రోజూ బూట్లు తొడుక్కుంటారుగా? మరి 5 వేల ఏళ్లనాటి బూటు గురించి తెలుసా?ఈ మధ్యే బయటపడి బోలెడు సంగతులు చెబుతోంది.
మీరు వాడి పారేసిన బూటు మళ్లీ కనిపించదు. ఒకవేళ కనిపించినా విశేషం ఏమీ ఉండదు. కానీ ఎప్పుడో 5500 ఏళ్ల కిత్రం అప్పటి పురాతన మానవుడు తొడుక్కున్న ఒక బూటు ఇప్పుడు కనిపించి సంచలనం సృష్టించింది. ఇది క్రీస్తుపూర్వం 3500 కాలం నాటిది. అంటే ఈజిప్టు గ్రేట్ పిరమిడ్‌కన్నా పాతదన్నమాట. ప్రపంచంలోనే అతి పురాతన తోలు బూటు కూడా ఇదే.
యూరప్ ఖండంలోని ఆర్మీనీయాలో ఓ గుహలో దీన్ని ఈ మధ్యే కనుగొన్నారు. ఇన్నాళ్త్లెనా ఎందుకు పాడైపోలేదో తెలుసా? గుహలోని చల్లటి వాతారవణానికి తోడు, వేల ఏళ్లుగా గొర్రె విసర్జకం దీనిపై కప్పుకుపోయి ఉంది. తోలు బూట్లలో పాతది ఇదే అయినప్పటికీ దీని కన్నా పాత బూటు 1991లో బయటపడింది. అది ఏకంగా 5300 ఏళ్ల క్రితం జీవించిన ఐస్‌మాన్‌దిగా గుర్తించారు. అయితే అది తోలుతో తయారైంది కాదు.
మీకు తెలుసా?
* ప్రాచీన ఈజిప్షియన్లు పాపిరస్ అనే ఆకులనే బూట్లుగా మలచుకునేవారు.
* 19వ శతాబ్దం చివరి వరకూ ఎడమ, కుడి కాళ్ల తేడాలేకుండా బూట్ల జతను ఒకేరకంగా తయారుచేసేవారు.
* 9, 10వ శతాబ్దాల్లో యూరప్ రాజులు కలపతో చేసిన బూట్లను ధరించేవారు.
* కాలిఫోర్నియాకు చెందిన డార్లీన్ ఫ్లిన్ అనే మహిళ బూట్ల ఆకారంలో ఉన్న 11వేల వస్తువులను సేకరించింది.
* ప్రపంచంలోనే అతి పెద్ద బూటును 2002లో మారికీనా నగరంలో తయారుచేశారు. 5.29 మీటర్ల పొడవు, 2.37 మీటర్ల వెడల్పు, 1.83 మీటర్ల ఎత్తు ఉందిది. అంటే ఇది 125 అడుగుల ఎత్తున్న మనిషికి సరిపోతుందన్నమాట.
* హైదరాబాద్ నిజాం యువరాజు నిజాం సికందర్ జా ఎంత ఖరీదైన బూట్లను ధరించాడో తెలుసా? వజ్రాలతో పొదిగిన వీటి ధర సుమారు 6 కోట్ల రూపాయలకు కుపైమాటే.
* ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుని భార్య ఇమ్లేడా మాక్రోస్ ఏకంగా 3,400 బూట్లను సేకరించి 'ప్రపంచంలోనే ఎక్కువ బూట్లు సేకరించిన మహిళ'గా గిన్నిస్ రికార్డు సాధించింది.
* పదిగంటల్లోపు 20 జతల బూట్లను తయారు చేసి కొలంబియాకి చెందిన అలెంగ్జాండర్ గిన్నిస్ రికార్డు సృష్టించాడు.
* 10,512 బూట్లతో 8,700 అడుగుల షూ గొలుసును 2008లో వాషింగ్టన్‌లో చేశారు. 1.65 మైళ్ల పొడవున్న ఇది 'ప్రపంచంలోనే అతిపెద్ద బూటుగొలుసు'గా గిన్నిస్‌లోకి ఎక్కింది.
-------------------------------
మూలము : ఈనాడు దిన పత్రిక .
- ==============================