ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్రశ్న: ఫంగస్ వృక్ష జాతికి చెందుతుందా లేదా జంతుజాతికి చెందిందా?
జవాబు: ఫంగస్ పురాతనమైన రాళ్లపై చెట్ల వేళ్లపై భూభాగంపై ఏర్పడే బూజు. దీనిని 'శిలీంధ్రం' అని కూడా అంటారు. పై చెప్పిన వాటిపై మనం చూసే ఫంగస్ పెరుగుతున్న భాగం. అయితే పైకి మనకు కనిపించేది చాలా తక్కువ శాతం. ఎక్కువ భాగం అతి సన్నని దారాల రూపంలో భూమి ఉపరితలం కింద వ్యాపించి ఉంటుంది.
ఫంగస్ అటు వృక్ష జాతికిగానీ, ఇటు జంతు జాతికిగానీ చెందినదికాదు. అదో ప్రత్యేక జాతి. ఇప్పటి వరకు శాస్త్రజ్ఞులు ఒక లక్ష ఫంగస్ రకాలను కనిపెట్ట గలిగారు. కానీ ఫంగస్ జాతులు మూడు లక్షల వరకు ఉన్నాయని వారి అంచనా. ఫంగస్ స్థిరమైన, దృఢమైన స్థానాల్లో పెరగడం వల్ల అది జంతు జాతి కన్నా వృక్ష జాతికి చెందినదని భావించారు. కానీ మొక్కలలాగ ఫంగస్ కిరణజన్య సంయోగక్రియను జరుపలేవు. అంతేకాకుండా వాటి కణాల్లో మొక్కలలో ఉండని జంతువులలో మాత్రమే ఉండే 'చిటిన్' అనే పెంకులాంటి పదార్థం ఉంటుంది. ఇదే కాకుండా దానికున్న శారీరక, జన్యులక్షణాల ఆధారంగా శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఫంగస్ మొక్కలకన్నా జంతువుల వైపే మొగ్గు చూపుతుందని తేలింది.
- ప్రొ||ఈ. వి.సుబ్బారావు, హైదరాబాద్
- ========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...