్తిగా తొలగిపోయి, ఆపరేషన్ అనంతరం రోగి త్వరగా కోలుకుంటున్నాడట. మొత్తం మీద 2020 నాటికి ఇంచుమించు మనిషిలాంటి రోబోలు తయారవుతాయని ఒక అంచనా. ప్రస్తుతం తాకడం ద్వారా అది ఏ వస్తువో గ్రహించే స్పెన్సర్లను తయారు చేసి వాటిని రోబోల చేతికి అమరుస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ ప్రయోగం సఫలం అయితే రోబోలకు స్పర్శాజ్ఞానం వచ్చేస్తుంది. అవి ఇంకా మెరుగైన సేవలు అందిస్తాయి. రోదసిలో, సముద్ర గర్భంలో... ఇంకా ప్రమాదకరమైన అనేక చోట్ల మనిషికి బదులు రోబో ఎంతో సహాయకారిగా పని చేస్తున్నా రోబోల వల్ల ప్రమాదాలు కూడా ఉండే అవకాశం ఉంది. కొంత కాలానికి రోబోలే మనిషి మీద పూర్తి ఆధిపత్యం సాధించవచ్చు. లేదంటే కొన్ని సైన్స్ ఫిక్షన్‌లలో జరిగినట్టుగా మనిషి అదుపు తప్పిన రోబోలు సర్వనాశనానికి ఒడిగట్టవచ్చు సైన్స్ వల్ల మంచి ఉంటుంది చెడు ఉంటుంది. రోబోల వల్ల మంచే జరగాలని కోరుకుందాం

మూలం : 8-7-2006, ఆంధ్రజ్యోతి, లిటిల్స్
  • =================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...