Monday, May 02, 2011

మెర్సీ కిల్లింగ్(కారుణ్య మరణము)అంటే ఏమిటి ,What is Mercy Killing?ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

మెర్సీ కిల్లింగ్(కారుణ్య మరణము)అంటే ఏమిటి ,What is Mercy Killing?

ఒక్కోసారి ఒక్కొక్కరిని చూస్తే అనిపిస్తుంది. 'అబ్బ...ఎంత దౌర్భాగ్యం ఈ జీవితం. నరకయాతన పడుతున్నా కనీసం చావుకైనా కనికరం కలగలేదే...'
చివరి దశలో కొంత మంది వ్యక్తులు నయం కాని జబ్బులతో నరకయాతన పడుతుంటారు. ఉదాహరణకు కేన్సర్ వ్యాధి ముదిరిన తర్వాత రోగులు చెప్పుకోలేని విధంగా ప్రాణ సంకటం అనుభవిస్తుంటారు. వీరికి పెయిన్ కిల్లర్స్, సెడిటివ్స్ పనిచేయవు. పైగా ఇవి వ్యసనంలా తయారవుతాయి. ఈ సమయంలో మెర్సీ కిల్లింగ్ - అంటే కారుణ్య మరణమే మంచిది. తలకు తగిలిన తీవ్రగాయాలతో కొంత మంది జీవితాంతం మంచాన ఉండిపోతారు. వారికి బాహ్య ప్రపంచంతో సంబంధం ఉండదు. స్పందనలు ఉండవు. వెజిటేటివ్ బ్రెయిన్ అంటారు. అలాగే బ్రెయిన్ స్ట్రోక్స్‌తో కొంతమంది బయటిప్రపంచంతో సంబంధం లేకుండా మంచాన అచేతనంగా ఉండిపోయి, మందులకు కూడా స్పందించకుండా, నయం కాని జబ్బులతో దీర్ఘకాలం బాధపడుతుంటారు. ఇటువంటి వారి విషయంలో కారుణ్య మరణమే పరిష్కారం. భారతదేశంలో మెర్సీ కిల్లింగ్ అంటే- కారుణ్య మరణాలకు అనుమతిస్తే దుర్వినియోగమవుతుందనే అపోహలు ఉండవచ్చు. కాని ఇందులో నిజం లేదు. ఏ విధానంలోనైనా ఎక్కువ శాతం సమాజానికి ఉపయోగం ఉంటుందా అనే కోణంలో చూడాలి. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఇండిపెండెంట్ బోర్డులను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఇందులో వైద్య నిపుణులు, న్యాయ కోవిదులు, సామాజిక కార్యకర్తలు, ఎన్‌జివో సంఘాల నేతలు ఉండాలి. ఆసుపత్రి యాజమాన్యం, రోగికి చికిత్స చేస్తున్న వైద్యులు ఈ బోర్డులో ఉండరాదు. వారు నిర్ణయం మేరకు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలి. కారుణ్య మరణానికి అనుమతి ఇచ్చే ముందు కుటుంబ సభ్యులు సమ్మతిని తీసుకోవాలి. ఈ తరహా విధానంతో చట్టాన్ని రూపొందించాలి. ఏళ్లతరబడి నయం కాని వ్యాధులతో, నిరంతరం బాధపడే రోగుల వల్ల ఆర్ధికంగా కుటుంబం చిన్నాభిన్నమవుతుందనే సున్నిత మైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. వెంటిలేటర్లపై మనం కొంత మంది రోగులను పెడుతుంటాం. ఎంత కాలమని దాని ద్వారా రోగులు జీవించగలరు. చట్టాలను దుర్వినియోగం చేయకుండా పటిష్టమైన కమిటీలు ఏర్పాటు చేయాలి. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా కేస్ టు కేస్ స్టడీ చేసి కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఎటువంటి లోపాలకు తావులేకుండా మార్గదర్శక సూత్రాలు ఖరారు చేసుకోవాలి. అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని రకాల వైద్యం అందించిన తర్వాత రోగి కోలుకోని దశలో, లోకంతో సంబంధంలేని స్ధితికి రోగి చేరుకున్నప్పుడు, కారుణ్య మరణం ఒకటే ప్రత్యామ్నాయ మార్గం. ఒక్కమాటలో చెప్పాలంటే వైద్యపరంగా అన్ని మార్గాలు మూసుకునిపోయిన తర్వాత కారుణ్య మరణం విషయాన్ని వైద్యులు, రోగి బంధువులు పరిశీలించాలి. కారుణ్య మరణాలకు అనుమతి ఇచ్చే విషయమై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు, ఎన్‌జివో సంఘాలు విస్తృత స్ధాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలి. మనదేశంలో చాలా మందికి మెర్సీ కిల్లింగ్ గురించి తెలియదు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణగా చట్టాలను రూపొందించే ముందు ప్రజల్లో అవగాహన కల్పించడం అవసరం.

