Tuesday, August 31, 2010

కొవ్వొత్తి మంటలో మర్మమేంటి? , Candle flame goes up always-why?



[Candle.jpg]
  • candle flame

ప్రశ్న: మండే కొవ్వొత్తిని మనం నిటారుగా పట్టుకున్నా, వంచి పట్టుకున్నా, తలకిందులుగా పట్టుకున్నా మంట పైకే వస్తుంది. కారణం ఏమిటి?-మంట పైకి లేస్తుందేం?


జవాబు: మంటలు పైకే ఎగిసి పడడానికి కారణం ఒక విధంగా గాలే. మంట మండుతున్నప్పుడు అది తన చుట్టూ ఉన్న గాలిపొరలను వేడెక్కిస్తుంది. దాంతో ఆ గాలి సాంద్రత తగ్గుతుంది. అపుడు తేలికైన గాలి అక్కడి నుంచి వేగంగా నిలువుగా పైకి పోతుంది. అందువల్ల మంట చుట్టూ ఉన్న ప్రదేశంలో పీడనం తగ్గుతుంది. పీడనం తక్కువగా ఉన్న ఆ ప్రదేశంలోకి దూరాల్లో ఉండే చల్లని గాలి వచ్చి చేరుతుంది. వేడెక్కి పైకి పోయే గాలి వేగం, దూరం నుంచి మంటవైపు వచ్చే గాలి వేగం కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇదంతా నిరంతరంగా జరుగుతూ మంట చుట్టూ ఉన్న గాలులు వేగంగా పైకి పోతుండడం వల్ల వాటితో పాటే మంట ఎప్పుడూ పైకే లేస్తుంది.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌


  • =================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Thursday, August 26, 2010

తుపాకీ గుండు నుంచి బులెట్‌ప్రూఫ్‌ కార్లు ఎలా రక్షిస్తాయి?,How does bulletproof protect us?






ప్రశ్న: తుపాకీ గుండు నుంచి బులెట్‌ప్రూఫ్‌ కార్లు, బులెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు మనని ఎలా రక్షిస్తాయి?

జవాబు: మామూలు కారు అద్దాలు రాయితో కొడితే భళ్లున పగుల్తాయి. తుపాకీ గుండు వాటి నుంచి దూసుకుపోగలదు కూడా. అయితే బులెట్‌ప్రూఫ్‌ కారు అద్దాల విషయంలో అలా జరగదు. కారణం, ఆ అద్దాలను మామూలు గాజుతో కాకుండా అత్యంత పటిష్ఠమైన సిలికాన్‌ నైట్రైడ్‌ (silicon nitride)తో కూడిన పింగాణీ పదార్థం, అతి దృఢమైన స్టీలు, గరుకైన నైలాన్‌ పొరలను ఉపయోగించి తయారు చేస్తారు. దృఢమైన పింగాణీ వేగంగా వచ్చే తుపాకి గుండును హఠాత్తుగా ఆపివేయడంతో దాని శక్తి గాజు తలుపులోకి చొచ్చుకుపోకుండా ఆ ప్రదేశంలోని పైపొరలోనే వివిధ దిశలకు వ్యాపిస్తుంది. అలా వేగం కోల్పోయిన తుపాకీగుండు ఆ గాజులోని నైలాన్‌ పొరల వల్ల ఏర్పడిన గజిబిజి జాలీలో చిక్కుకుపోతుంది.
బులెట్‌ప్రూఫ్‌ జాకెట్‌ కూడా ఇలా ప్రత్యేకంగా తయారయిందే. దీంట్లో సుమారు 20 నుంచి 25 దృఢమైన, సున్నితమైన తేలికపాటి నైలాన్‌ పొరలు ఉంటాయి. ఈ పొరల్లో తుపాకీ గుండు చిక్కుకుపోతుంది.

  • ==============================
visit My website > Dr.Seshagirirao - MBBS.

panchakarma Chikitsa in Ayuveda , పంచకర్మ చికిత్స అంటే ఏమిటి ?




మన శరీరము నిరంరము అనేక పనులు ఆగకుండా చేయడము వల్ల ఎన్నో వ్యర్దపదార్దములు , సూక్ష్మ జీవులు తయారవుతూ ఉంటాయి . వీటిని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకొని ఎరోజుకారోజు శరీరానికి కొత్తదనాన్ని ఇవ్వాలి . ప్రపంచములోని అన్ని వైద్యవిధానాల్లో ఆ భాధల నివారణకి చికిత్స ఉందికాని , వాటికి కారణమైన ఆ విషపదార్ధాలను సమూలముంగా బయటకు పంపేసి లోపల ప్రతి శ్రోతస్సుని ,, ప్రతి ధాతువును శుభ్రపరచే చికిత్సా ప్రక్రియ ఒక్క ఆయువేదము లోనే ఉన్నది . దాన్నే పంచకరం చికిత్స అంటారు .

ప్రతి మూడు నెలలకో అయిదునెలలకో ఈ పంచకర్మ చికిత్స చేయించుకోవాలి . పంచ అంటే 5 విధానాలు :
1. వమనం -- మందు కడుపులోపలికిచ్చి పొట్ట పైభాగములో ఉండే మలినాలను వాంతి చేయడం .
2. విరేచనం --ప్రేగులలో నిలువ ఉన్న వ్యర్ధపదార్ధాలను కిందనుండి మలము గా పంపడం .
3. స్నేహవస్తి -- వస్తి అంటే ఎనీమా లాంటిది . మందులతో చేసే ఎనీమా ను స్నేహవస్తి అంటాము ,
4. కషాయవస్తి -- కషాయము తో చేసే ఎనిమాను కషాయవస్తి అంటాకు .
5. నశ్యము -- మందుతో కూడిన చుక్కలు , పొడిని ముక్కుద్వారా లోపలికి పంపడం .

పంచకరం చికిత్స - అటు కొన్ని వ్యాధులను చికిత్సకి , వ్యాధులు రాకుండా శరీరాన్ని , మనస్సును రక్షించుకోవడానికి ఉపకరిస్తుంది . ఇది శరీరమును శక్తివంతం చేసే సహజ పక్రియ . వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది .

  • ============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Wednesday, August 25, 2010

పైలట్‌ లేకుండా ప్రయాణమెలా? ,AeroPlane Journey without pilot




ప్రశ్న: పైలట్‌ రహిత విమానాలు, క్షిపణులు ఎలా ప్రయాణిస్తాయి?

