ప్రశ్న: సూర్యుడు కాలం గడిచే కొలదీ తనలోని ద్రవ్యరాశిని కోల్పోతున్నాడా?
జవాబు: ప్రతి సెకనుకు సూర్యునిలో 700 మిలియన్ టన్నుల హైడ్రోజన్ రూపాంతరం చెంది హీలియంగా మారుతుంటుంది. దాని వల్లే సూర్యుడు కాంతి, ఉష్ణాలను వెదజల్లుతున్నాడు. దాంతో కాలం గడిచే కొలదీ సూర్యుని ద్రవ్యరాశి తగ్గి తేలికవుతున్నాడు. సూర్యుని అంతరాళాల్లో జరుగుతున్న కేంద్రక సంయోగ చర్య వల్ల నాలుగు హైడ్రోజన్ పరమాణువులు ఒక హీలియం పరమాణుగా మారుతుంటాయి. ఒక హీలియం పరమాణువు ద్రవ్యరాశి, నాలుగు హైడ్రోజన్ పరమాణువుల ద్రవ్యరాశి కన్నా తక్కువ. అంటే హైడ్రోజన్ పరమాణువులు కోల్పోయే ద్రవ్యరాశి, శక్తిగా మారుతుందన్నమాట. ఇలా ద్రవ్యం, శక్తిగా మారడాన్ని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ రూపొందించిన E= mc2 ద్వారా లెక్కకట్టవచ్చు. ఇక్కడ m కోల్పోయిన ద్రవ్యరాశి అయితే, c శూన్యంలో కాంతివేగం. ఈ విధంగా ప్రతి సెకనుకు సూర్యుడు ఐదు మిలియన్ టన్నుల బరువు తగ్గిపోతున్నాడు. ఇది మనకు పెద్ద పరిమాణంగా అనిపించినా, సూర్యుని జీవితకాలంతో పోలిస్తే ఇది దాని ద్రవ్యరాశిలో 0.01 శాతం మాత్రమే!
- ప్రొ|| ఈ.వి సుబ్బారావు, హైదరాబాద్
- =========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...