కరుణ లేని మరణం

మరణం అతి బాధాకరమైనది- మరీ ముఖ్యంగా మృతుల దగ్గరివారికి. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని దీర్ఘకాల వ్యాధుల వల్ల జీవితమూ అత్యంత బాధాకరంగా ఉంటుంది. అటువంటి సందర్భాల్లో చావే నయం అనిపిస్తుంది కూడా. కానీ ఇటు జీవితంపై ఆశ, దగ్గరివారి ప్రేమ, వైద్యుల సేవలూ జీవితాన్ని కొనసాగనిస్తుంటాయి. కానీ బాధ కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఆ వ్యక్తి పడే దుర్భర వేదన చూసిన వాళ్లందర్నీ కదిలిస్తుంది. కలచివేస్తుంది. ఆ సమయంలో ఎవరైనా చేయగల సహాయం ఏదైనా ఉంటే అది ఆ వ్యక్తికి మరణాన్ని ప్రసాదించడమే! కనీసం ఆ వ్యక్తికి వేదనను తగ్గించిన వారమయ్యామనే భావన ఉంటుంది. కానీ మరణాన్ని 'ప్రసాదించడం' ఎలా? మరణాన్ని ఏ రకంగా కలిగించినా అది అమానుషమే కదా. హత్యే కదా. ఘోరమే కదా? అయితే ఇక్కడ మనం గమనించవలసింది అవతలి బాధితుడు ఎటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నాడన్నది. శారీరక, తద్వారా మానసిక వేదనకు గురైనప్పుడు, ఆ వేదనను మానవ ప్రయత్నాలు తగ్గించలేనప్పుడు, మరో దారి లేనప్పుడు, బాధతో జీవించడమా, బాధైనా మరణించడమా అన్న మీమాంసలో మరణమే మంచిదని కొందరి వాదన.

హిపోక్రటీస్‌ ఏమన్నాడు?

''నా అంతట నేను గానీ, రోగి కోరినా గానీ, మరెవరైనా సలహా ఇచ్చినా గానీ నేను ఎవరికీ ప్రాణాంతకమైన మందును ఇవ్వను''

వైద్యశాస్త్రం చదివిన వారు చేసే హిపోక్రటీస్‌ ప్రతిజ్ఞ లోని ఒక వాక్యం ఇది. క్రీస్తుకు పూర్వం 400 ఏళ్ల క్రితమే వైద్యశాస్త్ర పితామహుడు హిపోక్రటీస్‌ రూపొందించిన ప్రతిజ్ఞ ఈనాటికీ ప్రపంచవ్యాప్తంగా వైద్యులకు వారి బాధ్యతలను గుర్తుచేసే దిక్సూచి.

