ప్రశ్న: మామూలు కరెంటు వైర్లను పట్టుకుంటే షాక్ కొడుతుంది. కానీ అదే కరెంటును ఇచ్చే ఇన్వర్టర్ బ్యాటరీ ధ్రువాలను పట్టుకుంటే షాక్ కొట్టదు ఎందుకు.
జవాబు: విద్యుత్ వల్ల మనకు షాక్ కొడుతుందా? లేదా అన్న విషయం విద్యుత్ ప్రవాహం మీద కన్నా, విద్యుత్ పొటన్షియల్ మీద ఆధారపడుతుంది. ఆ పొటన్షియల్ ఎంత ఎక్కువ ఉంటే అంత ప్రమాదం. సాధారణ ప్రమాదస్థాయిలో పొటన్షియల్ ఉన్నా, డి.సి. కరెంటును ఇచ్చే ధ్రువాలకన్నా అదే పొటన్షియల్ ఉన్న ఎ.సి. కరెంటును ఇచ్చే ధ్రువాలు మరింత ఎక్కువ ప్రమాదం. మామూలు ఇన్వర్టర్ బ్యాటరీలో (+) గుర్తుకు (-) గుర్తుకు మధ్య పన్నెండు వోల్టుల డి.సి. కరెంటు తరహా విద్యుత్ పొటన్షియల్ భేదం ఉంటుంది. అటువంటి ధ్రువాలను కుడి, ఎడమ చేతులతో పట్టుకుంటే ప్రమాదం ఉండదు. చాలా మంద్ర స్థాయిలో విద్యుత్ మన శరీరం గుండా ప్రయాణించినా అది హానికర స్థాయిలో ఉండదు. అదే డి.సి. బ్యాటరీ కరెంటును ఇన్వర్టర్ ద్వారా ఎ.సి. విద్యుత్తుగా 230 వోల్టులకు మారుస్తారు. అలాంటి స్థితిలో న్యూట్రల్ (N)ధ్రువాన్ని, లైన్ (L)ధ్రువాన్ని వేర్వేరు చేతులతో పట్టుకుంటే మన శరీరంలోని జీవభౌతికరసాయనిక చర్యలు(bio physical and bio chemical actions)తాత్కాలికంగా స్తంభిస్తాయి. ఇలాంటి చర్య ఓసారి గుండెను, మెదడును అచేతనం చేయడం వల్ల చనిపోయే ప్రమాదం ఉంది.
- ప్రొ|| ఎ. రామచంద్రయ్య,-నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- ==========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...