Wednesday, July 06, 2011

మన కళ్లు వివిధ వర్ణాలను ఎలా గుర్తించ గలుగుతున్నాయి?,How do we see colors?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.


ప్రశ్న: మన కళ్లు వివిధ వర్ణాలను ఎలా గుర్తించ గలుగుతున్నాయి?

-ఎస్‌. రత్నాకర్‌, భీమవరం

జవాబు: మనం ఏదైనా వస్తువును చూస్తున్నామంటే దానర్థం దాని మీద పడిన కాంతి కిరణాలు పరావర్తనం చెంది మన కంటిని చేరుతున్నాయనే. మనిషి కన్ను వూదా (Indigo) రంగు నుంచి ఎరుపు రంగు వరకు విస్తరించి ఉండే వర్ణపటాన్ని గుర్తించగలదని తెలిసిందే. తెల్లగా ఉండే సూర్యకాంతిలో ఈ రంగులన్నీ కలిసి ఉంటాయని చదువుకుని ఉంటారు. మన ముందు కనిపించే వివిధ వస్తువులు తమపై పడే కాంతిలో కొంత భాగాన్నే పరావర్తనం చెందించి, మిగతా భాగాన్ని శోషించుకుంటాయి. ఏ వస్తువు ఏ రంగు కాంతిని పరావర్తనం చేస్తే ఆ రంగులోనే ఆ వస్తువున్నట్టు మనం గుర్తిస్తాం. ఇలా పరావర్తనం చెందిన కాంతి మన కంటిలోకి ప్రవేశించి రెటీనాపై పడుతుంది. రెటీనాపై కాంతిని గ్రహించి స్పందించే గ్రాహక కణాలు (receptor cells) ఉంటాయి. ఇవి ప్రసారం చేసే నాడీ సంబంధిత ప్రేరేపణల(impulses) ఆధారంగా మన మెదడు రంగులను గుర్తిస్తుంది.

రెటీనాపై ఉండే కణాలు ప్రధానంగా రెండు రకాలు. వీటిని రాడ్స్‌, కోన్స్‌ అంటారు. కణికల్లాంటి ఆకారంలో ఉండే రాడ్‌ సెల్స్‌ తక్కువ కాంతి, చీకట్లను గుర్తిస్తాయి. ఇవి దాదాపు 125 మిలియన్ల వరకూ ఉంటాయి. శంకువు ఆకారంలో ఉండే కోన్‌ సెల్స్‌ రంగులను గుర్తిస్తాయి. దాదాపు 6 మిలియన్ల వరకూ ఉండే వీటిలో మళ్లీ మూడు రకాలుంటాయి. వీటిలో కొన్ని నీలి కాంతికి, కొన్ని ఆకుపచ్చని కాంతికి, మరికొన్ని ఎరుపు కాంతికి స్పందిస్తాయి. ఈ కణాలు స్పందించే తీరును బట్టే అనేక వర్ణ మిశ్రమాలను కన్ను గుర్తించగలుగుతుంది. ఈ మూడు రకాల కణాలూ ఒకేసారి స్పందించినప్పుడు మెదడు తెలుపు రంగుకి సంబంధించిన సంకేతాన్ని అందుకుంటుంది.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

  • ==================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...