జవాబు: భూగోళం మొత్తాన్ని ఊహాయుత రేఖలతో విభజించుకున్న సంగతి తెలిసిందే. అడ్డంగా ఉండే అక్షాంశాలు, నిలువుగా ఉండే రేఖాంశాలుగా ఏర్పాటు చేసుకున్న ఈ గీతల ఆధారంగా భూమ్మీద ఏ ప్రాంతాన్నయినా గుర్తించగలుగుతాం. అట్లాసును పరిశీలిస్తే మీకీ సంగతి అర్థమవుతుంది. విమానాల్లోను, రాకెట్లలోను అత్యంత శక్తిమంతమైన కంప్యూటర్లు ఉంటాయి. వాటి మెమొరీలో ముందుగానే వివిధ విమానాశ్రయాలు, చేరవలసిన లక్ష్యాలను ఈ ఊహాయుత రేఖలను ఆధారంగా గుర్తించి ఆ సమాచారాన్ని ఫీడ్‌ చేసి డేటాబేస్‌గా ఉంచుతారు. పైలట్‌ ఉండే విమానాల్లో సైతం ఆ విమానం ఏ దిశలో, ఎంత ఎత్తులో, ఎంత వేగంతో ప్రయాణించాలో కంప్యూటర్లతో అనుసంధానమైన వ్యవస్థే చెబుతుంది. పైలట్‌ లేని విమానాలు, క్షిపణుల విషయంలో అవి ప్రయాణించాల్సిన మార్గం మొత్తాన్ని కంప్యూటర్లలో నమోదు చేస్తారు. ఆయా విమానాల గమనాన్ని కంప్యూటర్లు, భూమ్మీద ఉండే నియంత్రణ వ్యవస్థలే నియంత్రిస్తూ ఉంటాయి. ఇదంతా ఆధునిక సాంకేతిక విజ్ఞానం చేసే మాయాజాలం.

  • ====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Monday, August 23, 2010

పెట్రోలు ఆవిరవుతుందేం? , Petrole evaporate at room temp. Why?





ప్రశ్న: పెట్రోలు ఎలా లభిస్తుంది? అది ఎందుకు ఆవిరవుతుంది?

జవాబు: వాహనాలు నడవడానికి ఇంధనంగా ఉపయోగపడుతున్న పెట్రోలు, 'పెట్రోలియం' అనే నల్లని రంగుగల చిక్కని ద్రవం నుంచి లభిస్తుంది. లాటిన్‌ భాషలో 'పెట్రా' అంటే రాయి. 'ఓలియం' అంటే నూనె. ఈ రెండు పదాల నుంచి పెట్రోలియం అనే పదం పుట్టింది. అంటే రాతిచమురు. దీన్ని భూమి అంతర్భాగంలో ఉండే రాళ్ల నుంచి వెలికి తీస్తారు.

భూమి లోపలి పొరల్లో ఈ చమురు ఎలా తయారైంది? కోట్లాది సంవత్సరాల క్రితం భూమిపైన, లోపల జరిగిన ఉపద్రవాల వల్ల అనేక మొక్కలు, జంతువులు భూగర్భంలో పూడుకుపోయాయి. భూమి లోపల ఉండే అత్యంత ఉష్ణోగ్రత, పీడనాల కారణంగా కుళ్లిపోయిన మొక్కలు, జంతువుల నుంచి ముడిచమురు ఏర్పడింది. ఆధునిక కాలంలో మానవుడు వాటిని కనుగొని దాన్ని వెలికి తీయగలిగాడు. ఈ ముడిచమురు నుంచి పెట్రోలు, నాప్తా, కిరోసిన్‌, డీజిల్‌, మైనం, మొదలైన వాటిని వేరే చేయగలిగాడు. భూమి పొరల్లోంచి డ్రిల్లింగ్‌ చేసి వెలికి తీసిన ముడిచమురును శుద్ధి కర్మాగారాలకు పైపుల ద్వారా పంపించి వేడి చేసి, వివిధ ఉత్పత్తులను వేరు చేస్తారు.

పెట్రోలు ద్రవకణాల మధ్య ఉండే బంధన శక్తి సామర్థ్యం చాలా స్వల్పం కావడంతో గది ఉష్ణోగ్రత వద్ద కూడా పెట్రోలు ఆవిరిగా మారుతుంది. ఇలాంటి ద్రవాలను భాష్పశీల ద్రవాలు (volatileliquids )అంటారు.

  • ==============================
visit My website > Dr.Seshagirirao - MBBS.

పొగమంచు ఏర్పడేదెలా? , How does Fog (snow) forms?



ప్రశ్న: పొగమంచు ఎందుకు, ఎలా ఏర్పడుతుంది?

జవాబు: పొగమంచు (fog) సాధారణంగా చలికాలంలో ఏర్పడుతుంది. రాత్రి ఉష్ణోగ్రత బాగా తక్కువగా ఉండే రోజుల్లో ఈ పరిస్థితిని ఎక్కువగా గమనించవచ్చు. గాలిలో నైట్రోజన్‌, ఆక్సిజన్‌ తదితర వాయువులతో పాటు నీటి ఆవిరి కూడా ఉంటుంది. దీనినే తేమ లేదా ఆర్ద్రత (humidity) అంటారు. ఈ తేమ ఎంత ఉంటుందన్న విషయం గాలి పీడనం, ఉష్ణోగ్రతలను బట్టి ఉంటుంది. గాలి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే తేమశాతం ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే తేమ శాతం తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో గాలిలో ఉష్ణోగ్రత బాగా తగ్గిపోయిందనుకుందాం. అంతవరకూ గాలిలో ఎక్కువగా ఉన్న తేమ సూక్ష్మబిందువుల రూపంలో ఘనీభవిస్తుంది. అదే పొగమంచు. ఈ సూక్ష్మబిందువులపై పడే కాంతి వివర్తనం (scattering) చెంది అన్ని వైపులకు ప్రసరిస్తుంది. అందువల్ల అన్నీ కలిసి పొగలాగా కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితులు సాధారణంగా చలికాలంలో కుదురుతాయి.

Fog snow and Snow drops,పొగమంచు-మంచు బిందువులు

 ప్రశ్న: పొగమంచు, మంచు బిందువులు ఎలా ఏర్పడతాయి?

జవాబు: చలికాలంలో రాత్రివేళల్లో భూమి ఎక్కువగా వేడిని విడుదల చేస్తుంది. అలా వెలువడిన వేడి వాతావరణం పైపొరల్లోకి చేరుకోవడంతో భూమికి దగ్గరగా ఉండే పొరల్లో ఉష్ణోగ్రత చాలా వరకు తగ్గిపోతుంది. అప్పుడు భూమిపై ఉన్న గాలిలోని నీటియావిరి చల్లబడి, ఘనీభవించి చిన్న నీటి బిందువులు ఏర్పడతాయి. అవి భూమి ఉపరితలంపై ఉన్న దుమ్ము, ధూళివంటి అతి చిన్న కణాలను ఆవరించే గాలిలో తేలియాడడం వల్ల పొగమంచు ఏర్పడుతుంది. భూమికి దగ్గరగా ఒక తెరలాగా ఏర్పడటంతో పొగమంచు అవతలివైపు వస్తువులను మనం సరిగా చూడలేము.

చలికాలంలో భూమి ఎక్కువగా చల్లబడటం వల్ల నీటియావిరితో కూడిన గాలి నేలపై ఉన్న చల్లటి వస్తువులను, చెట్ల ఆకులను పూలను, పచ్చని గడ్డి పరకలను తాకడంతో వాటిపై ఆ నీటియావిరి ఘనీభవిస్తుంది. అదే ముత్యాల్లాగా మెరిసే మంచు బిందువులు. వర్షపు బిందువులలాగా మంచు బిందువులు ఆకాశం నుంచి కురవవు.


  • - ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌



  • =================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

స్థిర విద్యుత్‌ అంటే ఏమిటి? , Static electricity-what is it?




ప్రశ్న: స్థిర విద్యుత్‌ అంటే ఏమిటి? దానిని ఎలా తయారు చేస్తారు?

జవాబు: చాలా కాలం క్రితం గ్రీకు దేశస్థుడొకరు ఏంబర్‌ (Amber) అనే జిగురు పదార్థాన్ని పీచుతో రుద్దినప్పుడు అది తేలికైన ఎండుటాకులను, రంపం పొట్టును ఆకర్షించడాన్ని గమనించాడు. ఏంబర్‌ను గ్రీకు భాషలో 'ఎలక్ట్రా' అంటారు. అది ప్రదర్శించిన ఈ ధర్మాన్ని బట్టే 'ఎలక్ట్రిసిటీ' అనే పేరొచ్చింది.

ఏదైనా కాగితాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి ఓ దువ్వెనను గట్టిగా రుద్ది వాటికి దగ్గరగా పెడితే అవి ఆకర్షితమవడాన్ని గమనించవచ్చు. అలాగే గాజు కడ్డీని సిల్కు బట్టతో రుద్దితే గాజుకడ్డీపై విద్యుదావేశం పుడుతుంది. చలనం లేని ఈ విద్యుత్‌నే 'స్థిరవిద్యుత్తు' (Static electricity) అంటారు.

పదార్థాలన్నీ పరమాణువుల (Atom) మయం అని తెలిసిందే. ఒక వస్తువును మరొక వస్తువుతో రుద్దడం ద్వారా కలిగిన ఘర్షణ వల్ల వాటిలోని పరమాణువులు ఎలక్ట్రాన్లను గ్రహించడమో, కోల్పోవడమో జరుగుతుంది. అప్పుడు ఆ వస్తువులపై స్థిరవిద్యుత్‌ ఏర్పడుతుంది. ఆకాశంలో మేఘాలు ఒకదానినొకటి రాసుకున్నప్పుడు కూడా స్థిరవిద్యుత్‌ ఏర్పడుతుంది. అలా పోగుపడిన విద్యుత్‌ భూమి దిశగా ప్రసరించినప్పుడే మెరుపులు వస్తాయి.

పదార్థాల్లోని ప్రతి పరమాణువులో ధనావేశముండే ప్రోటాన్లు, రుణావేశముండే ఎలక్ట్రాన్లు సమాన సంఖ్యలో ఉంటాయి. ఈ విద్యుదావేశాలు సమానమవడం వల్ల వీటి ప్రభావం చుట్టుపక్కల వస్తువులపై ఉండదు. అదే ఒక వస్తువును మరో వస్తువుతో రుద్దినప్పుడు ఎలక్ట్రాన్ల మార్పిడి జరుగుతుంది. ఎలక్ట్రాన్లను కోల్పోయిన వస్తువుపై ధనావేశం, ఎలక్ట్రాన్లను గ్రహించిన వస్తువుపై రుణావేశం ఏర్పడుతాయి. గాలి ఊదిన బెలూన్‌ను చొక్కాకు రుద్దినప్పుడు అది అంటుకోవడం, టీవీ తెరను తుడిచేప్పుడు మన చేతి మీది వెంట్రుకల్ని ఆకర్షించడం లాంటి పరిణామాలకు ఇదే కారణం.
- ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌


  • ======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

వయసును బట్టి బరువు స్థిరమా? , Weight is Constant after certain age?





ప్రశ్న: ఒక వయసు వచ్చేప్పటికి మనిషి బరువు స్థిరంగా ఉండడానికి కారణం ఏమిటి?



జవాబు: ఒక వయసు వచ్చేసరికి పెరుగుదల ఆగుతుంది కానీ బరువు స్థిరంగా ఉంటుందన్న నియమం ఏదీ లేదు. పెరుగుదల అంటే అర్థం జీవకణాల సంఖ్య. తల్లి గర్భంలో ఏక కణంగా జీవం పోసుకున్న శిశువు తొమ్మిది నెలలు నిండేసరికి కొన్ని కోట్ల కణాలతో, పూర్తి అవయవాలతో, కండర కణజాలంతో పుడుతుంది. ఆపై ఎదిగే క్రమంలో ఎముకలు, చర్మం, పేగులు, కండరాల లాంటి భాగాలకు సంబంధించిన కణాల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. అందువల్ల పుట్టినప్పుడు సుమారు 2 అడుగుల పొడవుంటే, యవ్వన దశకు చేరుకునేప్పటికి సుమారు అయిదున్నర అడుగులకు ఎదుగుతారు. అలాగే పుట్టినప్పుడు సుమారు 4 కిలోల బరువుంటే, ఎదిగే క్రమంలో సుమారు 60 కిలోల వరకు చేరుకుంటారు. సాధారణంగా 18, 19 ఏళ్ల వయసు వచ్చేనాటికి గరిష్ఠ సంఖ్యలోకి కణాలు చేరుకుంటాయి. అందువల్ల ఆపై ఎదుగుదల ఆగిపోతుందని అంటారు. అయితే బరువు విషయం అలా కాదు. చిన్నప్పటి నుంచీ ఆటలాడకుండా అదేపనిగా తింటూ ఉంటే యవ్వనం నాటికే వంద కిలోల బరువు మించేవాళ్లు ఉంటారు. అలాగే 30 ఏళ్ల వరకూ నాజూగ్గా ఉన్నా ఆ తర్వాత వ్యాయామం, ఆహారపు అలవాట్లు సరిగా పాటించకపోవడం వల్ల ఊబకాయం వచ్చే వారూ ఉంటారు. అయితే ఈ అదనపు బరువు కణజాలాల వల్ల కాదు. కేవలం కణాల పరిమాణం (అందులో నీరు ఎక్కువ ఉండడం వల్ల), కణాల మధ్య కొవ్వు పెరగడం వల్ల కావచ్చు. చనిపోయేవరకూ కూడా బరువు పెరిగేవారున్నారు. కానీ యవ్వన దశ తర్వాత ఎదిగేవారు సాధారణంగా ఉండరు.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక


  • =================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

ప్రపంచంలోనే అతి పెద్ద ఆనకట్ట ఏది ? , Biggest Bridge in the world ?




నదులపై ఆనకట్టలు కడతారని తెలుసుగా? మరి ప్రపంచంలోనే అతి పెద్ద ఆనకట్ట ఎక్కడుందో తెలుసా? చైనాలో! దీని నిర్మాణం ఈమధ్యనే పూర్తయిన సందర్భంగా సంగతులేంటో చూద్దామా!

