ప్రశ్న: వర్షం ధారల్లాగా కాకుండా నీటి బొట్లుగా ఎందుకు పడుతుంది?
జవాబు : వర్షం ధారలాగా కురవకుండా, బొట్లలాగా, నీటి బిందువులుగా పడడానికి కారణం నీటికున్న తలతన్యత (Surface tension) అనే లక్షణం. ప్రతీ ద్రవం తన ఉపరితల వైశాల్యాన్ని సాధ్యమైనంత తక్కువగా ఉంచుకునేలా ప్రవర్తిస్తుంది. అంటే నిర్ణీత ద్రవ్యరాశి లేదా ఘనపరిమాణం ఉన్న ద్రవ పదార్థానికి అతి కనిష్ట ఉపరితలాన్ని ఇచ్చే జ్యామితీయ నిర్మాణం (Geometry) అంటే గోళాకారమే. ఆకాశంలో చాలా ఎత్తులో ఉన్న మేఘాల నుంచి కురిసే వాన పగిలిన నీటి ట్యాంకునుంచి పడ్డట్టుగా ఉండదు. అంటే నీరు మేఘంలో ఉండదు. కొంచెం కొంచెంగా వాయురూపంలో ఉన్న నీటి ఆవిరి ద్రవీభవించి వర్షంగా కురుస్తుంది. ఆ విధంగా కింద పడుతున్న వర్షపు నీరు తన తలతన్యత లక్షణాన్ని బట్టి బిందు రూపంలోకి చేరుకుంటుంది. ఆ రూపాన్ని చేరుకునేలోగానే వెనక నీరు దాన్ని అంటిపెట్టుకోకపోవడం వల్ల వర్షం చుక్కలుగానే పడుతుంది. మరి కొళాయి నీరెందుకు అలా పడదు? కొళాయి నీరు బిందు రూపంలోకి చేరుకునే లోగానే వెనక నుంచి వేగంగా వచ్చే నీరు కలవడం వల్ల అది ధారగానే పడుతుంది. కొళాయి ప్రవాహం బాగా తగ్గించితే అక్కడా నీటి చుక్కలు బొట్లుగానే కిందికి దూకుతాయి.
- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్;-రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- ========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...