ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్రశ్న: లాంగ్‌జంప్ చేసే వ్యక్తి ముందుగా కొంత దూరం పరుగెత్తి ఆ తర్వాత దుముకుతాడు ఎందుకు?
జవాబు: దీన్ని తెలుసుకోవాలంటే చలనం, వేగం, బలం గురించి తెలుసుకోవాలి. మనం ఉన్నచోట నుంచే ముందుకు గెంతాలనుకుందాం. అలా చేయాలంటే, మనం మన శక్తిని ఉపయోగించి నేలను కాళ్లతో తాటించాలి. అది చర్య. దానికి ప్రతిచర్యగా భూమి అంతే బలాన్ని మన కాళ్లపై కలిగించడం వల్ల మనం కాస్త ముందుకు దూకగలుగుతాము. అపుడు మనం ఉపయోగించే శక్తి కొంతమేరకే ఉంటుంది కాబట్టి ఒక స్థాయికి మించి దూకలేం. అంతకు మించి దూకాలంటే, మనకు మరింత బలం తోడవ్వాలి. ఈ అదనపుబలం మనకు వేగం వల్లనే లభిస్తుంది.
ఇప్పుడు న్యూటన్ చెప్పిన 'ద్రవ్యవేగం' గురించి తెలుసుకుందాం. ఒక కారు గంటకు 50 కిలోమీటర్ల వేగంతోనూ అంతే ద్రవ్యరాశి కలిగిన మరో కారు గంటకు 100 కిలోమీటర్ల వేగంతోనూ వస్తున్నాయనుకొందాం. ఇపుడు మనం వీటిని ఆపాలంటే, ఎక్కువ వేగంతో వస్తున్న కారుపై ఎక్కువ బలాన్ని ఉపయోగించాల్సి వస్తుంది. అలాగే వేర్వేరు ద్రవ్యరాశులున్న లారీ, కారు మనవైపుకు ఒకే వేగంతో వస్తుంటే, ఎక్కువ ద్రవ్యరాశి ఉన్న లారీని ఆపడానికి ఎక్కువ బలం అవసరమవుతుంది. అంటే ఒక బలాన్ని కొలవాలంటే ద్రవ్యరాశి, వేగం రెండింటి అవసరం ఉందన్నమాట. ఈ రెండింటినీ గుణిస్తే అదే 'ద్రవ్యవేగం' అవుతుందని న్యూటన్ చెప్పారు.
దీన్నిబట్టి ఒక వస్తువుపై బలాన్ని ప్రయోగిస్తే దాని ద్రవ్యవేగంలో మార్పు వస్తుందన్నమాట. ఈ సూత్రమే మనకు 'లాంగ్‌జంప్'లో కనిపిస్తుంది. వేగంగా పరుగెత్తుకు వచ్చే క్రీడాకారుడు ద్రవ్యవేగంలోని మార్పువల్ల తగినంత బలాన్ని పొంది, అప్పుడు కాళ్లతో భూమిపై ఆ బలాన్ని ప్రయోగిస్తాడు. ఆ చర్యకు ప్రతిచర్యగా లభించే బలంతో ఎక్కువదూరం ముందుకు దూకగలుగుతాడు.
- ప్రొ||ఈ.వి సుబ్బారావు, హైదరాబాద్
- ===============================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...