పదిహేనేళ్లుగా ఆ ఆనకట్ట నిర్మాణం జరుగుతూనే ఉంది... దాదాపు పాతిక వేల మంది కార్మికులు పనిచేస్తూనే ఉన్నారు... 1994 నుంచి నిర్విరామంగా జరుగుతున్న పని వల్ల ఇప్పటికి దాని నిర్మాణం పూర్తయ్యే దశకు వచ్చింది. మొన్ననే నీటిని వదిలి పరీక్షించి చూశారు కూడా. అదే చైనాలోని 'త్రీ గార్జెస్‌ డ్యామ్‌'. మూడు దశలుగా నిర్మించిన ఇది ప్రపంచంలోనే అతి పెద్ద డ్యామ్‌ మాత్రమే కాదు, అతి పెద్ద జల విద్యుత్‌ కేంద్రం కూడా. దీనిని కట్టడానికి ఎంత ఖర్చయ్యిందో తెలుసా? 180 బిలియన్ల యెన్‌లు. అంటే మన రూపాయలో సుమారు లక్షా ఎనిమిదివేల కోట్ల రూపాయలు!ఈ ఆనకట్ట విస్తీర్ణం ఒకటిన్నర మైలు కాగా, ఎత్తు 600 అడుగులు.

ఈ ఆనకట్ట ఏకంగా 40 బిలియన్ల ఘనపు మీటర్ల నీటిని నిల్వ చేయగలదు! అంటే ఎంతో తెలుసా? ఆ నీటినంతా ఒక పెద్ద ఘనాకారమైనగదిలో ఉంచాలనుకుంటే ఆ గది కొలతలు సుమారు మూడున్నర కిలోమీటర్ల పొడవు, అంతే వెడల్పు, అంతే ఎత్తు ఉండాలి! ఇక ఆ డ్యామ్‌ నిర్మాణానికి మొత్తం 160 లక్షల ఘనపు మీటర్ల కాంక్రీటును వాడారు.

ఈ ఆనకట్టలో నిల్వ చేసిన నీటిని ఉపయోగించి 150 లక్షల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు. ఇంతే విద్యుత్‌ను బొగ్గు ఆధారితమైన విద్యుత్‌ కేంద్రంలో ఉత్పత్తి చేయాలంటే అందుకు ఏటా 310 లక్షల టన్నుల బొగ్గు అవసరమవుతుంది. అంటే, ఈ ఆనకట్ట పరోక్షంగా అంత బొగ్గు వినియోగాన్ని ఆదా చేస్తుందన్నమాట. ఇందువల్ల వాతావరణంలోకి విడుదలయ్యే పది కోట్ల టన్నుల వాయు కాలుష్యాన్ని ఇది ఆపుతున్నట్టే.

అయితే చైనాలో ఈ ఆనకట్టను వ్యతిరేకించేవారు కూడా ఉన్నారు. దీని వల్ల పది లక్షల మందికి పైగా జనాల్ని వారి నివాస ప్రాంతాల నుంచి తరలించాల్సి వచ్చింది. ఆనకట్ట పూర్తిగా వినియోగంలోకి వస్తే 13 పట్టణాలు, 4500 గ్రామాలు మునిగిపోయే అవకాశం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • ==========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Sunday, August 22, 2010

జనాభా లెక్కలను ఎందుకు సేకరిస్తారు? , Why do we calculate population Statistics?



ప్రశ్న: జనాభా లెక్కలను ఎందుకు సేకరిస్తారు? దాని వల్ల ప్రయోజనాలు ఏమిటి?

జవాబు: ప్రపంచంలోని దేశాలన్నీ జనాభా లెక్కలను (census) సేకరిస్తాయి. మానవులు సమూహాలుగా నివసించడం మొదలైన దగ్గర్నుంచీ ఈ ప్రక్రియ మొదలైందని చెప్పవచ్చు. ప్రాచీన కాలంలో రాజులు తమ పాలనలో ఉన్న ప్రజల్లో ఎంత మంది యుద్ధం చేయడానికి తగిన సామర్థ్యం కలిగి ఉన్నారో తెలుసుకోడానికి, పన్నుల రూపంలో ఖజానాకు ఎంత ధనం సమకూరుతుందో అంచనా వేయడానికి జనాభా లెక్కలను సేకరించేవారు. ప్రస్తుత కాలంలో ఇందువల్ల ప్రభుత్వానికి విద్య, ఆరోగ్య, ఉద్యోగ సంబంధిత రంగాలలో ప్రణాళికలు వేయడానికి, ఒకో రంగానికి ఆర్ధిక వనరులు ఎలా సమకూర్చాలో తెలుసుకోడానికి వీలవుతుంది. దేశంలో జనాభా పెరుగుతోందో, తగ్గుతోందో తెలుస్తుంది. పట్టణ, పల్లె ప్రాంతాల్లో ఉండే ప్రజల నిష్పత్తి తెలుస్తుంది. ఎన్నికలలో ఎంత మంది ఓటర్లు పాల్గొంటారో తెలిస్తే ఆ మేరకు ఏర్పాటు చేయడానికి కుదురుతుంది. అలాగే ఆర్ధిక, సాంఘిక వ్యవస్థలను, శాంతిభద్రతలను మెరుగుపరిచే నిర్ణయాలను తీసుకోడానికి వీలవుతుంది. మన దేశంలో తొలిసారిగా 1872లో జనాభా లెక్కలను సేకరించారు. అప్పటి నుంచి ప్రతి పదేళ్లకు ఓసారి లెక్కించడం ఆనవాయితీగా ఉంది.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌


  • ===================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

వర్షం కురిసేదెలా? , How is Raining ?


ప్రశ్న: వర్షం ఎలా ఏర్పడుతుంది? దాని వెనుక ఉన్న ప్రకృతి మార్పులు ఏమిటి?

  • https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhB_QUi8JFeQghYRZCyHhzAJL2zmnk1Vd8hYTlQkxniY8oQeCbKhGTYegcmXv10J2jFTYp8hagEYsn3Gkx911vjAPxPdt_gRtfW8G-Oj2BHqBn14sOZw6bQt-y5mx8YY4hBKDOo7hXnLal2/s1600/raining.jpg

జవాబు: ఆకాశంలోని మేఘాల నుంచి వర్షం కురుస్తుందని తెలిసిందే కానీ, దాని వెనుక ఒక సుదీర్ఘమైన, క్లిష్టమైన వాతావరణ ప్రక్రియ ఉంది. వేసవి కాలంలో సరస్సులు, నదులు, సముద్రాలలోని నీరు సూర్యరశ్మి వల్ల ఆవిరిగా మారి వాతావరణంలోని గాలిలో కలిసిపోతుంది. నీటి ఆవిరి గాలి కన్నా తేలిక కావడంతో అది భూమి నుంచి పైకి ఆకాశంలోకి పైపైకి లేస్తుంది. పరిసరాల్లోని ఉష్ణోగ్రత కొంచెం తగ్గినా నీటి ఆవిరి మేఘాలుగా ఏర్పడుతుంది. ఆ మేఘాలు వేడి ప్రదేశాల నుండి చల్లని ప్రదేశాలకు ప్రయాణిస్తున్నప్పుడు గాలి లోని ధూళి కణాలపై నీటి ఆవిరి ఘనీభవించి సూక్ష్మ బిందువులు ఏర్పడుతాయి. ఈ ప్రక్రియ కొనసాగుతూ నీటి బిందువుల పరిమాణం ఎక్కువై, భూమ్యాకర్షణ శక్తికి లోనై కిందకి పడడం మొదలవుతుంది. మేఘాలలోని సూక్ష్మమైన మంచు కణాల చుట్టూ కూడా నీటి ఆవిరి ఘనీభవించి వర్షం పడే అవకాశం ఉంది. మేఘాలలో మెరుపుల వల్ల ఏర్పడే అయాన్లపై కూడా నీటి ఆవిరి ఘనీభవిస్తుంది.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌


