ప్రశ్న: సూర్యుడు ఉదయం సాయంత్రం ఎర్రగా కనిపించడానికి కారణం ఏమిటి?
జవాబు : భూమ్మీద ఒకచోట సూర్యోదయం జరుగుతున్న సందర్భంలో మరోచోట అది మధ్యాహ్నం కావచ్చు, ఇంకో చోట అస్తమయం, వేరోచోట అర్థరాత్రి కూడా కావచ్చు. కానీ ఆయా ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం సమయాల్లో సూర్యబింబం ఎర్రగా లేదా నారింజ రంగులో కనిపించడానికి ప్రధాన కారణం భూ వాతావరణమే. చంద్రుడి మీద నిలబడి సూర్యాస్తమయం, సూర్యోదయం, మధ్యాహ్నం ఎప్పుడైనా ఒకే విధంగా (దాదాపు తెల్లగా) కనిపిస్తుంది.ఉదయం సాయంత్రం సమయాల్లో భూ వాతావరణంలో ఎక్కువ దూరం సూర్యకాంతి ప్రసరించి మనల్ని చేరుతుంది. మధ్యాహ్నం సమయంలో తక్కువ దూరం ప్రసరిస్తుంది. దీనికి కారణం భూమి, దాని వాతావరణం, గోళాకృతి (spherical shape) లో ఉండడమే. కాంతి తరంగాలు పదార్థాలగుండా ప్రయాణించే క్రమంలో కొంత మేరకు పరిక్షేపణం (scattering)కావడం ఒక ధర్మం. ఈ పరిక్షేపణం తక్కువ తరంగ ధైర్ఘ్యం (wavelength)ఉన్న ఊదా, నీలం, ఆకుపచ్చ రంగులకు ఎక్కువగాను తరంగదైర్ఘ్యం ఎక్కువగానున్న ఎరుపు, నారింజ రంగులకు తక్కువగా ఉంటుంది. అందువల్ల సౌరకాంతి వాతావరణంలో దూసుకెళుతున్న సందర్భంలో ఎరుపు, నారింజ రంగులు తక్కువే పరిక్షేపణం చెందడం వల్ల ఎక్కువ దూరం వరకు కొంతలో కొంత చేరగలవు. కానీ తక్కువ తరంగదైర్ఘ్యం గల కాంతిలో మార్గమధ్యంలోనే పరిక్షేపణం బాగా చెంది మనల్ని చేరేలోగానే అంతరించిపోతాయి. ఈ ఘటన తక్కువ దూరమే ప్రయాణించే పరిస్థితి ఉన్నా మధ్యాహ్నం తటస్థపడదు. అందువల్ల అన్ని రంగులూ, వెరసి తెల్లని కాంతిగల సూర్యుణ్ని మధ్యాహ్నం పూట, కేవలం ఎరుపు, నారింజ రంగులే అధికంగా గల సూర్యకాంతిని ఉదయం, సాయంత్రం చూస్తాము.
- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- ==========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...