Tuesday, September 07, 2010

పిడుగులతో ప్రమాదాలు ఎలా? , Thunderbolt cause dangers how?
మేఘాలు ఒరిపిడివల్ల వాటిలో విద్యుదావేశం పేరుకుపోతూ ఉంటుంది. దీనివల్ల వాటిమీద విద్యుత్ పీడనం బాగా పెరిగిపోతుంది. ఇది నేలమీదకు దూకాలంటే గాలి అడ్డుగా నిలుస్తుంది. ఈ విద్యుత్ పీడనం అనేక వందల కోట్ల వోల్టులకు పెరగడంతో గాలి పరమాణువుల మీది ఎలక్ట్రానులను పీకేస్తుంది. దానితో గాలి అయాన్లు తయారై తనగుండా విద్యుత్‌ను ప్రవహించేందుకు అనుకూలతను కల్గిస్తుంది. విద్యుత్ ప్రవాహానికి గాలి సన్నని దారిని ఈ విధంగా ఏర్పరుస్తుంది. ఈ దారిగుండా విద్యుత్ అనేక లక్షల ఆంపియర్ల బలం గలది ప్రవహిస్తుంది. ఫలితంగా దారిలోని ఉష్ణోగ్రత 15వేల నుండి 20వేల డిగ్రీల సెలిసియస్‌కు పెరిగిపోతుంది. దీనివల్ల మెరుపులు వస్తాయి. ఈ వేడివల్ల గాలి వ్యాకోచించి బాంబు పేలినంత చప్పుడవుతుంది. ఈ వేడికి చెట్లు కాలిపోతాయి. ఇళ్లు కూలిపోతాయి. జంతువులు ఈ విద్యుత్ ప్రవాహపు షాకుకు చచ్చిపోతాయి. దీనినే మనం పిడుగు అని పిలుస్తాం.
పిడుగు విద్యుత్ ప్రసారంలో ఒక విలక్షణమని తొలిసారిగా గ్రహించినది బెంజిమిన్ ఫ్రాంక్లిన్. పిడుగులు ఎత్తయిన కొండలు, గోపురాలు, చెట్ల మీద పడతాయని ఫ్రాంక్లిన్ చెప్పాడు. పిడుగులు ప్రతి సెకనుకు 100సార్లు ప్రపంచంలో ఎక్కడో ఒకచోట పడుతూ ఉంటాయని సైంటిస్టుల అంచనా. పిడుగుపాటువల్ల ఒక్కొక్కసారి అడవుల్లో మంటలు బయలుదేరి కారుచిచ్చుగా మారి పూర్తిగా అడవినే దహించి వేస్తుంది. వాతావరణంలోని నైట్రోజన్ ఆక్సైడ్‌లలో ప్రధాన భాగం మెరుపులనుండి ఉత్పత్తి అవుతోంది. ఫలితంగా గ్లోబల్ వార్మింగ్ మీద మానవ చర్యల ప్రభావాన్ని కూడా పునఃపరిశీలించాల్సి వచ్చింది. వాతావరణంలోని నైట్రోజన్ ఆక్సైడ్‌లలో 50 లక్షల టన్నులు మెరుపులవల్ల, 240 లక్షల టన్నులు ఇంధనాల దహనాలవల్ల, 80 లక్షల టన్నులు అడవులను కాల్చడంవల్ల ఏర్పడుతోందని గతంలో భావించేవారు. నిజానికి 150 లక్షల టన్నుల నైట్రోజన్ ఆక్సైడ్‌లు మెరుపులవల్లనే ఏర్పడుతున్నాయని, ట్రోపోస్పియర్‌లో నైట్రోజన్ ఆక్సైడ్ మొత్తంలో అధిక శాతం ఇలా ఏర్పడిందేనని ఇటీవల శాస్తవ్రేత్తల పరిశోధనలో వెల్లడయ్యింది.
