-
- ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్రశ్న: విశ్వంలోని మొత్తం శక్తులు ఎన్ని?
జవాబు: ఈ విశ్వంలో శాస్త్రజ్ఞులు అన్వేషించి నాలుగు శక్తులున్నాయని నిర్ధరించారు.
1. గురుత్వాకర్షణ శక్తి: అన్ని శక్తులకన్నా బలహీనమైనది కానీ దీని అవధి అనంత దూరాలకు వ్యాపించి ఉంటుంది. ద్రవ్యంలోని కణాల మధ్య ఆకర్షణ మూలంగా కుర్చీలు నేలకు అంటుకొని ఉండడానికి, మనం నేలపై నిలబడడానికి ఉపయోగ పడుతుంది. చెట్ల నుంచి పండ్లు నేలపై రాలడానికి, నక్షత్రాలు, గ్రహాలు ఏర్పడడానికి అవి కక్ష్యలో తిరిగేందుకు కూడా ఈ శక్తే కారణం. ఈ శక్తి ఆవిష్కర్త సర్ ఐజాక్ న్యూటన్.
2. విద్యుదయస్కాంత శక్తి: విద్యుదావేశాల మధ్య ఆకర్షణ వికర్షణలకు, పరమాణు నిర్మాణానికి, కాంతి వెలువడేందుకు ఈ శక్తే కారణం. విద్యుత్ బల్బులు వెలిగేందుకు, లిఫ్టులు, టీవీలు, కంప్యూటర్లు పనిచేయడానికి ఇదే మూలాధారం. దీని అవధి అనంతం.
3. దుర్బల కేంద్రక శక్తి: ఇది పరమాణు కేంద్రకానికి చెందిన శక్తి. యురేనియం లాంటి రేడియో ధార్మిక మూలకాల కేంద్రకం విచ్ఛిన్నమవుతున్నపుడు ప్రాథమిక కణాలను వెలువరించేందుకు ఈ శక్తి ఉపయోగపడుతుంది. దీని అవధి 10-14 మీటర్లు మాత్రమే.
4. ప్రబల కేంద్రక శక్తి: పరమాణువులోని కేంద్రకాలను ఒకటిగా నిలకడగా ఉంచే శక్తి ఇది. ప్రోటాన్లు, న్యూట్రాన్లు వీటిలో ఉండే 'క్వార్కులు' ఇలా పరమాణు కేంద్రకంలో ఉన్నవాటినన్నిటినీ బంధించి ఉంచేందుకు ప్రబల కేంద్రకశక్తి ఉపయోగ పడుతుంది. ఈ శక్తి అవధి 10-11 మీటర్లు మాత్రమే.
కేంద్రక శక్తుల వల్లే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. మూలకాలు ఏర్పడుతున్నాయి. మన శరీరంలో ఉన్న కార్బన్, ఆక్సిజన్‌లకు కూడా కేంద్రక శక్తులే కారణం. ప్రబల కేంద్రక శక్తి, విద్యుదయస్కాంత శక్తి కన్నా వందరెట్లు ఎక్కువ. విద్యుదయస్కాంత శక్తి గురుత్వాకర్షణ శక్తి
కంటే 1036 రెట్లు ఎక్కువ. దుర్బల కేంద్రక శక్తి గురుత్వాకర్షణ శక్తి కన్నా 1025 రెట్లు ఎక్కువ.
- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్