Sunday, December 09, 2012

What is induction stove?-ఇండక్షన్‌ స్టౌ అంటే ఏమిటి?

  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !... 

ప్రశ్న: ఇండక్షన్‌ స్టౌ అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుంది?

జవాబు: విద్యుత్‌, అయస్కాంత తత్వాల గురించి పాఠాల్లో చదువుకుని ఉంటారు. ఏదైనా ఇనుప ముక్క చుట్టూ అమర్చిన తీగల్లోకి విద్యుత్‌ను ప్రవహింపజేస్తే ఆ ఇనుప ముక్క అయస్కాంత తత్వాన్ని సంతరించుకుంటుంది. ఇలా అయస్కాంత తత్వాన్ని పొందిన ఇనుప ముక్కపై మరో చోట రాగి తీగను చుట్టినట్లయితే అందులో విద్యుత్‌ క్షేత్రం ప్రేరేపితం అవుతుంది. మరోలా చెప్పాలంటే మారే విద్యుత్‌ ప్రవాహం అయస్కాంత క్షేత్రాన్ని, మారే అయస్కాంత క్షేత్రం విద్యుత్‌ క్షేత్రాన్ని ఏర్పరుస్తాయి. దీన్నే విద్యుదయస్కాంత ప్రేరణ (Electro magnetic Induction) అంటారు. ఈ సూత్రం ఆధారంగానే మన ఇళ్లలో ఫ్యాన్లు, పంటపొలాల్లో మోటార్లు పని చేస్తున్నాయి. ఇండక్షన్‌ స్టవ్‌ కూడా ఇదే సూత్రంపై పనిచేస్తుంది. స్టవ్‌ లోపల విద్యుత్‌ వలయం ఉన్న ఓ ఇనుప కోర్‌ (ఇనుప ప్లేట్ల సముదాయం) ఉంటుంది. విద్యుత్‌ ప్రవహించినప్పుడు ఆ కోర్‌ చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. స్టవ్‌ మీద పాత్ర పెట్టే ప్లాట్‌ఫారం మీద కూడా ఈ క్షేత్రం ఏర్పడుతుంది. ఇప్పుడు ఇనుప పాత్రను స్టౌ పై పెడితే అందులో విద్యుత్‌ ప్రవాహం ఏర్పడుతుంది. అయితే ఈ పాత్రకు నిరోధం (resistance) ఉండడం వల్ల అందులో విద్యుత్‌ ప్రవాహం ఉష్ణంగా మారుతుంది. అందువల్ల పాత్ర వేడెక్కి అందులోని పదార్థాలు ఉడుకుతాయి. ఈ స్టౌ మీద కేవలం స్టీలు లేదా ఇనుప పాత్రలనే ఉపయోగించాలి.

- ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; -రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక.
  • ======================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...