మెరుపు వచ్చినప్పుడు ఉండే అధిక ఉష్ణోగ్రత, పీడనాల కారణంగా గాలిలో వున్న నైట్రోజన్, ఆక్సిజన్ అణువులు విచ్ఛిన్నమై తరువాత రెండూ కలిసి నైట్రోజన్ ఆక్సైడ్‌లుగా రూపొందుతాయి. ఈ నైట్రోజన్ ఆక్సైడ్‌లు ఓజోన్‌ను ఉత్పత్తిచేస్తాయి. గ్లోబల్ వార్మింగ్‌లో ఓజోన్ వాయువు ముఖ్య పాత్ర వహిస్తుందన్న విషయం తెలిసిందే. నేలను చేరే పిడుగుల్లో విద్యుత్ 36 కిలో ఆంపియర్ల వరకు ఉండవచ్చునని మూడింట రెండొంతులు మెరుపులు ఉష్ణమండల ప్రాంతాల్లోనే సంభవిస్తాయని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. ఉత్తరార్థ గోళంలో భూభాగం అధికంగా ఉండడంవల్ల పిడుగుపాట్లు ఉత్తరార్థంలోనే ఎక్కువ. దక్షిణార్థ గోళంతో పోలిస్తే ఉత్తరార్థ గోళంలో పిడుగుపాట్లు రెండింతలు ఉంటాయి. ఉత్తరార్థ గోళంలో నైట్రోజన్ ఆక్సైడ్‌లు అధికంగా ఉండడానికి కారణం మానవ చర్యలని గతంలో భావించేవారని, నిజానికి సహజంగా ఏర్పడే పిడుగులే ప్రధాన కారణమని ఇప్పుడు శాస్తవ్రేత్తలు నిర్ణయించారు. పిడుగుపాటు నుండి భవనాలకు, ఇతర నిర్మాణాలకు రక్షణ కల్పించేందుకు ‘కాపర్ లైట్నింగ్ కండెక్టర్’ను ఏర్పాటుచేయడం తెలిసిన విషయమే. అయితే పిడుగుపాటువల్ల ఏర్పడ్డ అపారమైన విద్యుత్ ప్రవాహం, కండక్టర్ చుట్టూ బలమైన పెద్ద అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది. దీనివల్ల సమీపంలోని విద్యుత్ కేబుల్స్‌లో వోల్టేజ్ మార్పులు కల్గుతాయి. కంప్యూటర్ వ్యవస్థలు, టెలివిజన్స్ దెబ్బతింటాయి. అగ్నిప్రమాదాలు సూచించే అలారమ్స్ మోగుతాయి. రైల్వే సిగ్నలింగ్ దెబ్బతింటుంది. అదృష్టవశాత్తు విమానాల నిర్మాణంలో విద్యుత్ వాహకమైన అల్యూమినియం ఎక్కువగా వాడడంవల్ల లోపలి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ పరికరాలకు రక్షణ ఉంటుంది. అయినప్పటికీ పిడుగువల్ల ఏర్పడే విద్యుత్ ప్రవాహంవల్ల విమానాలకు రంధ్రాలు పడవచ్చు. స్కార్కులవల్ల ఇంధన ట్యాంకులు అంటుకునే ప్రమాదం ఉంటుంది. విమానాన్ని పిడుగు తాకినపుడు విమాన దేహం చుట్టూ విద్యుత్ వలయం వ్యాపిస్తుంది. దీనివల్ల ఏర్పడిన అయస్కాంత క్షేత్రం తాత్కాలికంగానైనా విమానం పొడవునా వున్న కేబుల్సులో వోల్టేజ్ మార్పులు కల్గిస్తుంది. ఈ ప్రమాదాలనుండి రక్షణ పొందేందుకు శాస్తవ్రేత్తలు ఇప్పుడు ‘లైట్నింగ్ స్ట్రైక్ స్టిమ్యులేటర్’ను రూపొందించారు.

- సి.వి.సర్వేశ్వర శర్మ
  • ==============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...