  • ================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Saturday, August 21, 2010

భూమికి నక్షత్రాలకు మధ్య దూరాన్ని ఎలా లెక్కిస్తారు?,Measuring distance between Earth and Stars



ప్రశ్న : భూమికి నక్షత్రాలకు మధ్య దూరాన్ని ఎలా లెక్కిస్తారు?

జవాబు: భూమి సూర్యుని చుట్టూ ఒక నిర్దిష్టమైన కక్ష్యలో తిరుగుతూ ఉంటుంది. ఈ కక్ష్య వ్యాసం 300 మిలియన్‌ కిలోమీటర్లు. అంటే 30 కోట్ల కిలోమీటర్లు. దూరం కనుక్కోవలసిన నక్షత్రాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు భూమిపై ఒక ప్రదేశం నుంచి టెలిస్కోపు ద్వారా ముందుగా పరిశీలిస్తారు. ఆ నక్షత్రం నుంచి వెలువడే కాంతి కిరణాలు కంటితో చేసే కోణాన్ని కనుగొంటారు. దీన్ని దృష్టికోణం అంటారు. దీన్ని నమోదు చేసుకున్న తర్వాత ఆరునెలలు నిరీక్షించాల్సి ఉంటుంది. ఎందుకంటే భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరగడానికి 12 నెలల కాలం పడుతుందని తెలుసుగా? ఆరునెలల తర్వాత భూమి తన కక్ష్యలో మొదటి స్థానం నుంచి సరిగ్గా వ్యతిరేక స్థానంలోకి చేరుకుంటుంది. అప్పుడు మళ్లీ టెలిస్కోపులో ఆ నక్షత్రాన్ని పరిశీలించి తిరిగి దృష్టికోణాన్ని కనుగొంటారు. భూమి మొదటి స్థానం, ఆరునెలల తర్వాత ఉన్న స్థానం, నక్షత్రం ఉండే స్థానాలను మూడు బిందువులనుకుంటే, ఈ మూడింటి మధ్య ఒక వూహా త్రిభుజం ఏర్పడుతుంది. ఈ త్రిభుజంలో భూమి రెండు స్థానాల మధ్య దూరం 30 కోట్ల కిలోమీటర్లని (భూకక్ష్య వ్యాసం) మనకు తెలుసు. అలాగే రెండు దృష్టికోణాలు కూడా నమోదయ్యాయి. నక్షత్రం నుంచి కాంతి ప్రయాణించే వేగం కూడా తెలుసు. ఈ కొలతలను త్రికోణమితి (Trigonometry) సూత్రంలో ప్రతిక్షేపిస్తే భూమికి, నక్షత్రానికి మధ్య దూరం ఎంతో తెలిసిపోతుంది. ఈ పద్ధతిలో భూమి నుంచి 400 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్రాల దూరాన్ని లెక్కించవచ్చు. మరో పద్ధతిలో నక్షత్రాల నుంచి వెలువడే కాంతిని వర్ణమాపకం (spectrometer)లో అమర్చి ఉండే పట్టకం (prism) గుండా ప్రసరింపజేసి తద్వారా ఏర్పడే వర్ణపటం (spectrum)లో రంగుల తీవ్రతలను బట్టి కూడా నక్షత్రాల దూరాలను లెక్కిస్తారు.

- ప్రొ||ఎ. రామచంద్రయ్య,నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

  • ==============================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Thursday, August 19, 2010

జంతర్‌ మంతర్‌ సంగతేమిటి?, Jantar mantar-what is it?




అద్భుత వివరాల 'జంతర్‌ మంతర్‌'--మన దేశానికి చెందిన ఓ మహారాజు 300 ఏళ్ల క్రితం కట్టిన అద్భుత కట్టడం ఇప్పుడు అంతర్జాతీయ ప్రాచుర్యాన్ని పొందింది. దాని వివరాలు తెలుసుకుందాం!

ఇప్పుడు మన దగ్గర పెద్ద పెద్ద టెలిస్కోపులు ఉన్నాయి. వాటితో అంతరిక్షంలోని నక్షత్రాలు, గ్రహాల గమనాలను చూసి అనేక విషయాలను తెలుసుకోగలుగుతున్నాం. కానీ... సాంకేతిక పరికరాలేవీ లేనప్పుడే, దాదాపు 300 ఏళ్ల కిందట ఇలాంటి సమాచారాన్ని తెలుసుకోడానికి ఒక మహారాజు ఓ అద్భుతమైన కట్టడాన్ని నిర్మించాడని మీకు తెలుసా? అదే 'జంతర్‌ మంతర్‌' అనే వేధశాల (అబ్జర్వేటరీ). రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉన్న దీనిని ఇప్పుడు యునెస్కో వారు ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటిగా గుర్తించారు.

'జంతర్‌ మంతర్‌' పేరు వినడానికి వింతగా ఉన్నా, దానికర్ధమేంటో తెలుసా? లెక్కలు గట్టే యంత్రం అని. సంస్కృత పదాలైన 'యంత్ర మంత్ర' నుంచి ఈ పదాలు రూపాంతరం చెందాయి. ఈ స్థలానికి వెళ్లి చూస్తే రకరకాల ఆకారాల్లో ఉండే రాతి కట్టడాలు కనిపిస్తాయి. ఆర్క్‌లు, త్రికోణాలు, వలయాల్లాంటి రేఖాగణితానికి సంబంధించిన ఆకారాలు, వాటిపైకి ఎక్కడానికి కట్టిన మెట్లతో వింతగా కనిపించే ఇక్కడి కట్టడాలన్నీ అంతరిక్ష పరిశీలనకు ఉపయోగపడే అద్భుతమైన పరికరాలే అంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఒకో కట్టడం ఒకో యంత్రమనుకుంటే ఇక్కడ దాదాపు 17 యంత్రాలు కనపిస్తాయి. ఇవి ఒకోటీ ఒకోలా పనిచేస్తాయి.వీటి సాయంతో ఎలాంటి వివరాలు లెక్కగట్టేవారో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. కచ్చితమైన సమయం, తేదీ, గ్రహణాలు, నక్షత్రాల గమనం, భూమి కక్ష్య, గ్రహాల స్థితిగతులు, రుతువులు, వాతావరణ వివరాల్లాంటి ఎన్నో సంగతులను గ్రహించేవారు. ఇవి ఇప్పటికీ కచ్చితమైన సమాచారాన్ని అందించడం విశేషం. వీటన్నింటిలో ముఖ్యమైనదైన 'సమ్రాట్‌ యంత్ర' ప్రపంచంలోనే అతిపెద్ద నీడ గడియారం (సన్‌ డయల్‌). సుమారు 90 అడుగుల ఎత్తుతో ఉండే ఇది సూర్యుని కిరణాల వల్ల ఏర్పడే నీడ ఆధారంగా కేవలం రెండు సెకన్ల తేడాతో కచ్చితమైన సమయాన్ని చూపిస్తుంది. దీని నీడ సెకనుకు ఒక మిల్లీమీటరు వంతున కదులుతూ పర్యాటకులకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది.

