ప్రశ్న: నూనెలో వేయించిన అప్పడాలు, వడియాలు వంటివి బయట కొంతసేపు ఉంచితే మెత్తగా అవుతాయి. కానీ వాటిని గాలి చొరబడని కవర్లలో ఉంచితే రెండు మూడు రోజుల వరకు బాగానే ఉంటాయి. ఎందుకు?
జవాబు: వేగుతున్న ఉష్ణోగ్రత, నీటి భాష్పీభవన ఉష్ణోగ్రత కన్నా రెండు మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఆ ఉష్ణోగ్రత దగ్గర అప్పడాలను, వడియాలను వేయించినపుడు అందులో ఉన్న నీటి ఆవిరి పూర్తిగా ఆవిరవుతుంది. పైగా కొన్ని రసాయనిక చర్యలు జరిగి నత్రజని కర్బన ద్వి ఆమ్లజని వంటి వాయువు కూడా వెలువడి అప్పడాలను, వడియాలను కరకరలాడేలాగా చేస్తాయి. కరకరలాడే తత్వానికి ప్రధాన కారణం అవి పూర్తిగా జలరహితంగా ఉండటమే. కానీ వాటిని అలాగే కాసేపు గాలిలో ఉంచితే గాలిలోని నీటిని తిరిగి ఆ అప్పడాల, వడియాల పొరల్లోకి చేరుతుంది. కాబట్టి మెత్తగా అవుతాయి. ఎందుకంటే లోనికెళ్లిన నీటి ఆవిరి అక్కడున్న కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు వంటి పదార్థాలలో హైడ్రోజన్ బంధాల్ని ఏర్పర్చి వివిధ పొరల మధ్య మెత్తటి సంధానం లాగా పనిచేస్తుంది. కానీ నూనెలో తీసిన వెంటనే లేదా కొద్దిసేపటికే గాలి చొరబడని కవర్లలో దాచినట్లయితే అందులోకి నీటి ఆవిరి వెళ్లే అవకాశాలు తక్కువ ఉండటం వల్ల అవి కరకరలాడుతూ ఉంటాయి.
- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్,--వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- =======================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...