Thursday, May 06, 2010

భూమి కంపించనేల? , Earth Quake cause?




ప్రశ్న:
అసలు భూకంపాలు ఎలా సంభవిస్తాయి?

జవాబు:
భూమి అనేక పొరలు కలిగి ఉంటుంది. పై పొరను క్రస్ట్‌ (crust) అంటారు. భూమి మొత్తాన్ని ఒక యాపిలు పండుతో పోలిస్తే దాని తొక్క ఎంత పల్చగా ఉంటుందో, భూమికి క్రస్ట్‌ కూడా అంత పల్చగా ఉంటుంది. దీని మందం దాదాపు 70 కిలోమీటర్ల వరకూ ఉంటుంది. ఇదంతా రకరకాల ఆకారాల్లో ఉండే విశాలమైన ముక్కల సముదాయం. ఈ ముక్కలను 'ఫలకాలు' అంటారు. ఈ ఫలకాలన్నీ భూమి అంతర్భాగంలో ద్రవస్థితిలో ఉండే లోపలి పొర (మాంటిల్‌)పై తేలుతూ ఉంటాయి. ఇలాంటి రెండు ఫలకాలు ఒక దానికి ఒకడి రాపిడికి గురికావడం వల్లనే భూకంపాలు ఏర్పడతాయి. ఫలకాలు కలుసుకునే సరిహద్దుల్లోనే ఎక్కువగా భూకంపాలు వస్తుంటాయి. ఈ ఫలకాలు ఒకదానినొకటి ఢీకొనడం, రాసుకోవడం చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ. పైగా సులువుగా జరిగేది కూడా కాదు. రెండు ఫలకాలు ఒకదానిని ఒరుసుకుని ఒకటి కదలడం వల్ల విపరీతమైన ఒత్తిడి ఏర్పడుతుంది. ఈ ఒత్తిడి మొత్తం ఒకేసారి బయట పడదు. సంవత్సరాల తరబడి ఫలకాల మధ్య పేరుకున్న ఒత్తిడి శక్తి రూపంలో భూమి పొరల్లో వ్యాపిస్తుంది. ఆ శక్తి అంతకంతకు పెరిగి మొదట భూమి పొరలను వంచి, తర్వాత ఫలకాలు పగిలిపోయే దశకు చేరుస్తుంది. ఆ దశలో ఫలకాలు ఒక్కసారిగా ఊగిపోతాయి. ఫలకాలు పగిలే దశలో ఏర్పడే శక్తి తరంగాలనే 'సీస్మిక్‌ తరంగాలు' అంటారు. ఈ తరంగాలు కొన్ని వేళల్లో శబ్దాలతో కూడుకుని భూమి మొత్తాన్ని కంపింపచేస్తాయి. అప్పుడే ఆ ప్రదేశాల్లో భూకంపాలు సంభవిస్తాయి. భూకంపాలు ఎక్కువగా అగ్నిపర్వతాలు ఉండే ప్రదేశాల్లో ఏర్పడతాయి. కారణం రెండింటికీ మూలం ఫలకాల కదలికలే.

  • =========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...