దేశ ఆర్ధికాభిఫృద్ధి లో ఇంధన వనరులు కీలకపాత్ర వహిస్తాయి . ఇందనవనరులు ప్రధానముగా 2 రకాలు --
- సంప్రదాయ ఇంధన వనరులు (Conventional source of energy),
- సంప్రదాయేతర ఇంధన వనరులు (Non-conventional source of energy)
సంప్రదాయ ఇంధన వనరులు అంటే : సుధీర్ఘ కాలంగా వినియోగం లో ఉన్న వనరులని అర్ధము . అవి ....
- బొగ్గు ,
- చమురు ,
- సహజ వాయువు ,
- జలవిధ్యుత్ శక్తి ,
- అణుశక్తి ,
వీటిలో జలవిద్యుత్ శక్తి తప్ప మిగిలినవన్నీతరిగిపోయే(Exhaustible) ఇందన వనరులని గమనించాలి . ఒక్కసారి మాత్రమే వినియోగించుకోగలిగినవని (once used they are lost for ever)అర్ధము . వీటిని పున:స్థాపితం చే్యడానికి (Renewable) వీలుకాదు .
సంప్రదాయేతర ఇంధన వనరులు : వీటినే NRSE (new & renewable sources of energy) అంటే నూతన పున:స్థాపిత ఇంధన వనరులు అని కూడా పేరు ... భూగ్రహము ఉన్నంత వరకు ప్రతినిత్యము వినియోగిచుకునా ఇవి తరిగిపోవు . ఈ రకానికి చెందినవి -->
- సౌరశక్తి (Solar energy) ,
- పవన శక్తి (Wind energy) ,
- బయోగ్యాస్ (Bio-gas energy) ,
- బయోమాస్ (Bio-mas energy) ,
- భూతాపశక్తి (Geo-thermal energy) ,
- సముద్ర తరంగ శక్తి (Ocen tidal energy) ,
- చిన్న తరహా జలవిద్యుత్ కేంద్రాలు (Small hydal projects)
- హైడ్రోజన్ శక్తి (Hydrogen energy) ,
- జీవ ఇందన వనరులు (Bio energy) .
ఈ పున:స్థాపిత ఇంధన వనరులు కాలుష్య -రహితమైనవి కాబట్టి వీటిని ' పర్యావరణ మిత్ర-ఇంధన వనరులు అనీ ... వీటిని ఎక్కడ అవసరమైతే అక్కడ ఉత్పత్తి చేసుకోవచ్చు కాబట్టి " వికేంద్రీకరణ ఇంధన వనరులు " అని ... సంప్రదాయ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయము గా అభివృద్ధి చేయడము తో " ప్రత్యామ్నాయ ఇంధన వనరులు " అనీ అంటారు .
ఇం'ధనానికి' రెక్కలు!
పెట్రో ధరలపై నియంత్రణ పగ్గాలను కేంద్రం వదిలేసింది. తద్వారా వీటి ధరలకు రెక్కలు తొడిగింది. సామాన్యుడ్ని ఇది కోలుకోలేని దెబ్బతీసింది. ఈ పరంపర మున్ముందు కొనసాగేలా ఉంది. దీనివల్ల ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకే అవకాశం కనపడుతోంది. భవిష్యత్‌లో వీటి ధరలు ఏ స్థాయికి పెరుగుతాయోనని అందరూ ఆందోళన చెందుతున్నారు.
-
పెట్రోలు, డీజిల్, కిరోసిన్, బొగ్గు వంటి శిలాజ ఇంధనాలపై అతిగా ఆధారపడడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. సూటిగా చెప్పాలంటే అమెరికా, భారత్ సహా అనేక దేశాలు చమురు అనే వ్యసనానికి బానిసలయ్యాయి. భారత్‌లో ఉన్న ముడిచమురు నిల్వలు అత్యంత స్వల్పం. ప్రపంచ శిలాజ ఇంధన నిల్వల్లో మన వాటా 1 శాతం కన్నా తక్కువే. జనాభా వాటా మాత్రం 16 శాతంగా ఉంది. దేశంలో ఏటా లక్షల సంఖ్యలో కొత్త వాహనాలు వచ్చిపడుతున్నాయి. మరోపక్క కాలం చెల్లిన వాహనాలూ యథేచ్ఛగా తిరుగుతున్నాయి. ఇవి పెట్రోలు, డీజిల్‌ను తెగ తాగేస్తున్నాయి. ఫలితంగా దేశంలో చమురు వినియోగం అంతకంతకూ పెరిగిపోతోంది. భారత్‌లో వినియోగమవుతున్న చమురులో 79 శాతం దిగుమతుల ద్వారానే వస్తోంది. భారీగా విదేశీ మారకద్రవ్యాన్ని ఇందుకోసం వెచ్చించాల్సి వస్తోంది. సొమ్ము పోయి శనిపట్టే అన్న చందంగా వీటి వినియోగం వల్ల వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది.
