Monday, June 07, 2010

భూమధ్యరేఖ వద్ద ఎక్కువ వేడి ఉంటుంది. ఎందుకు?, Hot at Earths Equator-Why?




భూమధ్యరేఖ వద్ద వేడి ఎక్కువ ... దీని కారణం ఏమిటి?

భూమికి సూర్యుడి నుండి కాంతి, ఉష్ణశక్తులు లభిస్తాయి. భూమిపై ఉష్ణం అన్ని చోట్ల ఒకే విధంగా ఉండదు. కొన్ని చోట్ల ఎక్కువ వేడిగా ఉంటే కొన్ని చోట్ల తక్కువ వేడి ఉంటుంది. భూమి గోళాకారంలో ఉండి, ధ్రువాల వద్ద కొంత మేరకు బల్లపరుపుగా ఉంటుంది. సూర్యకిరణాలు భూమిపై వివిధ ప్రదేశాలలో వివిధ కోణాలలో పడుతూ ఉంటాయి. భూమధ్య రేఖపై సూర్యకిరణాలు నిలువుగా పడితే, దానికి ఉత్తర దక్షిణ దిశల్లో భూమధ్య రేఖ వద్ద వేడి ఎక్కువగా ఉంటుంది. భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపు వెళ్ళే కొద్దీ వేడి తక్కువగా ఉంటుంది.

ఈ విషయం సరిగ్గా అర్థం కావడానికి చిన్న ప్రయోగం చేయవచ్చు. ఒక పెద్ద గ్లోబు తీసుకొని దాని మధ్య మధ్య భాగంలో టార్చిలైటు వేశామనుకోండి దాని నుంచి వచ్చిన కాంతి గుండ్రంగా కేంద్రీకృతమవుతుంది. అదే టార్చిని కొద్దిగా వంచి గ్లోబుపై వేశామనుకోండి అది పల్చగా ఎక్కువ భాగం విస్తరిస్తుంది. అందుకే ఆ భాగాల్లో వేడి తక్కువగా ఉంటుందన్నమాట. కిరణాలు ఏటవాలుగా పడితే వేడి తక్కువగా ఎందుకుంటుందో చూద్దాం. భూమి పై ఏటవాలుగా పడే సూర్యకిరణాలు వాతావరణంలో ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వుంటుంది. వాతావరణంలోని గాలి, దుమ్ము కణాలు, నీటి ఆవిరి తదితర పదార్థాలు కిరణాలలోని అధిక భాగం వేడిని గ్రహించడం జరుగుతుంది. అందువల్ల ఆ సూర్యకిరణాలు, ఆయా ప్రాంతాల్లో ఎక్కువ వేడిని కలిగించవు. అదే భూమధ్య రేఖ ప్రాంతాల్లో సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడతాయి కాబట్టి వాతావరణంలో తక్కువ దూరం ప్రయాణిస్తాయి. అందువల్ల అవి కోల్పోయే ఉష్ణం కూడా తక్కువగా ఉంటుంది. అందుకనే ఆ సూర్యకిరణాలు భూమధ్య రేఖ ప్రాంతాల్లో ఎక్కువ వేడిని కలిగించగలుగుతాయి.

కేవలం సూర్యకిరణాలే కాకుండా ఆయా ప్రాంతాల్లో నీటి విస్తరణ, సముద్ర మట్టం నుంచి ఆ ప్రదేశం ఎంత ఎత్తులో ఉంది, సముద్ర తీరానికే ఎంత దూరంలో ఉందనే అంశాలపైన కూడా ఆయా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత ఆధారపడి ఉంటుంది.
  •  

  • ======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...