Thursday, October 20, 2011

అలుగు సంగతేమిటి? , What about Armadillo?ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.


అదొక జంతువు... దాని మానాన అది బతుకుతోంది... కానీ అమెరికాను మాత్రం ఏడిపిస్తోంది...ఏమిటది? ఎందుకు?

ఒళ్లంతా పొలుసులు... ముందుకు పొడుచుకొచ్చిన మూతి... చేంతాడులా సాగే నాలుక... నాలుగు కాళ్లపై నడక... బారెడు తోక... ఇదొక వింత జంతువు. ప్రమాదం ఎదురైతే చటుక్కున బంతిలా ముడుచుకుపోయే దీన్ని అలుగు అంటారు. చాలా దేశాల్లో కనిపించే ఇది ఇప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాలకు ఓ తలనెప్పిగా మారింది. ఇంతకీ ఏం చేసింది?

అలుగును ఆంగ్లంలో ఆర్మడిల్లో (Armadillo) అంటారు.వీటిలో మొత్తం ఇరవై జాతులు ఉన్నాయి. దక్షిణ అమెరికా ఖండంలో ఎక్కువగా కనిపిస్తాయి. దాదాపు 9 జాతుల ఆర్మడిల్లోలు అక్కడుంటాయి. వాటిలో ఒకటైన 'నైన్‌ బ్యాండెడ్‌ ఆర్మడిల్లో'తోనే సమస్యంతా. ఇది ఎలా వెళ్లిందో తెలియదు కానీ, 1880లో ఉత్తర అమెరికా ఖండంలోకి అడుగు పెట్టింది. అక్కడ వాటి సంఖ్య పెరిగిపోయింది. ఇవి ఇప్పుడు యూఎస్‌ఏ రాష్ట్రాల్లోకి చొచ్చుకుపోయాయి. వాటి బతుకు అవి బతుకుతుంటే సమస్య ఏంటి?

సాధారణంగా ఒక ప్రాంతానికి చెందిన జంతువు కానీ, మొక్క కానీ మరో కొత్త ప్రదేశానికి వెళితే ఒకోసారి తలనెప్పిగా మారిపోతాయి. కొత్త ప్రాంతాల్లో సహజ శత్రువులు లేకపోయినా, పరిస్థితులు అనుకూలంగా ఉన్నా వీటి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. అప్పుడవి ఆ ప్రాంతానికి చెందిన ఇతర జంతుజీవాలతో పోటీకి దిగుతాయి. వాటి మనుగడకు కూడా అడ్డంకిగా మారతాయి. ఇలాంటి వాటిని 'ఎలియన్‌ స్పిసీస్‌' అంటారు. అలుగుగారు అమెరికాలో ఇప్పుడీ అవతారమే ఎత్తారు.

దట్టమైన అడవుల్లో, మైదానాల్లో గోతులు చేసుకుని జీవించే ఇవి ఏవి పడితే వాటిని తింటాయి. పంటల నుంచి కీటకాల వరకూ ఆరగిస్తూ పెరిగిపోతాయి. వీటి వల్ల చాలా చోట్ల పక్షులకు, ఇతర జీవులకు ప్రమాదం కలుగుతోంది. ఇవెంతగా పెరిగిపోయాయంటే అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రుళ్లు ఇవి రోడ్ల మీదకు తరచుగా వస్తుండడంతో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. వీటి సంఖ్యను ఎలా అదుపు చేయాలా అని అధికారులు తలపట్టుకుంటున్నారు. రోజుకు 16 గంటలు ఏ సొరంగంలోనో పడుకునే వీటిని పట్టుకోవడం కూడా సమస్యగానే మారింది.


* అలుగుల్లో అతి పెద్దది అయిదడుగుల వరకు పెరిగితే, అతి చిన్నది ఆరంగుళాలు ఉంటుందంతే!
* వీటికి కంటిచూపు అంతంత మాత్రమే. సునిశితమైన వినికిడి శక్తి ద్వారా వేటాడుతాయి.
  • ========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

1 comment:

  1. they cant even listen better,they can smell superb,palgolin ani antaru

    ReplyDelete

your comment is important to improve this blog...