Saturday, March 07, 2015

సముద్రంలో అలలు ఎలా ఏర్పడతాయి?.తీరానికి దూరంగా కన్నా తీరం చేరేటప్పటికి ఎత్తు ఎక్కువెందుకు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...



 ప్రశ్న:  సముద్రంలో అలలు ఎలా ఏర్పడతాయి?.తీరానికి దూరంగా కన్నా తీరం చేరేటప్పటికి ఎత్తు ఎక్కువెందుకు?

జవాబు: కొంచెం లోతైన ప్లాస్టిక్‌ ట్రేలో నీళ్లు పోసి నీటి ఉపరితలానికి సమాంతరంగా మెల్లగా గాలి వూదండి. ఆ ట్రే అంతా చిన్న తరంగాలు కదలడాన్ని చూడవచ్చు. ఈ విధంగానే సముద్ర ఉపరితలంపై అలలు ఏర్పడతాయి.

సముద్రాల సగటు లోతు 3.7 కిలోమీటర్లు ఉంటుంది. సముద్రాలలో ఉండే విస్తారమైన నీటి ఉపరితలంపై గాలి తీవ్రంగా వీచడం వల్ల అలలు ఏర్పడతాయి. సముద్రపు నీటి ఉపరితలంపై సమాంతరంగా గాలి వీచడం వల్ల ఆ నీరు పైకి లేస్తుంది. పైకి లేచిన నీటిని భూమి గురుత్వాకర్షణ శక్తి కిందికి లాగుతుంది. పైకి లేచిన అల కిందికి పడినపుడు ఏర్పడే గతిజశక్తి వల్ల కూడా తిరిగి కొంత నీరు పైకి లేస్తుంది. పైకీ, కిందికీ వూగుతున్న నీటి కదలిక చుట్టుపక్కల కూడా వ్యాపించి అలలు నిరంతరంగా కనిపిస్తాయి. సముద్రపు లోతులలోకి వెళ్లే కొలదీ నీటి సాంద్రత ఎక్కువగా ఉండటంతో అలల కదలికకు ప్లవనశక్తి కూడా తోడై మరింతగా అలలు ఏర్పడతాయి.

సముద్ర ఉపరితలంపై వీచేగాలి వేగం ఎక్కువయ్యేకొలదీ అలల ఎత్తు ఎక్కువవుతుంది. అలల ఎత్తుతోపాటు వాటి మధ్య దూరం కూడా ఎక్కువవుతుంది. ఒక దశ తర్వాత గాలి తీవ్రత ఎంతగా ఉన్నా అలల ఎత్తు కొంత గరిష్ఠ స్థాయికి మాత్రమే పరిమితమవుతుంది. తీరానికి దూరంగా ఉన్న సముద్రంలోపలి లోతైన ప్రదేశాల్లో అలల ఎత్తు తక్కువగా ఉంటుంది.

తీరానికి చేరుకొనే కొద్దీ లోతు తక్కువ కావడంతో వాటి వేగం, వాటి మధ్యదూరం తగ్గుతాయి. వాటి ఎత్తు మాత్రం పెరుగుతుంది. చివరకు అలలు తీరం చేరేటప్పటికి వాటి ఎత్తు మరీ ఎక్కువై అలలు ఒకదానిపై ఒకటి విరిగిపోవడం వల్ల నురగ వ్యాపిస్తుంది. ఇలా నిమిషానికి పదికి మించి విరిగితే తీరంపై ఉన్న పదార్థాలను తన లోపలికి లాక్కుంటాయి. పది కన్నా తక్కువగా విరిగితే సముద్రంలోని గవ్వలు, ఆలు చిప్పలు లాంటి పదార్థాలు తీరంలోకి వచ్చిపడతాయి.

ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌
  • =======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...