అయితే ప్రాచీన రోమన్లు, గ్రీకుల అభిప్రాయం వేరుగా ఉందేది. వారి దృష్టిలో జీవించడం ఇష్టంలేని వారికి, మరణం కోరుకున్న వారికి మరణాన్ని 'ఇవ్వడం' మంచిదే. కానీ పధ్నాలుగవ శతాబ్దంలో ఆత్మహత్య, లేదా ఆత్మహత్యకు తోడ్పడడం నేరాలుగా పరిగణించబడ్డాయి. న్యూయార్కులో 1828లోనే యుథనేసియా (మంచి మరణం)కి వ్యతిరేకంగా చట్టం చేయబడింది.

యుథనేసియాలో రెండు రకాలున్నాయి. స్వచ్ఛందంగా వ్యక్తి కోరే మరణం. మరోటి ఆ వ్యక్తికి వేదన తగ్గించే ప్రయత్నంగా ఇతరులు కలిగించే మరణం. పంతొమ్మిది వందల ముప్ఫయ్యవ దశకంలో హిట్లరు రెండవ రకపు యుథనేసియాని విరివిగా అవలంభించాడు.

'యాక్షన్‌ టి4' అనే పేరుతో నాజీలు ''జీవించడానికి తగని జీవితాన్ని'' నిర్మూలించే కార్యక్రమం చేపట్టారు. హిట్లరు స్వయంగా ఆ పనికి ఆదేశించాడు. తొలుత వారి దృష్టి పసిపిల్లలపై ఉండేది. బుద్ధిమాంద్యం, అవిటితనం వంటి లక్షణాలున్న పిల్లల్ని చంపేసేవారు. ఆ తరువాత దీర్ఘకాల వ్యాధులతో నయం కాని జబ్బులతో ఉన్న వారిని కూడా 'అతి జాగ్రత్తగా పరీక్షించిన తర్వాత' 'కారుణ్య' మరణాన్ని ప్రసాదించవలసిందని హిట్లరు ఆదేశాలు జారీ చేశాడు. 1945 కల్లా సుమారు మూడు లక్షల మంది జర్మన్లు ఆ విధంగా 'చనిపోయారు'.

ఎవరీ అరుణా శాన్‌బాగ్‌?

అరుణా రామచంద్ర శాన్‌బాగ్‌ ముంబై లోని కె.ఇ.ఎమ్‌ ఆసుపత్రిలో పనిచేసే ఉపచారిక. నవంబరు 27, 1973 రాత్రి అదే ఆసుపత్రిలో స్వీపర్‌గా పనిచేస్తున్న సోహన్‌ లాల్‌ వాల్మీకి ఆమెను కుక్క గొలుసుతో గొంతు బిగించి, అత్యాచారం జరిపాడు. మెడకు బిగిసిన చెయిన్‌ మెదడుకు ప్రాణవాయువు సరఫరా తగ్గించిన కారణంగా ఆమె సంపూర్ణంగా నిర్వీర్యమైపోయింది. అప్పటి నుండి అరుణ ఆసుపత్రి మంచానికే అంకితమైపోయింది. నోటి ద్వారా మెత్తని భోజనం పంపడం నుండి సకల సపర్యలూ మంచం మీదనే. ఆహారం తీసుకోవడం అన్న ఒక్క అంశం మినహా ఆమె ఏ కోణంలోనూ మానవ జీవితం అనుభవించడం లేదన్నది పింకీ విరానీ అనే జర్నలిస్టు వాదన. ఆ కారణంగా అరుణకు కారుణ్య మరణం ప్రసాదించమని ఆమె కోర్టును కోరింది. గత ఏడాది డిసెంబరు 17న ఈ కేసును స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం ఈ నెల ఏడున పింకీ విరానీ అభ్యర్ధనను తోసిపుచ్చింది.

అయితే ప్రాణాలు హరించే దిశగా మందులు ఇచ్చేకన్నా కీలకమైన మందులు, వైద్యం, ఆహారం వంటివి ఆపేయడం ద్వారా (పాజిటివ్‌) మరణాన్ని ఇవ్వవచ్చన్న తీర్పు సంచలనం రేపింది.

