గబ్బిలం చెవులు.. ఒళ్లంతా బొచ్చు.. అరచేతిలో ఇమిడే శరీరం.. ఇదేంటో తెలుసా? ప్రపంచంలోనే అతి చిన్న నక్క!
మామూలుగా నక్క అనగానే అడవిలో జింకల్ని సైతం వేటాడగలిగే జంతువు గుర్తొస్తుంది కదా? కానీ నక్కల జాతిలోనే అతి చిన్నదొకటుంది.మహా ఎదిగితే ఇది 16 అంగుళాల పొడవుంటుందంతే. బరువైతే కేవలం కిలోన్నరే. అంటే బలిసిన పిల్లి ముందు చూస్తే ఇదే చిన్నగా కనిపిస్తుందన్నమాట. అదే ఫెన్నెక్ ఫాక్స్. ఎడారి నక్కని కూడా అంటారు.
ఈ బుజ్జినక్క రూపం భలే ముచ్చటగా ఉంటుంది. ఒళ్లంతా బొచ్చు. అదాటుగా చూస్తే బుల్లి కుక్క పిల్లలా కనిపిస్తుంది. చేతులతో ఎత్తుకుంటే దోసిట్లో చక్కగా ఇమిడిపోతుంది కూడా. ఇక దీని చెవులు పెద్దగా, దొప్పల్లా ఆరు అంగుళాల పొడవుంటాయి. ఇవి ఆఫ్రికాలోని సహారా ఎడారి ప్రాంతంలో కనిపిస్తాయి. ఇంత చిన్నది పాపం.. అక్కడి వేడికెలా తట్టుకుంటుందనే సందేహం అక్కర్లేదు. ఇది కేవలం రాత్రిళ్లే తిరుగుతుంది. అంటే నిశాచర (నాక్టర్నల్) జీవన్నమాట. మరి పగలు? నేలలో బొరియలు తవ్వుకుని లోపల పడుకుని నిద్రపోతుంది.
ఇవి గుంపులుగా తిరుగుతాయి. ఒక్కో గుంపులో కనీసం పది నక్కలైనా ఉంటాయి. ఇంతకీ ఇవి తినేదేంటో తెలుసా? ఎడారి మొక్కలు, గడ్డితో పాటు ఎలుకలు, కీటకాలు, బల్లులు, పక్షులు, గుడ్లు. దీనికో విచిత్ర గుణం ఉంది. నీళ్లు తాగకపోయినా చాలా రోజులు హాయిగా ఉండగలదు. తినే మొక్కల్లో ఉండే తేమ వీటికి చాలన్నమాట. పైగా వీటి మూత్రపిండాలు కూడా ప్రత్యేకంగా పని చేస్తూ, ఎక్కువ నీరు బయటికి పోకుండా కాపాడుతాయి.
అన్నట్టు.. దీని చర్మానికి బోలెడు గిరాకీ తెలుసా? అందుకే పాపం, అక్కడి ప్రజలు వీటిని కనిపిస్తే చాలు, వేటాడేస్తుంటారు. ఇవి లేకపోతే ఎడారి ఎలుకల సంతతి తీవ్రంగా పెరిగిపోతుంది. కనుక వీటిని కాపాడుకోవలసిన అవసరం ఉందని అక్కడి ప్రభుత్వాలు గుర్తించాయి. ఆడ నక్క ఏడాదికి అయిదు వరకు పిల్లల్ని కంటుంది. ఇవి కేవలం పది నెలలకే పెద్దవై పోతాయి. వీటికి వినికిడి శక్తి చాలా నిశితంగా ఉంటుంది. నేల కింద తచ్చాడుతున్న జీవుల రాకపోకలను ఇది గ్రహించగలదు.
మీకు తెలుసా?
* నక్కల్లో మొత్తం 25 జాతులు ఉన్నాయి.
* ఒక నక్క రోజుకి ఒక కిలో మాంసాన్ని ఆహారంగా తింటుంది.
* జపాన్‌లో నక్కలను పవిత్రమైనవిగా భావించి పూజిస్తారు.
* ఏదైనా జీవిని పట్టుకున్నాక కాసేపు వాటితో చెలగాటమాడి ఆ తర్వాతే తింటాయి.
- =================================
visit My website >
Dr.Seshagirirao - MBBS.