ఏర్పడేదిలా..
జీవం ఆవిర్భవించిన తొలినాళ్లలో మొక్కలు, జంతువులు చనిపోయాక కుళ్లిపోయాయి. వీటిలో ఎక్కువగా ఫైటోప్లాంక్టన్, జూప్లాంక్టన్‌లు ఉన్నాయి. ఇవి సముద్రాల్లో నివసించేవి. ఈ జీవులు చనిపోయాక.. వీటి శిలాజాలు సముద్ర అడుగుభాగంలోకి చేరేవి. ఆ తరువాతికాలంలో పీడనం, ఉష్ణం కారణంగా ఇవి చమురు, వాయువు, బొగ్గుగా మారాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొక్కలు, జంతువుల శిలాజాల నుంచి ఏర్పడ్డాయి కాబట్టి వీటిని శిలాజ ఇంధనాలుగా పేర్కొంటున్నారు. చమురు క్షేత్రాలు అంటార్కిటికా ఖండంలో తప్ప ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా దొరుకుతాయి. వీటిలో ఎక్కువగా హైడ్రోకార్బన్‌లు ఉంటాయి. శక్తి నిల్వ ఉంటుంది. అందుకే ఇవి మనకు ప్రాణాధారమయ్యాయి. ఈ శక్తి పరమాణు బంధాల్లో ఉంటుంది. శిలాజ ఇంధనాలను మండించడం ద్వారా మనం శక్తిని విడుదల చేస్తున్నాం. 20వ శతాబ్దం మొత్తాన్ని ఈ ఇంధనాలే శాసించాయి.
విచ్చలవిడితో వినాశనం
* ఈ శిలాజ ఇంధనాలు రాత్రికి రాత్రే ఏర్పడలేదు. లక్షల సంవత్సరాలు సమయం పట్టింది. ఈ స్పృహ లేకుండా మనం విచ్చలవిడిగా వీటని వాడేస్తున్నాం. ఫలితంగా ఇవి అడుగంటిపోయే పరిస్థితి వస్తోంది.
* భూమి మీద ఇంకా 1.05 ట్రిలియన్ పీపాల ముడి చమురు ఉందనేది అంచనా. ప్రపంచవ్యాప్తంగా వార్షిక వినియోగం 24 బిలియన్ పీపాల మేర ఉంది. వినియోగం ఈ స్థాయిలోనే ఉంటే 2053 నాటికి భూమి మీద ముడి చమురు ఉండదనేది అంచనా. ఒకవేళ వినియోగం ఎక్కువైతే మరింత త్వరగా చమురు బావులు ఖాళీ అవుతాయి.
* ఒక కారు ఏటా సరాసరిన 600 పీపాల చమురును తాగుతుందని అంచనా. ఈ లెక్కన ఇది 12వేల పౌండ్ల కార్బన్ డైఆక్సైడ్‌ను విడుదల చేస్తుంది. ఈ విషవాయువును గ్రహించడానికి 240 చెట్లు అవసరం. దేశంలో ఉన్న కార్లు వదిలే వాయువును పీల్చుకోవడానికి ఎన్ని చెట్లు కావాలో అర్థంచేసుకోండి.
* పెరుగుతున్న వాహనాలకు అనుగుణంగా వృక్షాలు పెరగకపోగా.. వేగంగా తరిగిపోతున్నాయి. భారత్‌లో ఐదింట మూడొంతుల బొగ్గు గనులు అటవీ ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ లెక్కన బొగ్గును తవ్వడానికి ఎంత అటవీ భూమిని నాశనం చేశారో అర్థంచేసుకోవచ్చు.
అమెరికాలో దారుణం
అమెరికాలో శిలాజ ఇంధనాల వినియోగం మరీ ఎక్కువగా ఉంది. ఏటా 152.4 బిలియన్ గ్యాలన్ల చమురు అక్కడ వాడేస్తున్నారు. ప్రపంచ జనాభాలో ఆ దేశ వాటా 5 శాతం మాత్రమే. చమురును మాత్రం 26 శాతం మేర వాడేస్తున్నారు.
* ఈ సమస్యను గుర్తించిన అధ్యక్షుడు బరాక్ ఒబామా.. ఇథనాల్ ఉత్పత్తిని పెంచేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. ప్రస్తుతం అక్కడ 12 బిలియన్ గ్యాలన్ల బయోఇంధనాలు ఉత్పత్తవుతున్నాయి. 2022 నాటికి వీటిని 36 బిలియన్ గ్యాలన్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివల్ల పెట్రో వినియోగం ఏటా 328 మిలియన్ బ్యారళ్ల మేర తగ్గుతుంది.