ఇంతకాలం అరుణను కంటికి రెప్పలా చూసుకుంటున్న ఆమె సహోద్యోగులు ఈ తీర్పుతో ఆనందం వెలిబుచ్చారు. ''అరుణ ఒక చంటిపాపలా ఉంది. మాలాగే ఆమెకీ వయసు పెరుగుతోంది. ఆమె మాకేమీ భారం కాదు. ఇబ్బందీ కాదు. ఆమెకు సపర్యలు చేయడం మాకెంతో సంతోషం. ఆమె ప్రాణాలు తీయడానికి మేం ఒప్పుకోం. కోర్టు ఈ కేసు కొట్టేసినందుకు సంతోషం' అంటున్నారు.

కొసమెరుపు : ఒక నిండు జీవితాన్ని 27 ఏళ్లపాటు నిరర్థకంగా ఉండిపోవడానికి కారణమైన సోహన్‌లాల్‌ వాల్మీకికి పడిన శిక్ష ఏడేళ్లు. శిక్షకి కారణం దోపిడీ, హత్యాయత్నం!!

చట్టబద్ధం చేసిన దేశాలు

కారుణ్య మరణాలపై భిన్నాభిప్రాయాలు ఎప్పుడూ ఉన్నాయి. గత శతాబ్దపు ముప్ఫయ్యవ దశకాల్లోనే యుథనేసియాకి అనుకూలంగా కొన్ని సంస్థలు ఏర్పాటయ్యాయి. ఆస్ట్రేలియాలో 1995లో అనుకూలంగా ఒక బిల్లు ప్రవేశపెట్టారు. అది 1996లో అమల్లోకి వచ్చింది. ఆ మరుసటి ఏడు నిషేధించబడింది! అమెరికాలో 1998లో ఓరిగాన్‌ రాష్ట్రంలో యుథనేసియా చట్టబద్ధం చేయబడింది. రెండు వేల సంవత్సరంలో నెదర్లాండ్‌ యుథనేసియాని చట్టబద్ధం చేసి, అలా చేసిన తొలి దేశంగా నిలిచింది. ఈనాడు బెల్జియం, లక్సెంబర్గ్‌, స్విట్జర్లాండ్‌ దేశాలు కూడా నెదర్లాండ్‌ సరసన చేరాయి. అమెరికాలో ఓరిగాన్‌ సరసన వాషింగ్టన్‌ రాష్ట్రం చేరింది.

మన దేశంలో...

మన దేశంలో కొన్ని వారాల క్రితం వచ్చిన సుప్రీం కోర్టు తీర్పు 'సాత్విక' (పాజిటివ్‌) కారుణ్య మరణాన్ని అవలంభించ వచ్చని చెప్పింది. అయితే సదరు బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందేవరకు ఇప్పటి వరకు ఉన్న ఆంక్షలు అలాగే ఉంటాయి. ఆ బిల్లు వచ్చిన తర్వాత ఏదో రకంగా కారుణ్య మరణాలని చట్టబద్ధం చేసిన దేశాల క్రమంలో మన దేశమూ చేరుతుంది.

