ప్రశ్న: క్లోనింగు ద్వారా జీవుల్ని పుట్టించవచ్చంటారు. ఆ ప్రక్రియ ఎలా సాధ్యం?
-ఎ. శంకర్, రాజంపేట (కడప)
జవాబు: క్లోనింగ్ అంటే కోన్ల (Clones)ను తయారు చేయడం. క్లోన్ అంటే ప్రతిరూపం(duplicated copy) అని అర్థం. ఏ జీవి అయినా జీవకణాల(సెల్స్)తో రూపొందినదేనని తెలుసు కదా? ఈ కణాలలో ప్రధానంగా రెండు రకాలున్నాయనుకోవచ్చు. ఒకటి సోమాటిక్ సెల్ అయితే, రెండోది జెర్మ్ సెల్. జెర్మ్ సెల్స్‌నే పునరుత్పత్తి కణాలంటారు. ఆడ జాతిలో వీటిని అండ కణాలనీ, మగ జాతిలో వీటిని శుక్ర కణాలనీ పిలుస్తారు. ఇవి మినహా మిగతా శరీరమంతా ఉండే కణాలను సోమాటిక్ సెల్స్ అంటారు. ప్రతి కణంలోనూ కేంద్రకం (న్యూక్లియస్) ఉంటుందని తెలుసు కదా? అలా సోమాటిక్ కణాల కేంద్రకంలో క్రోమోజోములు జతలుగా ఉంటాయి. అదే జెర్మ్‌సెల్స్ కేంద్రకంలో ఒంటరి క్రోమోజోములు ఉంటాయి.
సహజంగా సంతానోత్పత్తి జరిగేప్పుడు ఆడ, మగ జాతుల కలయిక వల్ల అండ, శుక్ర కణాలలోని ఒంటరి క్రోమోజోములు జతగూడి పిండకణం (జైగోట్)గా ఏర్పడుతాయి. ఆపై అది కణ విభజన చెందుతూ శిశువుగా రూపొందుతుంది.
ఇప్పుడు కృత్రిమంగా జరిగే క్లోనింగ్ ప్రక్రియ దగ్గరకి వద్దాం. ఆడజాతికి చెందిన జీవి అండకణాన్ని తీసుకుని దానిలోంచి ఒంటరి క్రోమోజోములతో కూడిన కేంద్రకాన్ని తొలగించి, కేవలం అండకణ కవచాన్ని మిగులుస్తారు. ఆ తర్వాత సోమాటిక్ కణాన్ని తీసుకుని అందులో జంట క్రోమోజోములతో కూడిన కేంద్రకాన్ని వేరు చేసి, అండకణ కవచంలో ప్రవేశపెడతారు. ఇలా ఏర్పడిన కొత్త అండ కణంలో జంట క్రోమోజోములున్న కేంద్రకం ఉందన్నమాట. ఆపై కొన్ని రసాయనిక మార్పులు చేయడం ద్వారా ఈ అండకణం పిండకణం (జైగోట్)లాగా ప్రవర్తిస్తుంది. అప్పుడు దీన్ని ఆడ జీవి అండాశయంలో ఉంచుతారు. అందులో కణవిభజన జరుగుతూ శిశువుగా ఎదుగుతుంది. నిర్ణీత గర్భధారణ సమయం తర్వాత ఆ జీవి క్లోనింగ్ శిశవును ప్రసవిస్తుంది.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- ===============================