ఇక్కడి 'ఉన్నతాంశ యంత్ర' ద్వారా గ్రహాల స్థితిగతులను లెక్కించేవారు. 'రాజ్‌యంత్ర'తో తేదీలను, పండుగ దినాలను తెలుసుకునేవారు. 'క్రాంతి యంత్ర' ఖగోళ వస్తువుల అక్షాంశ, రేఖాంశాలను కనుక్కోవడానికి వినియోగపడేది. 'చక్రయంత్ర' భూమధ్య రేఖ నుంచి గ్రహనక్షత్రాల కోణాలను తెలిపేది. ఇలా రామ్‌యంత్ర, దిగంత యంత్ర, జైప్రకాశ్‌ యంత్ర, రాశివలయ యంత్ర, ధ్రువ యంత్ర లాంటి కట్టడాలన్నీ రకరకాల వివరాలను అందించేవి.

జైపూర్‌ రాజైన సవాయ్‌ జైసింగ్‌-2 దీని నిర్మాణాన్ని 1728లో ప్రారంభించి ఏడేళ్లలో పూర్తి చేశాడు. ప్రాచీన భారత ఖగోళ శాస్త్రవేత్తగా పేరొందిన ఈయన ఇలాంటి కట్టడాలను మన దేశంలో అయిదుచోట్ల కట్టించగా, అన్నింటిలో జైపూర్‌లోదే పెద్దది.


  • ===================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

పాలపై తొరకేల? , Layer forms on Milk after heating why?



ప్రశ్న: పాలను వేడి చేస్తే దానిపై తొరక ఎందుకు ఏర్పడుతుంది? పాలలో ఉప్పువేస్తే విరిగిపోతాయెందుకు?

జవాబు: పాలు ఒక మిశ్రమ పదార్థం. పాల అంతర్గత నిర్మాణాన్ని పరిశీలిస్తే అణువులు కాకుండా, అణు సముదాలయాలయిన గుచ్ఛాలు (clusters or assemblies or aggregates) కనిపిస్తాయి. వీటి పరిమాణాన్ని బట్టి పాలను కొల్లాయిడ్‌ (colloid) అనే ద్రావణంగా వర్గీకరించారు. మొత్తానికి పాలలో లాక్టోజ్‌, మాల్టోజ్‌ వంటి కార్బొరేట్‌ రేణువులు ఉంటాయి. వీటితో పాటు కొన్ని ప్రొటీన్లు, తైలబిందువులు (fat globules) కూడా ఉంటాయి. పాలకు తెల్లని రంగునిచ్చేవి కూడా ఈ పదార్థాలే. పాలను వేడి చేసినప్పుడు కొన్ని రేణువులు ఒకదానికొకటి దగ్గరై పెద్దవిగా మారుతాయి. ఇవన్నీ కలవడం వల్లనే తొరక ఏర్పడుతుంది. తొరక సాంద్రత పాల సాంద్రత కన్నా తక్కువగా ఉండడం వల్ల అది తెట్టులాగా ఏర్పడుతుంది. ఇక పాలలో ఉప్పు వేసినప్పుడు అందులోని రేణువులు పీచులాగా పేరుకుపోతాయి. కారణం వీటిని స్థిరంగా ఉండే విద్యుదావేశాలను ఉప్పులోని సోడియం, క్లోరైడు అయాన్లు ధ్వంసం చేయడమే. ఈ స్థితినే మనం విరిగిన పాలు అంటాము.

- ప్రొ||ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక



  • ==================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Wednesday, August 18, 2010

Biggest Lotus history what ?, ఆ కలువ పువ్వు సంగతేమిటి ?




దోసిలిలో ఒదిగే అందమైన కలువ పువ్వుల్ని చూశాం. మరి ఏకంగా 91 అడుగుల పొడవుండే కలవపువ్వు గురించి తెలుసా? చూడాలనుకుంటే కేరళ వెళ్లాల్సిందే. అసలేంటా కలువపువ్వు? తెలుసుకుందాం రండి.

ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌, ఈజిప్టులోని పిరమిడ్‌లు, ఢిల్లీలో అందమైన ఉద్యానవనం మధ్యలో ఉన్న హూమయూన్‌ టూంబ్‌ ఇవన్నీ ఎవరో ఒకరి స్మారక నిర్మాణాలే. ఇలా చక్కని కట్టడాలని ఆప్తుల కోసం కట్టించడం మనకు తెలిసిందే. అలాగే కేరళలోని తిరువనంతపురంలో కూడా ఓ స్వామిజీ మీద ప్రేమతో ఆయన శిష్యులు ఓ అద్భుతమైన కట్టడాన్ని నిర్మించారు. పెద్ద కలువ పువ్వు ఆకారంలో ఉన్న ఇది మ్యూజియం కూడా. ప్రపంచంలో ఉన్న అతి పెద్ద స్మారక భవనాల్లో ఒకటిగా పేరు తెచ్చుకోనుంది. కొన్ని కిలో మీటర్ల దూరం నుంచి కూడా ఇది కనిపిస్తుంది. దీనిని ఈ రోజే మన రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ ప్రారంభిస్తున్నారు.

రాజస్థాన్‌ నుంచి ప్రత్యేకంగా తీసుకు వచ్చిన చలువరాయితో దీన్ని నిర్మించారు. సుమారు లక్ష చదరపు అడుగుల చలువరాయిని ఉపయోగించారని అంచనా. ఈ కలువ పువ్వు ఎత్తు 91 అడుగులు, వెడల్పు 84 అడుగులు. లోపలి భాగంలో 12 గదులు ఉంటాయి. అందులో స్వామీజీ వాడిన వస్తువులను భద్రపరిచారు. కలువ పువ్వుకి ఉండే 21 రేకుల్లో, 12 పైకి ఉంటే, 9 పూర్తిగా కిందికి ఉంటాయి. పైకి ఉండే ఒకో రేకు పొడవు 41 అడుగులు ఉంటే, కిందికి ఉండేవి 31 అడుగుల పొడవుతో ఉంటాయి. దీనిని నిర్మించడానికి మొత్తం 50 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. అందులో లోపల నిర్మించిన ప్రత్యేకమైన గదులకి, వస్తువులకే 20 కోట్ల రూపాయలు ఖర్చయినట్టు అంచనా. దీని లోపల 27 అడుగుల ఎత్తులో పై కప్పు ఉంటుంది.

