Tuesday, January 25, 2011

Who are Seven Rishis in Hindu epics?, Sapta Rishis , హిందూ పురాణాల్లో సప్త ఋషులెవరు ?

భారతీయ పరంపరాగత పౌరాణిక కథనాల ప్రకారం ప్రతివారి వంశానికి ఓ రుషి మూలపురుషుడిగా ఉన్నాడు. ప్రాచీన రుషుల వంశానుక్రమమే నేటి భారతీయ సంతతి. కొందరికి గోత్రరూపంలో వారి పూర్వ రుషులు ప్రతిరోజూ స్మరణీయులే. మరికొందరికీ వారి పూర్వ రుషులు తెలియకపోయినప్పటికీ వారి వంశాలకు రుషులున్నారు.


ఎంతోమంది రుషుల ప్రతినిధులుగా సప్తర్షులను పూజించటం ఆనవాయితీగా వస్తున్నది.
  • 1.కశ్యపుడు,
  • 2.అత్రి,
  • 3.భరద్వాజుడు,
  • 4.విశ్వామిత్రుడు,
  • 5.గౌతముడు,
  • 6.జమదగ్ని,
  • 7.వసిష్ఠుడు... వీరు ఏడుగురు పూజనీయులు.

రాక్షసులు హరించిన భగవద్దత్తమైన వేదాలను మహావిష్ణువు వ్యాసుని రూపంలో అవతరించి ఉపనిషత్తులు, పురాణాల రూపేణా మనకందించాడు. వ్యాసుడు నాలుగు తలలు లేని బ్రహ్మ, రెండు బాహువులు గల విష్ణువు, మూడో కన్ను లేని శివుడని అంటారు.

1. సప్తర్షుల్లో కశ్యపుడు ఒక ప్రజాపతి (మరీచి కళల పుత్రుడు). దక్షప్రజాపతి పుత్రికల్లో పదమూడు మందిని, వైశ్వానరుని పుత్రికల్లో ఇద్దరిని పెళ్ళాడాడు. వారి ద్వారా దైత్యులు, ఆదిత్యులు, దానవులు, సిద్ధులు, గంధర్వులు, అప్సరసలు, మానేయులు, యక్షులు, రాక్షసులు, వృక్షలతాత్పణ జాతులు, సింహ, మృగ, సర్పాలను, పక్షులను, గోగణాలను, అనూరుడు, గరుడుడు, నాగులు, కాలకేయులను, పౌలోములను, పర్వతుడు అనే దేవర్షిని, విభండకుడు అనే బ్రహ్మర్షిని పుత్రులుగా పొందాడు.

2. సప్తర్షుల్లో రెండోవాడైన అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకడు. అతని భార్య అనసూయ. అత్రి తన తపోబలంతో త్రిమూర్తులను పోలిన సోమ, దూర్వాస, దత్తాత్రేయులను కుమారులుగా పొందాడు. అత్రి భార్య అనసూయ పతివ్రతా శిరోమణి.

3. భరద్వాజుడు ఉతథ్యుని పుత్రుడు. తల్లి పేరు మమత. బృహస్పతి కృప వలన జన్మించి, ఘృతాచీ పట్ల చిత్తచాంచల్యం పొంది, ఘటంలో ద్రోణ జన్మకు కారకుడవుతాడు.

4. విశ్వామిత్రుడు రాజర్షి. త్రిశంకుని స్వర్గానికి పంపడానికి కొంత తపోఫలాన్ని, హరిశ్చంద్రునిచే అసత్యమాడించ కొంత ఫలాన్ని, మేనక వల్ల తపోవిఘ్నం పొంది శకుంతలా జననానికి మూలపురుషుడయ్యాడు. దుష్యంతుడు, శకుంతలల పుత్రుడే భారతదేశ నామకరణానికి ఆదిగా నిలిచాడు.

5. తీవ్ర క్షామం ఏర్పడినప్పుడు రుషులు, మునులందరికీ గౌతముడు తన తపోబలంతో భోజన వసతి కల్పించాడు. ఇతర రుషుల ఈర్ష్య వలన మాయా గోవును దర్భతో అదిలించి, బ్రహ్మహత్యా పాతకం అంటగట్టుకొన్నాడు. ఆ దోష పరిహారం కొరకు గోదావరిని భూమిపైకి తెచ్చిన మహర్షి, తన భార్య అహల్యను శిలగా మారేటట్లు శాపమిచ్చిందీ ఆయనే.

6. జమదగ్ని రుషి- రుచికముని, సత్యవతుల కుమారుడు. జమదగ్ని కుమారుడే పరశురాముడు. జమదగ్ని భార్య రేణుక మనసులో కలిగిన అన్యపురుష వ్యామోహం వలన, ఆమెను తన కొడుకైన పరశురామునిచే నరికించాడు. ఆ తరవాత పరశురాముడి ప్రార్థన మేరకు ఆమెను పునర్జీవితురాలిని చేశాడు.

7. ఏడో రుషి వసిష్ఠుడు. ఇతని భార్య అరుంధతి. వసిష్ఠుడు బ్రహ్మమానస పుత్రుల్లో ఒకడు. వైవస్వత మన్వంతరాన సప్తర్షుల్లో ఒకడు. శక్తి మొదలైన వందమంది పుత్రులు గలవాడు. దక్ష ప్రజాపతి పుత్రిక ఊర్జ ద్వారా రజుడు, గోత్రుడు, ఊర్ధ్వబాహుడు, సువనుడు, అనఘుడు, సుతవుడు, శుక్రుడు అనే ఏడుగురు పుత్రులను పొందాడు.

సప్తర్షులు తేజస్సు గలవారు కనుక వారిని పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయంటారు. ఏడు సముద్రాలు, ఏడు కుల పర్వతాలు, ఏడుగురు రుషులు, ఏడు ద్వీపాలు, ఏడు భువనాలు, ప్రాతఃకాల స్మరణతో శుభాలను కలగజేస్తాయంటారు.
  • =================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...