Wednesday, July 14, 2010

భూమి నుండి పైపైకి వెళితే శీతలమేల?, Cool if goes high from land-why?






ప్రశ్న: భూమి నుంచి పైకి పోయే కొలదీ వేడి తగ్గిపోతూ ఉంటుందంటారు. ఎందువల్ల?

జవాబు: సూర్యకిరణాలు వాతావరణం గుండా ప్రయాణించి భూమిని చేరుతాయనేది తెలిసిందే. వాతావరణంలోని గాలి లోంచి కిరణాలు ప్రయాణించినప్పటికీ గాలి స్వల్పశోషణం (poor absorber) కాబట్టి, వాటిలోని వేడిని అంతగా గ్రహించలేదు. గాలి కంటే భూమి వేడిని ఎక్కువగా గ్రహిస్తుంది. భూమి వేడెక్కడం వల్ల దానిని అంటిపెట్టుకున్న గాలి ఉష్ణోగ్రత పెరుగుతుంది. అలా వేడెక్కిన గాలి సాంద్రత తగ్గుతుంది. దాంతో ఆ గాలి తేలికయి భూమి నుంచి ఎత్తుకు ప్రయాణిస్తుంది. భూమి నుంచి ఎత్తుకు వెళ్లే కొలదీ వాతావరణ పీడనం తగ్గుతుంది. అందువల్ల ఆ ప్రాంతంలోకి వెళ్లిన వేడిగాలి అక్కడ వ్యాకోచిస్తుంది. ఏ వాయువైనా వ్యాకోచిస్తే దాని ఉష్ణోగ్రత తగ్గుతుంది కాబట్టి అక్కడకు వెళ్లిన గాలి చల్లబడుతుంది.

ఈ విధంగా భూమి నుంచి పైపైకి పోయే గాలి ఉష్ణోగ్రత ప్రతి కిలోమీటరుకు 9 డిగ్రీల సెంటిగ్రేడు వరకు తగ్గుతుంటుంది. అందువల్లనే వేసవి కాలంలో ఎత్తుగా ఉండే ప్రదేశాలైన ఊటీ, డార్జిలింగ్‌ లాంటి పర్వత ప్రదేశాలలో వాతావరణం చల్లగా ఉంటుంది. కానీ భూమి నుంచి 40 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎత్తుకు వెళితే అక్కడ మళ్లీ వేడిగానే ఉంటుంది. ఎందుకంటే భూమి ద్వారా వేడెక్కి పైకి వెళుతూ వ్యాకోచించి చల్లబడే గాలి అంత ఎత్తుకు చేరుకోలేదు.

  • =============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...