దీన్ని ఎవరికోసం కట్టారో ఆ స్వామిజీ కరుణాకర గురూ చరిత్ర కూడా ఆసక్తికరమే. వెనుకబడిన కులంలో పుట్టి 42 ఏళ్ల వయసు వరకు వంటవాడిగా పనిచేసిన ఆయన ఆ తర్వాత స్వామీజీగా గుర్తింపు పొందారు. తిరువనంతపురంలోని పోతెన్‌కోడ్‌ గ్రామంలో 1968లో శాంతిగిరి ఆశ్రమాన్ని స్థాపించారు. అందులోకి కుల, మత భేదాలు లేకుండా అందరినీ ఆహ్వానించారు. ఆశ్రమంలో పర్ణశాలగా పిలుచుకునే చిన్న గుడిసెలో ఆయన అధిక సమయం ధ్యానంలోనే గడిపేవారు. స్వామిజీ నిరాడంబర జీవితానికి ప్రభావితులైన మాజీ రాష్ట్రపతి కె.ఆర్‌. నారాయణన్‌ తన ఇంటిని ఆశ్రమానికి విరాళంగా కూడా ఇచ్చారు. 1999లో స్వామిజీ పరమపదించగా ఆయన శిష్యులు పర్ణశాల స్థలంలో స్మారక భవనాన్ని నిర్మించాలని తలపెట్టారు. అలా 2000లో పని మొదలు పెడితే ఇప్పటికి పూర్తయింది.


  • ==================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

మన భారత దేశము లో గొప్పగా చెప్పుకోదగ్గ విషయాలేమిటి ? , Indian pride proving Facts




ఈ నిజాలు చదివి మనం దేశం గురించి గొప్పగా చెప్పుకోండి మరి.

* సున్నాను కనుగొన్నది మన దేశానికి చెందిన ఆర్యభట్ట అని తెలుసా?
* చదరంగం (చెస్‌) మన దేశంలోనే పుట్టిన ఆట.
* ప్రపంచంలోనే ఎక్కువ పోస్టాఫీసులున్న దేశం మనదే.
* ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ఉద్యోగులున్న సంస్థ భారతీయ రైల్వే వ్యవస్థ. 10 లక్షల మంది పనిచేస్తున్నారు.
* ప్రపంచంలోనే అతి ఎత్తు మీదున్న క్రికెట్‌ మైదానం మన దేశంలోనే ఉంది. హిమాచల్‌ప్రదేశ్‌లో సముద్ర మట్టానికి 2444 మీటర్ల ఎత్తులో ఉన్న చైల్‌లో దీన్ని నిర్మించారు.
* ప్రపంచము లో అతి పెద్ద ప్రజాసామ్యదేశము మన భారతదేశమే అని గర్వం గా చెప్పుకోండి ..


  • ==================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

ఇప్పటి జెండా పుట్టిందెలా?, Indian National Flag Origin



ఇప్పుడు మీరు ఎగరేసి వచ్చిన జెండాకు రూపకల్పన జరిగింది ఎప్పుడో తెలుసా? 1921లో. అప్పుడు విజయవాడలో ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ సభ జరిగింది. అందులో మచిలీపట్నానికి చెందిన పింగళి వెంకయ్య తాను తయారుచేసిన జెండాను గాంధీజీకి చూపించారు. అది జాతిపితకు బాగా నచ్చేసింది. ఆ జెండాలో మొదట ఎరుపు, ఆకుపచ్చ రంగులు, మధ్యలో చరఖా బొమ్మ ఉండేది. ఎరుపు రంగు హిందువులకు, ఆకుపచ్చ రంగు ముస్లిం సోదరులకు గుర్తుగా వెంకయ్య దీనిని తయారు చేశారు. గాంధీజీ ఎరుపు, ఆకుపచ్చలకు మధ్యన తెలుపు రంగుని మిగతా మతాలకు గుర్తుగా పెట్టారు. తరువాత ఎరుపుని కాషాయ వర్ణంగా మార్చారు. కాషాయ వర్ణం ధైర్యం, త్యాగానికి, తెలుపు శాంతికి, నిజానికి, ఆకుపచ్చ నమ్మకం, పరాక్రమానికి గుర్తులుగా భావించి ఈ మార్పుల్ని చేశారు. 1931లో దానిని మన జాతీయ పతాకంగా ప్రకటించారు. 1947 జూలై 22న దీనిని స్వాతంత్య్ర భారతావనికి జాతీయ పతాకంగా ఆమోదించారు. మధ్యలో చరఖాకు బదులు అశోక చక్రాన్ని చేర్చారు.

  • ======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.http://dr.seshagirirao.tripod.com/

ఢిల్లీలోని ఎర్రకోట వివరాలేంటో ? , Redfort in Delhi details ?



భారతదేశ అద్భుత కట్టడాల్లో ఒకటి... ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు... మన ఏడు వింతల్లో ఒకటి... స్వాతంత్య్ర సంబరాలకు చిహ్నం... అదే ఢిల్లీలోని ఎర్రకోట!

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మన దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని మువ్వన్నెల జెండాను ఎగురవేస్తారని తెలుసుగా? టీవీల్లో ప్రత్యక్షంగా ప్రసారం చేసే ఆ సంబరాలు జరిగేదెక్కడో తెలుసా? ఎర్రకోటలో. అక్కడి నుంచే ప్రధాని మనందరినీ ఉద్దేశించి ప్రసంగిస్తారు. అంతటి ప్రాధాన్యత కలిగిన ఎర్రకోట వివరాలేంటో తెలుసుకుందామా?

