ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్రశ్న: ఈ మధ్య వార్తల్లో ఉల్కల భీభత్సం గురించి రాశారు. అసలు ఉల్కలు అంటే ఏమిటి?
జవాబు: దాదాపు 10 టన్నుల బరువున్న ఉల్క భూమి వాతావరణంలోకి ప్రవేశించి ముక్కలుగా పేలిపోయి రష్యాలోని ఒక పట్టణంపై పడిన సంగతి తెలిసిందే. రాత్రివేళల్లో ఆకాశంకేసి చూస్తే కొన్ని నక్షత్రాలు రాలి పడినట్టు కనిపిస్తుంది. అయితే ఇవి నక్షత్రాలు కావు. వాటిని ఉల్కలు (మెటియర్స్) అంటారు. గ్రహాలు ఏర్పడిన తొలిరోజుల్లో గ్రహాల ఆకర్షణకు లోనుకాని కొన్ని శిలలు, ధూళికణాలు గ్రహాలతోపాటు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. అలాగే అంగారక గ్రహం నుంచి, చంద్రుని నుంచి వెలువడిన ధూళి కణాలు కూడా అంతరిక్షంలో ఉంటాయి. అంతరిక్షంలో తిరిగే వీటిని 'మెటియోరైడ్స్' అంటారు.
భూమి తన కక్ష్యలో తాను తిరుగుతూ, ఈ మెటియోరైడ్స్ ఉండే ప్రాంతంలోకి వచ్చినపుడు వీటిలో కొన్ని భూమ్యాకర్షణ శక్తి వలన భూవాతావరణంలోకి ప్రవేశిస్తాయి. గంటకు సుమారు 30,000 కిలోమీటర్ల వేగంతో ఇవి భూవాతావరణంలోకి ప్రవేశించడంతో వాటి ఉష్ణోగ్రత విపరీతంగా 1650 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరిగి కాంతిని వెదజల్లుతూ పడిపోతాయి. వాటిని మెటియర్స్ అంటారు.
భూ వాతావరణంలోకి ప్రవేశించిన ఉల్కలు (మెటియర్స్) చాలావరకు భూమి మీద పడకుండానే ఆవిరి గానూ, ధూళి కణాలుగానూ మారిపోతాయి. ఇవి మనకేమాత్రం హాని చేయకపోగా, వాటి చుట్టూ చిన్న నీటి బిందువులు ఏర్పడి వర్షాలు కురియడానికి కూడా సహాయ పడతాయి. కానీ కొన్ని పెద్ద ఉల్కలు భూమి వాతావరణంలో ప్రవేశించాక మండిపోతూనే ప్రయాణించి భూమి ఉపరితలాన్ని 'ఢీ' కొంటాయి. వీటిని 'మెటియోరైట్స్' అంటారు. ప్రతి సంవత్సరం సుమారు 500 మెటియోరైట్స్ భూమిపై పడతాయి. ఇనుము, నికెల్‌లాంటి ఖనిజాలను కలిగి ఉండే వీటి మొత్తం బరువు 100 టన్నులు పైగా ఉంటుంది. ఇవి భూమిని తాకిన చోట లోతైన గోతులు ఏర్పడతాయి.
యాభైవేల సంవత్సరాల క్రితం అమెరికాలోని అరిజోనా ఎడారిలో 10,000 టన్నుల బరువైన ఒక పెద్ద ఉల్క భూమిని ఢీకొనడంతో పెద్ద గొయ్యి ఏర్పడింది. ఇప్పటికీ ఆ ప్రదేశంలో 18 టన్నుల ఇనుప ఖనిజం ఉంది. 1980లో సైబీరియాలో ఒక ఉల్క భూమిని తాకకముందే ఎనిమిదిన్నర కిలోమీటర్ల ఎత్తులో విస్ఫోటనం చెందడంతో దాదాపు 200 కిలోమీటర్ల వైశాల్యంలోని చెట్లు నేలమట్టమయ్యాయి.
ఒకోసారి వందలాది ఉల్కలు జల్లుల్లాగా భూవాతావరణంలోకి ప్రవేశిస్తాయి. 1837 నవంబరు 13న ఒక్క గంటలో 30,000 ఉల్కలు భూమిపై పడ్డాయి.
-ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్
- =====================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...