ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
Q : Why do oldage and death occur in life?,ముసలితనమూ, చావూ అసలు ఎందుకు వస్తాయి?
A : ముసలితనమూ, చావూ అసలు ఎందుకు వస్తాయి? ప్రారబ్ధం, పూర్వజన్మఫలం మొదలైన చాదస్తాలను పక్కనపెడితే ప్రకృతిలో ఇటువంటిది ఎందుకు జరుగుతుందో ఆలోచించవచ్చు. దీన్ని గురించిన వైజ్ఞానిక ప్రతిపాదనలు కొన్ని ఉన్నాయి. వీటిలో ఒకటి తరతరానికీ సంతతిలోని జన్యువుల్లో యాదృచ్ఛికంగా కలిగే మార్పులకు సంబంధించినది. ఇటువంటి మ్యుటేషన్ల వల్ల కొత్త తరం ప్రాణుల్లో కొన్ని కొత్త లక్షణాలతో పుట్టవచ్చు. అయితే వీటిలో బతికేవి పరిసరాల్లో భౌతికంగానూ, భౌగోళికంగానూ అప్పుడప్పుడూ కలిగే మార్పులకు అనుగుణంగా ఉన్న ప్రాణులే. కొన్నిశరీరలక్షణాలు కలిగిన ప్రాణి మరీ ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైతే చచ్చిపోతుంది. దానికి పుట్టిన సంతానంలో ఏ ఒక్కదానికైనా అటువంటి పరిస్థితులకు తట్టుకోగలిగిన శారీరక లక్షణాలు ఉన్నట్టయితే కనీసం అదైనా బతుకుతుంది.
ఈ లెక్కన ముసలితనం అనేది ప్రాణి శరీరానికి పటుత్వం తప్పి, అంత్యదశకు చేరబోయే ముందు దశ. మనుషుల విషయంలో పెరిగే వయస్సును గురించిన అనేక భావావేశాలూ, ఉద్వేగాలూ కలగడం మామూలే కాని తక్కిన ప్రాణుల విషయంలో అటువంటి 'భేషజా'లేవీ కనబడవు. ప్రాణుల్లోని మూల జీవపదార్థం డీఎన్‌ఏ. ఇక్కడ ముఖ్యవిషయం ఏమిటంటే ప్రాణి బతికున్నన్నాళ్ళూ జీవకణాలలో ఉండే డీఎన్‌ఏ తన మనుగడను కొనసాగించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటుంది. సంతానోత్పత్తి జరిగినప్పుడల్లా అది కొత్త శరీరంలోకి ప్రవేశిస్తుంది. ప్రకృతికి సంబంధించినంత వరకూ ఆ పదార్థం తల్లీ పిల్లల్లో దేని శరీరంలో ఉన్నా ఫరవాలేదు. పైగా ఒక ప్రాణి శరీరం యాంత్రికంగా కొన్ని సంవత్సరాలకు మించి "నడవదు". దాన్ని రిపేరు చేసుకుంటూ, ఎల్లకాలం నడపడంకన్నా దాని స్థానంలో అదే జన్యుపదార్థం కలిగిన మరొక ప్రాణిని పెంచి పెద్దచెయ్యడం ప్రకృతికి తక్కువ "ఖర్చు"తో కూడిన వ్యవహారం. ఇందులో ప్రత్యక్షంగా సృష్టికర్త ఎవడూ లేకపోయినా డార్విన్ చెప్పిన జీవపరిణామం "గుడ్డి"గా ఇదే మార్గాన్ని అనుసరిస్తుంది. ఏ "ఉద్దేశమూ" లేకుండా జీవపరిణామం వీలున్నంత సులువుగా ముందుకు సాగాలంటే ప్రాణులు కొంతకాలానికి చచ్చిపోవడమూ, వాటి స్థానంలో వాటి జన్యులక్షణాలను కొనసాగించగలిగిన కొత్తవి పుట్టుకురావడమే "తేలిక". దీన్నర్థం చేసుకుంటే ప్రకృతిలో ముసలితనమూ, చావూ ఎందుకు ఉన్నాయో తెలుస్తుంది. నాశనం కాకుండా ఎల్లకాలమూ నిలిచేది ఆత్మకాదు; మన డీఎన్‌ఏ. చావును ప్రకృతి 'ఎంపిక' చేసిందంటే అందుకు ముఖ్యమైన కారణం సంతానోత్పత్తిలో జన్యువైవిధ్యం సాధ్యమవుతుందనే. ఏ ప్రాణి ఐనా తన శరీరలక్షణాలను ప్రతికూల వాతావరణానికి తగినట్టుగా మార్చుకోలేదు గనక అటువంటి మార్పు దాని సంతానంలో తప్ప జరగడానికి లేదు. జీవపరిణామపు పోటీలో విజయం సాధించాలంటే 'పాత' జీవాలు చావడం, కొద్దిపాటి మార్పులతో కొత్త ప్రాణులు పుడుతూ ఉండడం తప్ప గత్యంతరం లేదు. ఇది ప్రయత్నపూర్వకంగా కాకపోయినా 'అంతిమవిజయం' పొందిన ఏర్పాటు కనక చావు అనేది డీఎన్ఏ వైవిధ్యానికీ, అది రకరకాల పరిస్థితుల్లో కొనసాగడానికీ దోహదపడింది. ఏ తరానికాతరం చచ్చిపోయి, కొత్త తరాలు పుట్టుకురావడమే ప్రాణుల 'సహజ' లక్షణంగా మిగిలిందనుకోవాలి.