కారుణ్య మరణాలు ఎంత వరకు సమంజసం అన్నది ఇప్పట్లో సమాధానం దొరకని ప్రశ్న. ఒక మూడు నాలుగు దశాబ్దాల కిందట 'అబార్షన్‌' అనేది తల్లి ప్రాణాన్ని కాపాడడానికి మాత్రమే అవసరమైన ప్రక్రియగా వాదించేవారు. కానీ ఇప్పుడు 'తొందరపాటు' గర్భాలనీ, అవాంఛనీయ (ఆడశిశువులైతే) గర్భాల్నీ తొలగించుకోవడానికీ అబార్షన్లు సాధారణమైపోయాయి. తోటి మనిషి బాధలో ఉంటే ఆ బాధ తొలగించే ప్రయత్నాలు చేయడం మానవీయత. ఆ ప్రయత్నాలు విఫలమైతే, ఆ బాధ ప్రకోపిస్తే, ఆ బాధితుడు కోరితే అతనిని ఆ బాధ నుండి, ఆ జీవితం నుండి విముక్తుణ్ణి చేయడం కూడా మానవీయతే అంటారు కొందరు. అసలు ప్రాణాలు తీసే హక్కు వైద్యులకు ఎవరిచ్చారంటారు ఇంకొందరు. వైద్యం ఉన్నది బాధితులకు సుఖాన్నివ్వడానికే. అంటే బాధను తొలగించడానికే. ఆ తొలగింపు మరణం వల్లనే సాధ్యపడుతుంది అనుకున్నప్పుడు ఆ మరణాన్ని త్వరితం చేసి వేదనను తగ్గించడం మంచిదే కదా అన్నది కొందరి సూచన.

ఈ సమస్య ఇలా ఎప్పటికీ జటిలంగానే ఉంటుంది. కారణం నిర్ణయాధిక పేషెంటు కోరినంత మాత్రాన చంపేయవచ్చా? 'తీవ్రమైన బాధ'ను నిర్ణయించేది ఎవరు? ఆత్మహత్యకు పురిగొల్పే పరిస్థితులన్నీ ఆయా వ్యక్తులకు తీవ్రమైనవే! పరీక్షలో తప్పడం, ప్రేమ విఫలమవడం, అమ్మ తిట్టడం, డిప్రెషన్‌, ఇంట్లో ఆర్థిక సమస్యలు, ఒంట్లో అనేక సమస్యలు వంటివి ఆ పరిస్థితులను భరించలేనివే. ఆ కారణాలను సాకు చేసుకుని ''భరింపరాని మానసిక బాధ ఉంది డాక్టర్‌, ఒక ఇంజెక్షన్‌ ఇచ్చి, చంపేసి పుణ్యం కట్టుకోండి'' అని ఎవరూ వెళ్లరా? ఫీజు తీసుకుని డాక్టర్లు కారుణ్య మరణాలు సునాయాసంగా ప్రసాదించవచ్చు! అందువల్ల యుథనేసియాకి వ్యతిరేకత అధికంగా ఉంది.

కానీ అందరికీ 'అందుబాటు'లో లేని వైద్యం (అధిక ఖరీదు కారణంగా) వల్ల చాలా వ్యాధులు ముదిరి దీర్ఘకాలిక పరిస్థితులుగా మారుతున్నాయి. వైద్య ఖర్చులు తగ్గించుకునే లేదా మిగుల్చుకునే నెపంతో కూడా రోగులు మరణాన్ని కోరుతున్నారు. విశాఖపట్నంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈశ్వరరావు ఉదంతం మరో కోణాన్ని చూపుతోంది. తప్పుడు రోగ నిర్థారణ, శస్త్రచికిత్స సరిగా చేయకపోవడం వల్ల ఈశ్వరరావు ఇబ్బంది పడ్డాడు. లేని హెచ్‌ఐవి ఉన్నట్లు చూపడం వల్ల గ్రామస్థులు, బంధువులు తనని వెలివేసినట్లు చూస్తున్నారని, తన మానసిక వేదన భరించలేకపోతున్నానని, తనకు మరణం ప్రసాదించాలంటూ జిల్లా కలెక్టరుకు దరఖాస్తు చేసుకున్నాడు. ఇటువంటి అనేకానేక విచిత్ర పరిస్థితుల నేపథ్యంలో యుథనేసియాకి పచ్చజెండా ఊపితే ఉపద్రవమే అని భావించి కాబోలు న్యాయస్థానం అందుకు ఆమోదం తెలుపలేదు.

చట్టబద్ధమా! కాదా!

