Wednesday, November 23, 2011

మిరప తింటే కారమేల?, Why chilli hot on eating?
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: పచ్చి మిరపకాయను కానీ, ఎండు మిరపకాయను కానీ నమిలితే కారంగా ఎందుకు అనిపిస్తుంది?


జవాబు: మన దేశంలో ఉండే మిరపను కాప్సికమ్‌ ఫ్రూటిసెన్స్‌ అంటారు. ఇది బంగాళా దుంపలు, వంకాయలు వంటి మొక్కలకు చెందిన పొలనేసీ కుటుంబానికి చెందినది. మిరపకాయల్లో కారానికి కారణం వాటి తోలు (peel), గింజలు, గుజ్జులో ఉండే కాప్సాసిన్‌ (capsaicin) అనే రసాయన ధాతువు. దీనితో పాటు మరికొన్ని రసాయనాలు కూడా జతకలవడం వల్ల మొత్తం మీద మిరప పచ్చిదైనా, ఎండుదైనా విపరీతమైన కారాన్ని రుచి చూపిస్తుంది. మిరపకాయలో బి-విటమిన్‌, సి-విటమిన్‌, ఇనుము, మెగ్నీషియం, పొటాషియం లవణాలు కూడా కొద్ది మోతాదులో ఉంటాయి. ఎక్కువగా తీసుకుంటే పొట్టలో ఆమ్లత్వం, నోటి పుండ్లు రావడానికి ఆస్కారమున్నా, తగినంతగా వాడితే శరీరానికి ఔషధగుణాలు లభిస్తాయి. పచ్చిమిరపలో నీటి శాతం బాగా ఉండడం వల్ల కాప్సాసిన్‌ కరిగి అది వెంటనే నోటిలోని లాలాజలంతో కలవడంతో వెంటనే ఘాటు తెలిసిపోతుంది. ఎండు మిరప కాయలో నీటి శాతం తక్కువగా ఉండడం వల్ల కాప్సాసిన్‌ ప్రభావం కొన్ని సెకన్ల తర్వాతే తెలుస్తుంది.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

---------------------------------------------------------

కారానికి మంటేల?/-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌,-వరంగల్‌; రాష్ట్ర కమిటీ, జనవిజ్ఞానవేదిక


ప్రశ్న: కారం కళ్లలో పడితే కళ్లు మండి నీరు ఎందుకు కారుతుంది? కారం రసాయనిక నామం ఏమిటి?

జవాబు: మిరప కాయల్లోను, కారంగా రుచించే ఇతర కూరగాయల్లోను ఆ ఘాటును కలిగించే ప్రధాన రసాయనం పేరు 'క్యాప్సాయిసిన్‌' (capsaicin). దీన్ని శాస్త్రీయంగా '8-మిథైల్‌-ఎన్‌-వ్యానిలైల్‌- 6- నోనీనమైడ్‌' (8-methyl-N- vanillyl-6-nonenamide) అంటారు. నిజానికి పచ్చిమిరపకాయలో కారాన్ని కలిగించే ఈ రసాయనం కన్నా, మన రుచికి ఇంపైన చక్కెరలు, పిండి పదార్థాలతో పాటు విటమిన్లు, లవణాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ప్రతి వంద గ్రాముల కారంలో రకాన్ని బట్టి ఈ రసాయనం నాలుగైదు గ్రాములకు మించకపోయినా, పిట్టకొంచెం కూత ఘనం అన్నట్టు దీని ప్రభావమే కళ్లు, చర్మం, ఇతర కణజాలంపై తీవ్రంగా ఉంటుంది. ఈ రసాయనం నాలుక మీద పడినా, కళ్లలాంటి మృదు చర్మ భాగాల మీద పడినా అక్కడున్న నాడీతంత్రులు తీవ్రంగా స్పందించి మెదడుకు సంకేతాల్ని పంపుతాయి. తద్వారా కంటిలో నీరు అసంకల్పిత ప్రతీకార చర్య (involuntary reaction) వల్ల స్రవిస్తుంది.

  • =============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...