ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్ర : Mangos are available only in summer Why?, మామిడి పండ్లు వేసవికాలములోనే దొరుకుతాయి ఎందుకు?
జ : ఇటువంటి రుచికరమైన పండ్లు సంవత్సరం పొడుగునా దొరికితే ఎంత బావుంటుందో! కానీ అలా దొరకవు కదా! వేసవిలోనే దొరుకుతాయి. ఉగాది వచ్చిందంటే వేపపూత పూస్తుంది. మామిడిచెట్లూ ఏపుగా పూచి, పిందెలు వేస్తాయి. అప్పటి నుండి రెండు మూడు నెలలు మాత్రమే కాయలు, పండ్లు దొరుకుతాయి. పరిశీలించి చూడండి.. రకరకాల వృక్షాలు కొన్ని ఋతువుల్లో మాత్రమే పుష్పిస్తాయి. ఇలా ఎందుకు జరుగుతుందని అమెరికా దేశ శాస్త్రజ్ఞులు డబ్ల్యు. డబ్ల్యు.గార్నరు, ఎం.ఎ.అల్లార్టు అనేవారు 1918లో పరిశోధనలు జరిపారు. వృక్షాలు పుష్పించటం సూర్యరశ్మి లభించే కాలంపై ఆధారపడి ఉంటుందని కనుగొన్నారు. కొన్ని ఋతువుల్లో త్వరగా సూర్యాస్తమయం అవుతుంది. వసంతఋతువు నుండ పగటి కాలం అధికమవుతుంది. జూన్ 21కి తక్కువ వస్తుంది. తరువాత పగటికాలం తగ్గుతూ, డిసెంబరు 21 నాటికి చాలా తగ్గిపోతుంది. పగటికాలం అధికంగా ఉన్నప్పుడు కొన్నిరకాల మొక్కలు పుష్పిస్తాయి. వీటినే 'దీర్ఘ దిన పుష్పితాలు' (లాంగ్ డే ప్లాంట్స్) అంటారు. మామిడి, వేప ఆ కోవకు చెందినవే. అందుకే మనకు మామిడికాయలు వేసవిలో మాత్రమే దొరుకుతాయి.
మామిడిపండ్లు అబ్బ.. ఎన్ని రకాలని! ఒకటా రెండా - బోలెడన్ని రకాలు. ప్రపంచం మొత్తం మీద 600 రకాల పండ్లున్నాయని శాస్త్రవేత్తల అంచనా. మన దేశంలో మామిడి పండ్లకు ఎన్నో పేర్లున్నాయి. వీటిని చూస్తేనేకాదు పేరు వింటేనే నోరూరిపోతుంది. పండునుబట్టి, రంగు, రుచిని బట్టి, గుజ్జును బట్టి రకరకాల పేర్లు వీటికి వచ్చాయి. పండు ఆకారాన్ని బట్టి స్వర్ణరేఖ, చిన్నరసం, పెద్దరసం, గుండూలడ్డూ, బాట్లి, కర్బూజా... ఇలా ఎన్నోపేర్లు.. ఇంకా అలంపూర్, బేనిశాన్, బంగినపల్లి, చెరుకురసం, హిమాయుద్దీన్, కోలంగోవ, ఫిరంగి, లడ్వ, కొత్తపల్లి, కొబ్బరి, రాజుమాను, నీలం, పులిహోర, రుమాని, మాల్గోవ, దశేరి, 'అల్ఫాంసో' అనే ఫ్రెంచి వ్యక్తి పేరు ఒక పండుకుంది. 'కలెక్టర్' (తోతాపురి), బాద్‌పాష్‌లాంటి పదవుల పేర్లు కూడా కొన్ని పళ్లకు అమరాయి.
- =========================