Tuesday, December 06, 2011

రాత్రి ఆకాశం నలుపేల?,Sky is dark in nights Why?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: రాత్రివేళ ఆకాశం నల్లగా, చీకటిగా ఉంటుంది. ఎందుకని?

-కె. రవికిషోర్‌, విజయవాడ

జవాబు: ఈ సందేహం అనేక శతాబ్దాలుగా ఖగోళ శాస్త్రవేత్తల మధ్య చర్చలను లేవనెత్తింది. పదహారవ శతాబ్దం నుంచీ ఉన్న ఈ సందేహాన్ని 19వ శతాబ్దానికి చెందిన హెన్రిచ్‌ విల్‌హెల్మ్‌ ఓల్‌బర్స్‌ అనే శాస్త్రవేత్త ప్రాచుర్యంలోకి తెచ్చాడు. ఫలితంగా దీనికి 'ఓల్‌బర్స్‌ వైరుధ్యం' (Olbers Paradox) అనే పేరు వచ్చింది. విశ్వం అనంతంగా వ్యాపించి ఉంటే దానిలో అనంత సంఖ్యలో నక్షత్రాలు ఉండాలి. అప్పుడు ఆకాశంలో ఏ దిశలో చూసినా మన దృష్టి ఒక నక్షత్రం ఉపరితలం వరకు సాగాలి. గుమిగూడినట్టు కనిపించే అనేక నక్షత్రాల నుంచి వెలువడే కాంతి కారణంగా ఆకాశం దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉండాలి. కానీ అలా కాకుండా రాత్రివేళల్లో చీకటిగా ఉంటోంది. ఎందుకు?

ఈ ప్రశ్నకు వివరణ 20వ శతాబ్దంలో లార్డ్‌ కెల్విన్‌ అనే శాస్త్రవేత్త ఇవ్వగలిగాడు. ఆయన చెప్పేదాని ప్రకారం విశ్వం వయసు అనంతం కాదు. అత్యంత దూరాల్లో ఉన్న నక్షత్రాల నుంచి వెలువడే కాంతి ఇంకా మన కంటికి చేరకపోవడం వల్లనే రాత్రివేళల్లో ఆకాశం చీకటిగా ఉంటుందని సిద్ధాంతీకరించాడు. దీని ప్రకారం విశ్వంలో నక్షత్రాలు అనంత సంఖ్యలో ఉండడానికి వీలులేదు. నక్షత్రాలు త్వరగా ఏర్పడకపోవడమే కాకుండా, వాటి వెలుగు విశ్వమంతా వెలుగు నింపే వరకు జీవించి కూడా ఉండవు. ఆవిధంగా ఓల్‌బర్స్‌ వైరుధ్యానికి పరిష్కారం లభించినట్లయింది.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
  • ============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...