ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
అద్భుతమైన కట్టడాలు... అందమైన కళాకృతులు... అబ్బురపరిచే విగ్రహాలు... అన్నీ సీసాల్లోకి దూరిపోయాయి! ఇంతకీ లోపలికి ఎలా వెళ్లాయి? అసలెక్కడున్నాయ్?
సీసాల్లోకి దెయ్యాలను రప్పించి మూత పెట్టే మాంత్రికుల కథలు బోలెడు చదివే ఉంటారు. అవన్నీ కల్పితాలు. కానీ నిజంగానే సీసాల్లో భవనాలు, విగ్రహాలు ఇంకా వందలాది కట్టడాలుంటే ఆశ్చర్యమే కదూ! ఇవన్నీ చూడాలంటే థాయ్‌లాండ్ వెళ్లాలి.
* పట్టాయా నగరంలో 'బాటిల్ ఆర్ట్ మ్యూజియం' ఉంది. దీంట్లోకెళితే ఎక్కడ చూసినా సీసాలే కనిపిస్తాయి. ఖాళీవి కావు. వాటిల్లో బోలెడు బొమ్మలు కనువిందు చేస్తాయి.
* ఒకటా రెండా, ఈ మ్యూజియంలో ఏకంగా 300కు పైగా సీసాల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన ఎన్నో భవనాలు, చర్చిలు, ఆలయాలు, అందమైన ఇళ్ల నమూనాలు ఉంటాయి. అవన్నీ సూక్ష్మ రూపంలో అబ్బురపరుస్తాయి.
* సీసా ద్వారం అంత చిన్నగా ఉంది. మరి అంత పెద్ద కళాఖండాలను లోపలికి ఎలా దూర్చారు? అనే అనుమానం తప్పకుండా వచ్చి తీరుతుంది. అందుకే మ్యూజియంలోకి ప్రవేశించగానే మనకో వీడియో చూపిస్తారు. అందులో దీని వ్యవస్థాపకుల వివరాలు, వాళ్లు వీటిని ఎలాచేశారు, సీసాల్లో ఎలా పెట్టారు? అనే వివరాలు చూపిస్తారు.
* ఈ వింత మ్యూజియాన్ని ప్రముఖ డచ్ కళాకారుడు పీటర్ బెడిలాయిస్ 1995లో ప్రారంభించారు. అయితే సీసాల్లో మనకు కనిపించే నిర్మాణాలను చిన్నచిన్న విడిభాగాలుగా బయటే రూపొందిస్తారు. తర్వాత వాటిని జాగ్రత్తగా బాటిళ్లలో అనుకున్న తీరుగా అతికించి అమరుస్తారు. అయితే ఒక్కో బొమ్మను తయారుచేసి, సీసాలో పెట్టడం చిన్న విషయం కాదు. రోజుకు 15 గంటలు పనిచేస్తే నాలుగైదు నెలల సమయం పడుతుందని అంచనా! పీటర్ కొందరు తన శిష్యులతో కలిసి ఇవన్నీ చేశాడు.
* విశాలమైన భవనంలో ఉన్న ఈ మ్యూజియాన్ని మూడు భాగాలుగా విభజించారు. ఒకదాంట్లోని సీసాల్లో ఆకాశహర్మ్యాల్లాంటి అద్భుత భవనాలు, ఇంకా పేరుపొందిన పర్యాటక కట్టడాలు, దేశదేశాల్లో కనిపించే అందమైన ఇళ్ల నమూనాలు కనిపిస్తాయి. రెండో విభాగంలో కళాకృతులు అంటే నౌకలు, సంగీత పరికరాలు, బొమ్మల్లాంటివి, మూడో దాంట్లో చర్చిలు, ఆలయాలు, బుద్ధుడు, ఇంకా ఎన్నో దేవతా మూర్తుల విగ్రహాల లాంటి నిర్మాణాలు కనిపిస్తాయి.
* ఇవి చాలా చిన్నగా ఉన్నా ఆకట్టుకునే డిజైన్లు, చెక్కనాలతో కళ్లు తిప్పుకోకుండా చూసేలా చేయడం విశేషం.
source : Hai bujji@Eenadu news paper
- =======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-
No comments:
Post a Comment
your comment is important to improve this blog...