ప్రశ్న: అన్ని జీవుల్లా కప్పలు నడవకుండా గెంతులేస్తాయి ఎందుకు?
జవాబు: జంతువులకు వృక్షాలకు ఉన్న అనేక తేడాలలో ప్రధానమైంది జీవులకున్న స్థాన చలనం. కేవలం నడవడం, గెంతడం రెండే జంతువులకున్న స్థాన చలన యంత్రాంగాలు కావు. ఎన్నో రకాల పద్ధతులు జంతువుల్లో ఉన్నాయి. ఒకే జాతిలో కూడా పరిస్థితికి అనుగుణంగా స్థాన చలన పద్ధతిని మార్చుకుంటాయి. పులులు, సింహాలు, కోతులు, పిల్లులు, కుక్కలు మెల్లగా నడిచేప్పుడు ఓ విధమైన పాదగమనం' వేగంగా వెళ్లేప్పుడు మరో విధమైన భంగిమ చూస్తాము. ఆల్చిప్పలు, పక్షులు, చేపలు, కీటకాలు సరీసృపాలైన పాములు, తొండలు, బల్లులు దుముకవు, నడవలేవు. ఆ గమనం వేరు. ఇలా ఎన్నో రకాలైన కదలికల్లో కప్పల కదలిక దుమకడం. వెనక కాళ్లు బలమైనవిగా, ముందు కాళ్లు కాస్త బలహీనంగా ఉన్న జంతువుల్లో ఇలాంటి దూకే విధానం ఉంటుంది. కంగారూలు, చింపాంజీలు, కప్పలు ఈ కోవకు చెందుతాయి.
చతుష్పాద (tetrapod) జీవుల్లో వెనకకాళ్లు దేహానికి దాదాపు సమాంతరంగా ఉంటే, అవి తమ చలనంలో దేహాన్ని బాగా శ్రమకు గురిచేసినట్టవుతుంది. కానీ క్షితిజ సమాంతరంగా ఉన్న దేహానికి దాదాపు నిట్టనిలువుగా కాళ్లుంటే అపుడు కాళ్లను ఒకదాని తర్వాత ఒకటిగా అడుగులు వేసినపుడు దేహంమీద శ్రమ ఏర్పడదు. నడిచే జంతువుల శరీరాకృతి, వెనుకకాళ్ల నిర్మాణం ఆ విధంగా ఉండటం వల్ల నడవడంతోపాటు, పరుగెత్తేపుడు గెంతగలవు. కానీ కప్పల్లో వెనుక కాళ్లు పక్కలకు ఉండటంతోపాటు వాటిపొట్ట కన్నా ఏమంత కిందుగా ఉండవు. కాబట్టి అవి నడిచినట్లయితే పొట్టనేలకు రాసుకుంటూ పోవడం వల్ల గాయాల పాలయ్యే ప్రమాదం ఉంది. ఇక గెంతడం మినహా మరో దారి లేదు. ఉభయచరాలయిన కప్పలకు తమ స్థావరాలను త్వరితంగా మార్చుకోవడానికీ, తమ భక్షకులు అయిన పాములు, గద్దలు వంటివాటి బారిన పడకుండా తప్పించుకోవడానికి గెంతే పద్ధతి సహకరిస్తోంది కూడా.
- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- ============================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...