పన్ను మంత్రం ఫలించదు
భారత్‌లోనూ వినియోగం అధికంగానే ఉంది. ఇక్కడ రోజుకు దాదాపు 26.7 లక్షల పీపాల చమురు ఖర్చవుతోంది. ఈ వినియోగాన్ని తగ్గించేందుకు దీనిపై కార్బన్ పన్ను విధించాలని పారిశ్రామిక రంగానికి చెందిన పలువురు పెద్దలు ప్రభుత్వానికి సూచించారు. ఇలాంటి పన్నుల వల్ల స్వల్పకాలంలో వినియోగం తగ్గితే తగ్గొచ్చేమోగాని దీర్ఘకాలంలో మాత్రం ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవచ్చని పలువురు నిపుణులు చెబుతున్నారు. పైగా ఈ చర్య ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారి తీస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.
ప్రత్యామ్నాయాలే మేలు
అనేక ప్రతికూలతల నేపథ్యంలో శిలాజ ఇంధన ఆధారిత ఆర్థిక వ్యవస్థ ఏ మాత్రం ప్రయోజనకరం కాదు. వీటి ఉత్పత్తి తగ్గేకొద్దీ ధర పెరిగిపోతూ వస్తుంది. ఈ ఇబ్బందులను గుర్తించిన ప్రపంచ దేశాలు ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టిసారించాయి. సౌర, పవన, బయో
ఇంధనాలు, అలల శక్తి, హైడ్రోజన్ వంటివి ఈ జాబితాలో ఉన్నాయి.
* పునర్‌వినియోగ ఇంధనాల్లో నిస్సందేహంగా అగ్రస్థానం సౌరశక్తిదే. ఉష్ణమండల దేశమైన భారత్‌కు ఈ రంగంలో అనేక అవకాశాలు
ఉన్నాయి. భారత్.. ఏటా సుమారు 5వేల ట్రిలియన్ కిలోవాట్ అవర్లకు సమానమైన సౌరశక్తిని అందుకుంటోంది. ఇది దేశ మొత్తం ఇంధన వినియోగం కన్నా చాలా ఎక్కువ. ఫొటోవోల్టాయిక్ సెల్స్ ద్వారా దీన్ని ఒడిసిపట్టి విద్యుత్‌గా మార్చుకోవచ్చు. 2050 నాటికి ప్రపంచ ఇంధన వినియోగంలో సౌర విద్యుత్ వాటా 25 శాతంగా అవకాశం ఉందని 'గ్రీన్‌పీస్' సంస్థ ఇటీవల తెలిపింది.
* సౌర కుక్కర్ల ద్వారా వంట గ్యాస్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. సౌర వాటర్‌హీటర్లు, ఏసీలు, మోటార్లు, వీధి దీపాలు, నీటి శుద్ధి యంత్రాలు, సౌర కార్లు, ఫ్రిజ్‌లనూ విరివిగా అందుబాటులోకొస్తే ప్రయోజనం ఉంటుంది.
* 2022 నాటికి 20వేల మెగావాట్ల సౌరవిద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకొంది. అయితే భారీస్థాయిలో సౌరఫలకాలు ఏర్పాటు చేయడానికి నిధుల లభ్యత ప్రతిబంధకంగా మారుతోంది. ప్రస్తుతమున్న పరిజ్ఞానంతో ఇంధన సామర్థ్యం తక్కువగా ఉంటోంది. వీటిని అధిగమించడానికి విస్తృతంగా పరిశోధనలు జరగాలి.
మొక్కజొన్న వంటి పంటల నుంచి ఇథనాల్ వంటి బయోఇంధనాలను అభివృద్ధి చేయవచ్చు.పెట్రోలు, డీజిల్ కన్నా ఇది చాలా చౌక. హానికారక వాయువులను చాలా తక్కువ స్థాయిలో విడుదల చేస్తుంది.
విద్యుదుత్పత్తి, రవాణా రంగాల్లో పర్యావరణ అనుకూల ఇంధనంగా హైడ్రోజన్ అక్కరకొస్తుంది. ఈ వాహనాల నుంచి పొగ వెలువడదు. నీరు మాత్రమే విడుదలవుతుంది.
విద్యుత్ వాహనాలను వాడడం వల్ల కాలుష్యం తగ్గుతుంది. భారత్‌లో ప్రస్తుతం రెవా అనే ఎలక్ట్రిక్ కారు వాడుకలో ఉంది.
సంపీడిత వాయువును కూడా వాహనాల్లో ఇంధనంగా వాడుకోవచ్చు. ఇలాంటి కారు తయారీకి టాటా మోటార్స్ ఇప్పటికే ఫ్రెంచ్ సంస్థ ఎండీఐతో చేతులు కలిపింది.
- ==============================================
visit My website >
Dr.Seshagirirao - MBBS.