Wednesday, March 11, 2015

Mosquito repellents not good?-దోమల మందులు వాడకూడదా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

  •  

  •  
ప్రశ్న: దోమల్నించి కాపాడుకోవడానికి వాడే మస్కిటో కాయిల్స్‌, లిక్విడ్స్‌ మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయా?
జవాబు: దోమల్లో ఆడ దోమలే మనుషుల, ఇతర క్షీరదాల రక్తాన్ని పీలుస్తాయి. రక్తంలో ఉన్న ప్రత్యేకమైన ప్రోటీను ఆడ దోమల్లో జరిగే అండోత్పత్తికి అవసరం. అంతేకాదు, రక్తం పీల్చడం ద్వారా ఆడ దోమ పొట్ట ఉబ్బితేనేగానీ ఆ ఒత్తిడికి అండాశయం నుంచి అండాలు ఉత్పత్తి కావు. మనుషులు, ఇతర క్షీరదాల చర్మం నుంచి చాలా స్వల్పంగా విడుదలయ్యే కార్బన్‌డయాక్సైడ్‌, లాక్టిక్‌ ఆమ్లాలను వాసన చూడ్డం ద్వారా దోమలు మనుషుల్ని ఇతర రక్త జీవుల్ని గుర్తిస్తాయి. కాబట్టి కార్బన్‌డయాక్సైడ్‌ను, లాక్టిక్‌ ఆమ్లాలను గుర్తించే యంత్రాంగాన్ని భగ్నం చేయడం ద్వారా దోమలు మనుషుల్ని చేరుకోకుండా చేయవచ్చును. ఈ సూత్రం ఆధారంగా NN-డైయిథైల్‌ మెటాటోలమైడ్‌ (DEET)వంటి పదార్థాల్ని తేలిగ్గా ఆవిరయ్యే ద్రావణాల్లో సుమారు 8శాతం గాఢతతో ఉండేలా లిక్విడ్స్‌ సరఫరా చేస్తున్నారు. మస్కిటో రిపెల్లెంట్‌ లిక్విడ్స్‌ను ప్రత్యేక బాటిళ్లలో వేడి చేయడం ద్వారా DEETఆవిర్లు గాల్లోకలుస్తాయి. ఇవి దోమల ఘ్రాణ కణాల్ని తాకినపుడు వాటికున్న గ్రాహణశక్తి నశిస్తుంది. మస్కిటో కాయిల్స్‌లో కూడా దాదాపు ఇదే యంత్రాంగం ఉంటుంది. పైగా కొన్ని సహజ కీటక వికర్షక పదార్థాలను కూడా కాయిల్స్‌లో కలుపుతారు. సహజమైనవైనా, కృత్రిమమైనవైనా మస్కిటో కాయిల్స్‌లో, లిక్విడ్స్‌లోను ఉన్న రసాయనాలు ఆరోగ్యానికి మంచిది కాదు. అదే పనిగా రోజూ వాటిని వాడినట్లయితే అవాంఛనీయమైన అనారోగ్యస్థితులు రాగలవు. దోమల నివారణకు ఉత్తమ మార్గం, పరిసరాల శుభ్రత, ఆపై దోమతెరల వాడకమే!

- ప్రొ ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌,-శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
  • =============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...