Monday, August 23, 2010

పొగమంచు ఏర్పడేదెలా? , How does Fog (snow) forms?



ప్రశ్న: పొగమంచు ఎందుకు, ఎలా ఏర్పడుతుంది?

జవాబు: పొగమంచు (fog) సాధారణంగా చలికాలంలో ఏర్పడుతుంది. రాత్రి ఉష్ణోగ్రత బాగా తక్కువగా ఉండే రోజుల్లో ఈ పరిస్థితిని ఎక్కువగా గమనించవచ్చు. గాలిలో నైట్రోజన్‌, ఆక్సిజన్‌ తదితర వాయువులతో పాటు నీటి ఆవిరి కూడా ఉంటుంది. దీనినే తేమ లేదా ఆర్ద్రత (humidity) అంటారు. ఈ తేమ ఎంత ఉంటుందన్న విషయం గాలి పీడనం, ఉష్ణోగ్రతలను బట్టి ఉంటుంది. గాలి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే తేమశాతం ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే తేమ శాతం తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో గాలిలో ఉష్ణోగ్రత బాగా తగ్గిపోయిందనుకుందాం. అంతవరకూ గాలిలో ఎక్కువగా ఉన్న తేమ సూక్ష్మబిందువుల రూపంలో ఘనీభవిస్తుంది. అదే పొగమంచు. ఈ సూక్ష్మబిందువులపై పడే కాంతి వివర్తనం (scattering) చెంది అన్ని వైపులకు ప్రసరిస్తుంది. అందువల్ల అన్నీ కలిసి పొగలాగా కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితులు సాధారణంగా చలికాలంలో కుదురుతాయి.

Fog snow and Snow drops,పొగమంచు-మంచు బిందువులు

 ప్రశ్న: పొగమంచు, మంచు బిందువులు ఎలా ఏర్పడతాయి?

జవాబు: చలికాలంలో రాత్రివేళల్లో భూమి ఎక్కువగా వేడిని విడుదల చేస్తుంది. అలా వెలువడిన వేడి వాతావరణం పైపొరల్లోకి చేరుకోవడంతో భూమికి దగ్గరగా ఉండే పొరల్లో ఉష్ణోగ్రత చాలా వరకు తగ్గిపోతుంది. అప్పుడు భూమిపై ఉన్న గాలిలోని నీటియావిరి చల్లబడి, ఘనీభవించి చిన్న నీటి బిందువులు ఏర్పడతాయి. అవి భూమి ఉపరితలంపై ఉన్న దుమ్ము, ధూళివంటి అతి చిన్న కణాలను ఆవరించే గాలిలో తేలియాడడం వల్ల పొగమంచు ఏర్పడుతుంది. భూమికి దగ్గరగా ఒక తెరలాగా ఏర్పడటంతో పొగమంచు అవతలివైపు వస్తువులను మనం సరిగా చూడలేము.

చలికాలంలో భూమి ఎక్కువగా చల్లబడటం వల్ల నీటియావిరితో కూడిన గాలి నేలపై ఉన్న చల్లటి వస్తువులను, చెట్ల ఆకులను పూలను, పచ్చని గడ్డి పరకలను తాకడంతో వాటిపై ఆ నీటియావిరి ఘనీభవిస్తుంది. అదే ముత్యాల్లాగా మెరిసే మంచు బిందువులు. వర్షపు బిందువులలాగా మంచు బిందువులు ఆకాశం నుంచి కురవవు.


  • - ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌



  • =================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...