Thursday, March 11, 2010

విశ్వంలో పరిమాణాలెన్ని? , Universe measuremints





ప్రశ్న: విశ్వంలో ప్రస్తుతం ఉన్న పరిమాణాలు కాక వేరేవి ఉన్నాయా?

జవాబు: న్యూటన్‌ సిద్ధాంతం ప్రకారం విశ్వంలోని ప్రదేశానికి (space) పొడవు, వెడల్పు, ఎత్తు అనే మూడు పరిమాణాలుంటాయి. ఈ పరిమాణాలకు, కాల (time) పరిమాణానికి సంబంధం లేదు. ఐన్‌స్టీన్‌ సాపేక్ష సిద్ధాంతం ద్వారా విశ్వంలోని మూడు పరిమాణాలకు కాల పరిమాణాన్ని కూడా జతపరిచాడు. అంటే ఆయన సిద్ధాంతం ప్రకారం విశ్వంలోని పరిమాణాలు నాలుగు. ఇక విశ్వంలో నాలుగు శక్తులుంటాయి. అవే గురుత్వ, విద్యుదయస్కాంత, దుర్బల, ప్రబల కేంద్రక శక్తులు. వీటిలో గురుత్వ శక్తి తప్ప మిగతా మూడూ కణ సిద్ధాంతాన్ని అనుసరిస్తాయి. అంటే ఇవి విడివిడిగా ఉండే ప్యాకెట్ల (quantum)లాగా విశ్వంలో ఉంటే, గురుత్వ శక్తి మాత్రం ఖాళీ లేకుండా, అవిచ్ఛిన్నంగా (continuous)గా వ్యాపించి ఉంటుంది. ఈ నాలుగు శక్తులనూ ఒకే తాటి పైకి తేవడానికి 'స్ట్రింగ్‌ థియరీ'ని ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం ప్రకారం 11 పరిమాణాలు ఉంటాయి. అయితే విశ్వంలోని నాలుగు పరిమాణాలకు అదనంగా ఉండే 7 పరిమాణాలు మన కంటికి కనబడని అత్యంత సూక్ష్మ ప్రదేశాలకే పరిమితమై ఉంటాయి. ఉదాహరణకు సాలెగూడులోని పోగులు మన కంటికి ఒకే పరిమాణంలో కనిపిస్తాయి. అదే మైక్రోస్కోపులో చూస్తే అవే పొడవు, వెడల్పు, లోతు అనే మూడు పరిమాణాల్లో కనిపిస్తాయి. అలాగే స్ట్రింగ్‌ సిద్ధాంతంలోని తంత్రులలో ఉండే పదకొండు పరిమాణాలు ఉన్నాయనడానికి ఖగోళ, కణ శాస్త్రవేత్తలు వాడే సున్నితమైన పరికరాల ద్వారా సాక్ష్యం లభిస్తుంది.
  • ==========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...