ప్రశ్న: లేజర్ కిరణాలను ఎలా ఉత్పత్తి చేస్తారు?
జవాబు: లేజర్(LASER) అనేది Light Amplification by Stimulated Emission of Radiationకు సంక్షిప్త రూపం. లేజర్ ఒక కాంతి జనకం మాత్రమే. లేజర్ కిరణాలు మామూలు కాంతి కిరణాల్లాగా చెల్లాచెదురుగా, పోయే కొలదీ ఎక్కువ వైశాల్యాన్ని ఆక్రమించకుండా ప్రయాణిస్తాయి. ఇవి పొందికగా, స్థిరమైన దశలో, ఒకే రంగులో, తీవ్రమైన తీక్షణతో, నిర్దిష్టమైన దిశలో 10 మీటర్ల ఇరుకైన, సన్నని మార్గంలో ప్రయాణిస్తాయి. వైద్య శాస్త్రంలో రక్తం చిందించని శస్త్రచికిత్సలకు, అతి సున్నితమైన కంటి ఆపరేషన్లకు, వజ్రాల్లో రంధ్రాలు చేయడానికి, శత్రు దేశాలు ప్రయోగించే క్షిపణులను ఆకాశంలోనే తునాతునకలు చేయడానికి, రోదసిలోకి ప్రయోగించిన పరికరాల నుంచి సమాచార వ్యవస్థ ఏర్పాటు చేసుకోడానికి ఇలా ఎన్నో రకాలుగా లేజర్లు ఉపయోగపడతాయి. లేజర్ పుంజంలోని ఒక కిరణం టెలివిజన్ ప్రసారాలను, వేల మిలియన్ల టెలిఫోన్ సంభాషణలను ఒకేసారి తీసుకుపోగలదు.
మొట్టమొదటి లేజర్ 'రూబీ' అల్యూమినియం, ఆక్సిజన్ మూలకాల మిశ్రమం. ఇందులో క్రోమియం అనే మూలక కణాలను ప్రవేశ పెడతారు. ఆపై క్రోమియం పరమాణువులు రూబీలోని కొన్ని అల్యూమినియం పరమాణువుల స్థానాలను ఆక్రమించేలా చేస్తారు. ఈ రూబీ స్ఫటికాన్ని ఇరువైపులా చదును చేసి ఆ తలాలపై వెండిపూత పూస్తారు. ఒకవైపు వెండిపూత రెండో వైపు కన్నా రెట్టింపు మందంగా ఉంటుంది. రూబీ స్ఫటికంలో క్రమపద్ధతిలో అమరి ఉండే పరమాణువులు, కాంతిని ప్రసరింపజేసినపుడు ఉత్తేజం పొందుతాయి. ఫలితంగా వెలువడే ఫోటాన్లు రూబీలోని అన్ని దిశలకూ వ్యాపిస్తాయి. కాంతిని ఎక్కువసేపు ప్రసరిస్తే ఫోటాన్ల సంఖ్య ఎక్కువై తక్కువ వెండిపూత ఉన్న తలం నుంచి తప్పించుకుని బయటపడతాయి. అదే లేజర్ కిరణం. రూబీ లేజర్ తర్వాత ద్రవ, వాయు పదార్థాల లేజర్లు కూడా వాడుకలోకి వచ్చాయి.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు,--హైదరాబాద్
- ==========================