అయినా, మనకి కారుణ్య మరణం చట్టబద్ధమా కాదా అన్న సమస్య లేదు. సరైన వైద్యం సకాలంలో అందక చనిపోయేవారు కోకొల్లలు. అసమర్థ వైద్యుల కారణంగా వైద్యం వికటించి ప్రాణాలు విడిచినవారు అసంఖ్యాకులు. డబ్బిస్తే తప్ప మందివ్వననే 'జబ్బున్న' డాక్టర్ల చేతిలో హరీమన్న వాళ్లకు లెక్కలేదు. పెంపుడు జంతువులు, రేసుగుర్రాలు గాయాలతో విలవిల్లాడుతుంటే యజమానులు వాటిని చంపి వాటికి బాధావిముక్తి కలిగించేవారు. యుద్ధాల్లో తోటి సైనికులు దెబ్బలతో అల్లాడిపోతుంటే వారికి చావు ద్వారా సుఖాన్ని ఇవ్వడం మామూలే. కానీ సాధారణ పౌరుల జీవించే హక్కుకి గౌరవమివ్వాలా? వారు కోరే మరణానికి విలువ ఇవ్వాలా? అన్నది తేలని సమస్య. కరుణ చూపవలసింది జీవితం వైపా? మరణం వైపా? ఎవరి దృష్టి వారిది. అసలీ అంశాన్ని మన దేశంలో చర్చకు తెరతీసిన అరుణా శాంబాగ్‌ మానవజీవితం కాని జీవితం గడుపుతోంది. ఆమె జీవించినంత కాలం బాధ లేకుండా ఇతరులకు భారం కాకుండా జీవించి, సహజ మరణాన్నే పొందాలని కోరుకుందాం.

అత్యున్నత తీర్పు

మెర్సీ కిల్లింగ్‌ అనేది తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే చట్టం యొక్క అనుమతితో తీసుకోవాల్సిన చర్య. గతంలో కూడా చాలా కేసుల్లో సుప్రీంకోర్టు ఇలాంటి ఉత్తర్వులివ్వడానికి నిరాకరించిన సందర్భాలున్నాయి. ''బ్రెయిన్‌ డెడ్‌'' అయితేనే ఇలాంటి చర్యలకు అనుమతినిస్తారు.

నర్స్‌ అరుణ రామచంద్ర శాన్‌బాగ్‌ గత కొన్ని సంవత్సరాలుగా మంచంపైనే పడుంది. తన పనులు తాను చేసుకోలేక స్పృహ ఉన్నా...లేకున్నా...బ్రతికుండి బాధను భరించలేకుండా ఉన్నదని శాన్‌బాగ్‌ మళ్లీ సుప్రీం ధర్మాసనం ముందుకు వచ్చింది. చట్టంలో మెర్సీ కిల్లింగ్‌ (కారుణ్య మరణం) అనేది ఎక్కడా ఉదహరించలేదు. కావున చట్టపరంగా అనుమతినిచ్చే ... నిరాకరించే ప్రసక్తి రాదు అని అత్యున్నత ధర్మాసనం తీర్పునిచ్చింది.మరణం సంభవించేవరకు జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించడానికి అర్హత ఉంటుందనేది సారాంశం. చట్ట ప్రకారం మెడిసిన్‌ ఇవ్వకుండా పరోక్షంగా జీవితాన్ని పొడిగించకుండా కొన్ని ప్రత్యేక కారణాల వల్ల మరణాన్ని కల్గించవచ్చు. కానీ మందులు ఇచ్చి చేజేతులా ఎట్టి పరిస్థితుల్లోనూ చంపకూడదు. దీనికి చట్టం అనుమతించదు అని మానవత్వం పరిఢవిల్లేలా సుప్రీం ధర్మాసనం 7-3-11న తీర్పు చెప్పింది.

జి.ఎల్‌.నరసింహారావు,హైకోర్టు అడ్వకేట్‌.
  • ===========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...