ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్రశ్న: నూనెలో పోపు వేయిస్తే ఘుమఘుమలు వస్తాయి. వాటినే నీటిలో వేయిస్తే ఆ వాసనలు ఎందుకు రావు?
జవాబు:నీటి భాష్పీభవన ఉష్ణోగ్రత (boiling point) కేవలం 100 డిగ్రీల సెల్షియస్. అంటే అంతకన్నా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద, సాధారణ పరిస్థితుల్లో నీటిని ద్రవరూపంలో ఉంచలేము. కానీ నూనెల భాష్పీభవన ఉష్ణోగ్రత 300 డిగ్రీల సెల్షియస్ కన్నా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాటిని 100 డిగ్రీల సెల్షియస్ కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా ద్రవస్థితిలోనే ఉంచగలము. సుగంధ ద్రవ్యాలలో సుగంధపు ఘుమఘుమలకు ఇచ్చే ధాతువులు చాలా స్థిరమైన రూపంలో దాగుంటాయి. వాటిని ఘుమఘుమలు ఇచ్చే విధంగా బయటకు తీసుకురావాలంటే ఆ పదార్థాలను అధిక ఉష్ణోగ్రతకు లోనుచేయాలి. అధిక ఉష్ణోగ్రత వద్ద ఆ పదార్థాల్లో ఉన్న పెద్ద పెద్ద అణువులు ఉష్ణీయ రసాయనిక చర్యల్లో (pyrolysis) పాల్గొని చిన్న చిన్న అణువులుగా విడిపోయి వాయురూపంలో బయటపడతాయి. ఇవి గాలిలో వ్యాపనం (diffusion) చెందడం వల్ల మనకు ఘుమఘుమ వాసనల్ని ఇస్తాయి. ఇలా జరగాలంటే సుమారు 200 డిగ్రీల సెల్షియస్‌కు పైగా ఉష్ణోగ్రత ఉండాలి. ఇది నీటి ద్వారా అందదు. కాబట్టి నీటిలో ఆ పదార్థాలు ఉడుకుతాయి తప్ప వేగలేవు.
- ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- =======================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...