ప్రశ్న: ఆకాశంలో ఎత్తుగా ఎగురుతున్నా, గద్ద అంత స్పష్టంగా కింద ఉండే చిన్న చిన్న జీవుల్ని సైతం ఎలా చూడగలుగుతుంది?
జవాబు: ప్రాణులన్నింటిలోకి గద్దజాతి పక్షుల దృష్టి చాలా నిశితంగా, తీక్షణంగా ఉంటుంది. దీనికి కారణం అది విశాలమైన, పొడవైన కనుగుడ్లు కలిగి ఉండడమే. దాని కనుగుడ్డులో కంటి కటకానికి, రెటీనాకు విశాలమైన ప్రదేశం లభిస్తుంది. మానవులతో పోలిస్తే, పక్షుల రెటీనాలలోజ్ఞాన సంబంధిత జీవ కణాల (sensory cells) సంఖ్య ఎక్కువవడమే కాకుండా అవి రెటీనాలో సమంగా వ్యాపించి ఉంటాయి. అందువల్ల గద్ద పైనుంచి ఎక్కువ భూవైశాల్యాన్ని కూడా చూడగలుగుతుంది. దాని కంటిలో ఏర్పడే ప్రతిబింబం కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. మన కంటిలో కన్నా గద్ద కంటిలో ఈ కణాలు ప్రతి చదరపు మిల్లీమీటరుకు 8 రెట్లు అధికంగా ఉండడంతో అది దూరంగా ఉండే వస్తువుపై కూడా అతి త్వరగా దృష్టిని కేంద్రీకరించగలుగుతుంది.
కంటిలోని ద్రవాల కదలికల ద్వారా మనం సెకనుకు 25 ప్రతిబింబాలను చూడగలిగితే, గద్ద సెకనుకు 150 ప్రతిబింబాలను చూడగలుగుతుంది. అంతే కాకుండా మన కంటికి కనబడని అతినీల లోహిత కిరణాలను (ultra violet rays) గద్ద చూడగలుతుంది. ఎలుకల లాంటి ప్రాణుల విసర్జకాలు వెలువరించే అతినీల లోహిత కిరణాలను ఆకాశం నుంచి కూడా చూడగలగడం వల్ల అది, వాటి ఉనికిని పసిగట్టి వేటాడగలుగుతుంది.
- ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- =========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...