Monday, March 14, 2011

భూమిపై లాగే ఇతర గ్రహాలపై కూడా రుతువులు ఏర్పడుతాయా?


ప్రశ్న: భూమిపై లాగే ఇతర గ్రహాలపై కూడా రుతువులు ఏర్పడుతాయా?

-ఇ.వి. స్వామినాయుడు, పిడుగురాళ్ల (గుంటూరు)

జవాబు: మన భూమిపై రుతువులు ఏర్పడడానికి కారణం ముందుగా తెలుసుకోవాలి. తన చుట్టూ తాను బొంగరంలా తిరుగుతున్న భూమికి మధ్యలో నిట్టనిలువుగా ఒక రేఖను వూహించుకుంటే అదే దాని అక్షం అవుతుంది. భూపరిభ్రమణ అక్షం అనే ఈ వూహారేఖ ఏటవాలుగా ఉండి, భూమి సూర్యుని చుట్టూ తిరిగే కక్ష్యను సూచించే వలయాకారపు రేఖతో కొంత కోణాన్ని (23.5 డిగ్రీలు) చేస్తూ ఉంటుంది. ఇలా వంగి ఉండడం వల్ల సూర్యుడి కాంతి సంవత్సరంలో సగం కాలం ఉత్తరార్థ గోళంపైన, మిగతా కాలం దక్షిణార్థ గోళంపైన ఎక్కువగా ప్రతిఫలిస్తూ ఉంటుంది. అందువల్లనే రుతువులు ఏర్పడుతాయి. ఇతర గ్రహాల అక్షాలు, వాటి కక్ష్యా మార్గాలతో కూడా ఇలాంటి కోణాలు ఏర్పరచే పరిస్థితులు ఉంటే వాటిపైనా రుతువులు ఉంటాయి. ఉదాహరణకు అంగారకుడు (మార్స్‌) అక్షం, దాని కక్ష్యతో 25 డిగ్రీల కోణం చేస్తుండడంతో అక్కడ రుతువుల కాలాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఆ గ్రహం కక్ష్య అసాధారణంగా ఉండడంతో దాని ధ్రువాల వద్ద ఘనీభవించిన మంచుగడ్డలుండే ప్రదేశాలలో హెచ్చుతగ్గులు ఏర్పడుతూ ఉంటాయి.

అలాగే వరుణగ్రహం (యురేనస్‌)పై పరిస్థితులు మరీ విపరీతంగా ఉంటాయి. దాని అక్షం, దాని కక్ష్యతో 90 డిగ్రీల కోణం చేస్తుండడంతో సూర్యకాంతి దాని ఒక ధ్రువంపై పడినప్పుడు మరో ధ్రువం పూర్తిగా చీకటిగా ఉంటుంది. అది సూర్యుడి చుట్టూ తిరిగే కాలం భూమితో పోలిస్తే 84 సంవత్సరాలు కాబట్టి, సూర్యకాంతి దాని ఒక ధ్రువంపై 42 ఏళ్లు, మరో ధ్రువంపై మరో 42 ఏళ్లు ప్రసరిస్తూ ఉంటుంది. ఇలా గ్రహాల్లో రుతువులు ఏర్పడే పరిస్థితులు వాటి అక్షాల కోణాలు, కక్ష్యలను బట్టిమారుతూ ఉంటాయి.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌



  • ==============================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...