- image : courtesy with - http://teluguone.com/
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్ర : గుడిలో ప్రదక్షిణలు ఎందుకు చేస్తాం?
జ : గుడికి వెళ్ళిన ప్రతివారూ ప్రదక్షిణలు చేస్తారు. ప్రదక్షిణలు రెండు రకాలుగా చేస్తాం. ఒకటి ఆత్మ ప్రదక్షిణ అయితే, మరొకటి గర్భగుడి లేదా విగ్రహం చుట్టూ ప్రదక్షిణ. ప్రదక్షిణలు అయితే చేస్తాం కానీ, ఎందుకు చేస్తామో మనలో చాలామందికి సరిగా తెలీదు. ఇది ఒక జవాబు దొరకని ప్రశ్నగా ఉంటోంది.
గుడిలో వుండే దేవుడికి మనస్సులో ఏదన్నా కోరిక కోరుకుని నమస్కారం పెడతాం. ఆయనకి నైవేద్యం కింద కొబ్బరికాయ కానీ పువ్వులు కానీ సమర్పిస్తాం. దేవుడితో నేరుగా సంబంధం లేని ఈ ప్రదక్షిణలు చేయవలసిన అవసరం ఏముంది అని కొందరికి సందేహం కలగవచ్చు. దీనికి జవాబు కొందరు పండితులు ఇలా చెబుతారు.
మనకి కనిపించే 'సృష్టికి ఆతిథ్యమిస్తున్న భూమి తనచుట్టూ తాను ప్రదక్షిణలు చేస్తూ వుంటుంది. భూమి ఇలా ప్రదక్షిణలు చేయటంవల్ల దానికి శక్తి వచ్చిందా, లేక శక్తిని నిలబెట్టుకోవటం కోసం ప్రదక్షిణలు చేస్తోందా అనేది పక్కన పెడితే, మొత్తం మీద ప్రదక్షిణలు చేయకుండా వున్న మరుక్షణం ఏదన్నా జరగవచ్చు. సృష్టి మొత్తం వినాశనం కావచ్చు. అలాగే సూర్యుని చుట్టూ భూమి ప్రదక్షిణం చేస్తోంది. ఫలితంగా జీవరాశి మనుగడకు సూర్యుని నుంచి శక్తి (సూర్యరశ్మి) ని పొందుతోంది.
ఈ విధంగా భూమి ఆత్మ ప్రదక్షిణలు చేయటమే కాక, సూర్యుని చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తోంది. అలాగే భక్తులు ఆత్మ ప్రదక్షిణ చేయటం, విగ్రహం చుట్టూ తిరగటం పైన చెప్పిన విషయాలకు సూచికగా వుంటాయి. ఇలా భ్రమణం 'చేయటం ద్వారా మన జ్ఞానానికి అతీతమైన శక్తిని దేవుని నుంచి పొందుతారు. ఇది మనస్సుకు, శరీరానికి కూడా మేలు చేస్తుంది. దీనిని గుర్తించబట్టే వేల సంవత్సరాల నుంచీ కూడా కేవలం హిందువులు మాత్రమే ఇలా ప్రదక్షిణ (భ్రమణం) చేసే ఆచారాన్ని పాటిస్తూ వచ్చారు.
- ప్రదక్షిణలు ఎన్నిసార్లు చేయాలి ?
దేవాలయంలో ప్రదక్షిణలు చేస్తాం సరే, అసలు ప్రదక్షిణలు ఎన్నిసార్లు చేయాలి అనే సందేహం తలెత్తుతుంది. ఈ విషయంపై ఖచ్చితమైన నిర్ణయం ఎవ్వరూ చేయలేదు. కొందరు మూడుసార్లు చేయాలని చెబితే, కొందరు అయిదు లేదా పదకొండుసార్లు ప్రదక్షిణ చేయాలని సూచిస్తారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఎన్ని ప్రదక్షిణలైనా కానీ అవి బేసి సంఖ్యలో వుండాలి. 3. 5. 11 ఇలా అన్నమాట! ఇలా ఎందుకు నిర్ణయించారనేది ప్రస్తుతానికి జవాబు దొరకని ప్రశ్న.
ఏ దేవుడి గుడికి వెళితే, ఆ దేవుడికి సంబంధించిన స్తోత్రం పఠిస్తూ ప్రదక్షిణలు చేయాలి. స్తోత్రం మొత్తం తెలియాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. ఎవరకి వారు తమకు తెలిసినంతవరకు మననం చేసుకుంటూ ప్రదక్షిణ చేస్తే సరిపోతుంది. మనస్సు కేంద్రీకరించి ప్రదక్షిణ చేయటం చాలా ముఖ్యం! ఇతర ఆలోచనలతో ప్రదక్షిణలు చేసినా ఒకటే. రోడ్డు మీద నడిచినా ఒకటే! అలౌకిక విషయాలను పక్కన పెడితే ప్రదక్షిణ శరీరానికి, మనస్సుకు కూడా ఉపయోగకరంగానే వుంటుంది.
- ==========================