మన వయస్సు పెరుగుతున్నకొద్దీ మతిమరుపూ, ఆలోచనావేగం మందగించడం వగైరాలు మొదలౌతాయి. వీటిలో కొన్నిటికి కారణం మామూలుగా వచ్చే రోగాలూ, ఒత్తిడులూ, పరిసరాల్లో కలిగే
మార్పులూ ఇలా మొత్తంమీద అనేకరకాల కారణాలు ముసలితనానికి దారితీస్తాయి. ఇవేకాక యాదృచ్ఛికంగా జన్యువుల్లో కలిగే వినాశం చిన్న చిన్న తప్పులుగా మొదలై కొంతకాలానికి శరీరాన్నిపెద్దగా ప్రభావితం చేసే స్థితికి చేరుకుంటుంది. ఈ రోజుల్లో మనిషి సగటు ఆయుర్దాయం పెరిగిపోతోంది. దేవతల్లాగా ఎల్లకాలం యవ్వనులుగా బతకలేకపోయినా బతికిన్నన్నాళ్ళూ ఆరోగ్యంగా
ఉండాలనుకోవడంలో తప్పులేదు. ముసలితనం మనని ఎలా శిథిలం చేస్తుందో తెలుసుకుంటే ఆరోగ్యానికి కీలకం తెలుసుకోవచ్చు. చాలామందికి ముసలితనంలో సమస్య శారీరక పటుత్వం తగ్గి,
రోగాలూ రొష్టుల పాలవడమే కాదు. మెదడుకు సంబంధించిన రుగ్మతలుకూడా కొన్ని కలగవచ్చు. వీటిలో ముఖ్యమైనవి జ్ఞాపకశక్తి క్రమంగా తగ్గిపోవడం, నరాల డీజెనరేటివ్ హీనసత్వ లక్షణాలవల్ల సంక్రమించే అల్జ్‌హైమర్స్ వ్యాధి, ప్రేరక నాడీకణాల మోటర్ న్యూరాన్ జబ్బులు, పార్కిన్సన్ వ్యాధి వగైరాలు. వయసు పైబడినప్పటికీ పూటగడవడానికో, ఇతర కారణాలవల్లనో వీరిలో కొందరైనా తమకూ సమాజానికీ పనికొచ్చే కొన్ని వృత్తులనూ, పనులనూ కొనసాగించక తప్పదు. అలాంటప్పుడు వీరిలో అనివార్యంగా కలిగే రుగ్మతలూ, అవసరమయే ప్రత్యేక సౌకర్యాలూ సమాజంపై ఎటువంటి ప్రభావం కలిగిస్తాయి? వణుకుతున్న అవయవాలతో, మందగిస్తున్న చూపుతో ఎంతమంది అప్లికేషన్లో, మరో దరఖాస్తో చదివి, నింపి, చేత పట్టుకుని క్యూలలో నిలబడాలి? వీరిని సమాజం ఎంతవరకూ భరించి, ఆదరించి, పోషించగలుగుతుంది? వయసుమళ్ళినవారికి ఆశ్రమాలూ, ఇతర సదుపాయాలూ ఏర్పాటు చేసి నిర్వహించడం ఇప్పటికే ఒక పెద్ద పరిశ్రమగా రూపొందుతోంది. వీరి హక్కులనూ, అధికారాలనూ పరిరక్షించి, న్యాయ, సామాజికపరంగా కాపాడటానికి ఎన్నో సంస్థలు ఏర్పడ్డాయి, ఏర్పడుతున్నాయి. కృషి చేస్తున్నాయి. వీటిని గురించి ప్రతివారూ పట్టించుకోక తప్పదు. ఎందుకంటే నేటి యువతీ యువకులే రేపటి వృద్ధులు!
ముసలితనం లోబోసినవ్వు తప్పదా?
ముసలితనం అనగానే మనకు బోసినవ్వు గుర్తుకొస్తుంది. పెద్దవయసులో పళ్లూడటం అనివార్యమా? కానేకాదంటోంది దంతవైద్యం! చక్కటి దంత సంరక్షణ జాగ్రత్తలు తీసుకునే వారికి.. ఎన్నేళ్లకైనా దంతాలు వూడిపోయే పరిస్థితి ఉండదు. నిజానికి దంతాలు వూడిపోవటమన్నది ఒక రకంగా చిగుళ్లవ్యాధిలో భాగం. చిగురు దెబ్బతిని, పంటిచుట్టూతా ఉండే ఎముక కూడా దెబ్బతిన్నప్పుడు.. పళ్లు కదులుతాయి, ఊడతాయి. కాబట్టి ఒకరకంగా చిగుళ్ల వ్యాధులు దరిజేరకుండా చూసుకుంటే చాలు.. మన పళ్లు జీవితాంతం సురక్షితం!
-- Dr.Kodavatiganti Rohini prasad(డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్ )
- ========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...