ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్రశ్న: ఎవరైనా గిలిగింతలు పెట్టినప్పుడు నవ్వెందుకు వస్తుంది?
జవాబు : మన శరీరంలో ఎన్నో అవయవాలు, అవయవ భాగాలు ఉన్నా, అందులో కొన్ని చాలా సున్నితమైనవి. ఆ భాగాల్లో ప్రాణప్రదమైనవి, జీవానికి చాలా విశిష్టమైన అంతర్భాగాలు ఉంటాయి. ఉదాహరణకు చంకల కింది భాగంలో ఉన్న ఉరఃపంజరం(chest) చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అందులోనే జీవానికి అతి ముఖ్యమైన ఊపిరితిత్తులు, గుండె లాంటి భాగాలు ఉంటాయి. అలాగే మెడ భాగంలో మెదడుకు, శరీరానికి అనుసంధానమైన నాడులు, రక్తనాళాలు, శ్వాసనాళం, ఆహార వాహికలాంటి కీలక భాగాలు ఉంటాయి. ఇలాంటి ముఖ్యమైన అవయవాలుండే భాగాల్లో బయట నుంచి ఎలాంటి స్పర్శ, లేదా వత్తిడి కలిగినా దానికి వెంటనే స్పందించి, నిరోధించే వ్యవస్థ శరీరంలో ఉంటుంది. ఆయా భాగాల్లో నాడీతంత్రులు బాగా విస్తారంగా ఉంటాయి. అందువల్లనే ఇతరులు ముట్టుకోగానే కితకితల రూపంలో మెదడుకు సందేశాలు అందుతాయి. ఆ స్పర్శ, వత్తిడులను నివారించేందుకు మెదడు మన శరీరాన్ని పురికొల్పుతుంది. అందువల్లనే మనం చటుక్కున నవ్వుతూ తప్పించుకోడానికి ప్రయత్నిస్తాం.
- ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; --రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- ======================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...