ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్రశ్న: చేతి వేళ్ల గోళ్లపై తెల్లని అర్ధ చంద్రాకారాలు ఉంటాయి. అవి ఏమిటి?
జవాబు: చేతివైనా, కాలివైనా గోళ్లు అనేక పొరలతో కూడిన దృఢమైన కణాలతో కూడి ఉంటాయి. గోరులోని పైభాగం గట్టిగా, ఒక మిల్లీమీటరు కన్నా తక్కువ మందంగా ఉండి కొంత పారదర్శకంగా ఉంటుంది. అందువల్ల ఆ ప్రాంతం కింద శరీర భాగం రక్తంతో కూడుకుని ఉండడంతో గులాబి రంగులో కనిపిస్తుంది. ప్రతి గోరు దిగువన అర్ధచంద్రాకారంలో కాంతి నిరోధకం (opaque)గా ఉండే తెల్లని ప్రదేశం ఉంటుంది. ఇది గోరుమూలం. గోరు పెరుగుదలకు కావలసిన కణాలను నిరంతరం ఉత్పన్నం చేసే ఈ భాగాన్ని 'లాన్యులా' అంటారు. కొత్తగా ఇక్కడ ఏర్పడిన కణాలు గోరు ముందు భాగానికి చొచ్చుకుపోతూ, ఆ ప్రక్రియలో జీవాన్ని కోల్పోతూ ఉంటాయి. వీటిలో ఉండే 'కేరిటన్' అనే పదార్థం వల్ల గట్టి పడుతూ చివరకు పారదర్శకంగా మారతాయి. చేతి వేళ్ల గోళ్లు వారానికి ఒక మిల్లీమీటరు వంతున పెరుగుతాయి. చేతి వేళ్ల గోళ్లపై ఉండే తెల్లని అర్ధచంద్రాకారాలు పెద్దవిగా ఉంటే, మరి కొందరికి చిన్నవిగా ఉంటాయి. కొందరి వేళ్లలో ఇవి కనబడకపోవడానికి, ఈ లాన్యులాలను వేళ్లపై ఉండే చర్మం కప్పివేయడమే కారణం. ఇవి తెల్ల రంగులో కాకుండా నీలిరంగులోకి మారుతున్నాయంటే ఆ వ్యక్తి దేహంలో రక్తప్రసరణ సక్రమంగా లేక వీటికి తగినంత ఆక్సిజన్ లభించడం లేదని భావిస్తారు. రంగులో ఈ మార్పు హృదయ సంబంధిత లోపాలకు సూచనగా వైద్యులు భావిస్తారు.
- ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- ===================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...