'ఇలలో స్వర్గం అంటూ ఉంటే అది ఇదే... ఇదే...' అనే అర్థాన్నిచ్చే వాక్యాలు ఎర్రకోటలోని సభాస్థలి గోడలపై బంగారు అక్షరాలతో మెరుస్తూ కనిపిస్తాయి. పర్షియా కవి అమీర్‌ ఖుస్రో రాసిన కవితలోని ఈ పంక్తులను అక్కడ చెక్కించింది మొగల్‌ చక్రవర్తి షాజహాన్‌. ఎర్రకోట నమూనాను రూపొందించి, దగ్గరుండి కట్టించింది కూడా షాజహానే. ఎర్ర చలువరాతితో అద్భుతంగా నిర్మించిన ఈ కోట వెనుక 360 ఏళ్ల చరిత్ర ఉంది. దీని నిర్మాణాన్ని 1638లో మొదలు పెడితే 1648లో పూర్తయింది. యమునా నది ఒడ్డున, మొత్తం 120 ఎకరాల సువిశాల స్థలంలో ఈ కోటను పర్షియా నుంచి రప్పించిన నిపుణులతో కట్టించారు.
కోటలో చక్రవర్తి సభలు జరిపే మండపాన్ని దివాన్‌-ఇ-ఆమ్‌ అంటారు. యాభై అడుగుల పొడవు, 24 అడుగుల వెడల్పుతో ఉండే ఈ సభాస్థలి పైకప్పు, గోడలను వెండి బంగారాలతో తాపడం చేశారు. ఇందులోనే ప్రపంచ ప్రఖ్యాతమైన నెమలి సింహాసనం ఉండేది. ఫ్రెంచి స్వర్ణకారుడు మణులు, వజ్రాలను పొదిగి చేసిన దీనిపైనే చక్రవర్తి ఆసీనుడై సభను నడిపేవాడు. కోటలోని ఉద్యానవనాలు, పాలరాయి మండపాలు, నీటిని చిమ్మే ఫౌంటెన్లు అద్భుతంగా ఉంటాయి. ఎన్నో చారిత్రక ఘట్టాలకు ఈ కోట మౌన సాక్షి. 1657లో షాజహాన్‌ నలుగురు కుమారుల వారసత్వ పోరును ఇది చూసింది. సోదరులను చంపించి షాజహాన్‌ను ఖైదు చేసి జౌరంగజేబు సింహాసనాన్ని అధిష్ఠించడం దీనికి తెలుసు. తర్వాత 50 ఏళ్లలో 9 మంది రాజుల పాలనకు ఇదే కేంద్రం. పర్షియా రాజు నాదిర్‌షా 1739లో దండెత్తి వచ్చి అప్పటి రాజు మహ్మద్‌షాను ఓడించి అనేక సంపదలతో పాటు నెమలి సింహాసనాన్ని తరలించుకు పోవడాన్ని ఇది గమనించింది. బ్రిటిష్‌ సైనికులు 1857లో ఎర్రకోటను వశపరుచుకున్నారు. స్వాతంత్య్ర పోరాటం తర్వాత 1947 ఆగస్టు 15న తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఇక్కడ జెండాను ఎగురవేశారు. అప్పటి నుంచి ఆ సంప్రదాయం కొనసాగుతోంది.

దీని ప్రహరీగోడ రెండు కిలోమీటర్ల పొడవుగా, దాదాపు 90 అడుగులకు పైగా ఎత్తుతో ఉంటుంది. ఇందులో ముంతాజ్‌ మహల్‌ మ్యూజియం, మోతీమజీద్‌, రంగ్‌మహల్‌ ఎంతో ఆకట్టుకుంటాయి. 'బ్లడ్‌ పెయింటింగ్స్‌' మ్యూజియం, పురావస్తు మ్యూజియం, యుద్ధ స్మారక ప్రదర్శన శాలలు కూడా ఎర్రకోటలో ఉన్నాయి.


  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.

నీళ్లలో నానితే ముడతలేల? , Skin wrinkles when kept in water for long time why?


ప్రశ్న: ఎక్కువసేపు చేతులు, కాళ్లను నీళ్లలో ఉంచితే ముడతలు పడతాయెందుకు?

జవాబు: అరికాళ్లు, అరిచేతుల్లో దట్టమైన చర్మం ఉంటుంది. ఈ చర్మం లోపల కండరాలు ఒత్తుగా ఉంటాయి. ఈ కండరాలను చర్మానికి పట్టి ఉంచేలా కొన్ని చోట్ల సంధాన కణజాలం (connective tissue) ఉంటుంది. పరుపులో దూది కదిలిపోకుండా వేసే కుట్ల మాదిరిగా ఉండే ఈ ప్రత్యేక కణజాలం వల్లనే అరిచేతులు, అరికాళ్లలో గీతలు ఏర్పడతాయి. ఇక అరిచేతులు, అరికాళ్లపై ఉండే చర్మాన్ని పాక్షిక ప్రసరణ పొర (semipermeable membrane) అంటారు. ఈ పొరలో ఉండే కణాల్లోని సైటోప్లాజంలో అనేక లవణాలు ఉంటాయి. వీటి వల్లనే ఎక్కువ సేపు చేతులు, కాళ్లని నీటిలో ఉంచినప్పుడు కొంత నీరు లోపలికి ప్రసరించి చర్మపు పొరలోని కణాల్లోకి చేరుకుంటుంది. ఈ ప్రక్రియనే ద్రవాభిసరణం (osmosis) అంటారు. ఇందువల్ల ఆయా కణాలు ఉబ్బుతాయి. ఫలితంగా అరిచేతులు, అరికాళ్లపై ముడుతలు ఏర్పడుతాయి.

-ప్రొ|| ఎ.రామచంద్రయ్య -నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక



  • ===================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

ప్రపంచంలోనే అతి పెద్ద గడియారం ఎక్కడుంది? , Biggest Clock in the world-where is it ?





అతి పెద్ద గడియారంలో అన్నీ వింతలే!
1983 అడుగుల ఎత్తయిన టవర్‌... నాలుగువైపులా నాలుగు గడియారాలు... 20 లక్షల విద్యుద్దీపాలు... 12,000 కోట్ల రూపాయల ఖర్చు! అన్నీ కలిపితే.... అది ప్రపంచంలోనే అతి పెద్ద గడియారం!

ప్రపంచంలోనే అతి పెద్ద గడియారం ఎక్కడుంది? ఈ ప్రశ్నకి కొత్త సమాధానం తెలుసుకోండి. సౌదీ అరేబియాలోని మక్కాలో దీన్ని ఈమధ్యనే ప్రారంభించారు. సుమారు 600 మీటర్ల (1983 అడుగులు) ఎత్తయిన టవర్‌పై నాలుగువైపులా కనిపించేలా నాలుగు భారీ గడియారాలను ఏర్పాటు చేశారు. ఒకో గడియారం వ్యాసం 151 అడుగులు ఉంటుంది. మక్కాలో ప్రపంచంలోనే అతిపెద్ద మసీదు ఉన్న సంగతి తెలుసుగా? అక్కడే రంజాన్‌ పండుగ సందర్భంగా ఆవిష్కరించిన ఈ గడియారం నిర్మాణానికి 3 బిలియన్‌ డాలర్ల ఖర్చయింది. అంటే మన రూపాయల్లో 12000 కోట్ల రూపాయలన్నమాట.
ఇన్నాళ్లూ అతి పెద్ద గడియారం రికార్డు దేనిదో తెలుసా? ఇస్తాంబుల్‌లో 108 అడుగుల వ్యాసంతో ఉన్న సెవాహర్‌ మాల్‌ క్లాక్‌ది. ఇప్పుడు ఈ రికార్డు మక్కా గడియారం సొంతమైందన్నమాట. ఈ గడియారాలను ఏర్పాటు చేసిన 'మక్కా క్లాక్‌ రాయల్‌ టవర్‌'లో 76 అంతుస్థులు ఉన్నాయి. తుది మెరుగులు దిద్దుకుంటున్న దీనికి త్వరలో మరిన్ని రికార్డులు దక్కుతాయి. అవేంటో తెలుసా? ప్రపంచంలోనే రెండో ఎత్తయిన భవనం (బుర్జ్‌ దుబాయ్‌ తర్వాత), ప్రపంచంలో అతి ఎత్త్తెన హోటల్‌, ప్రపంచంలోనే ఎక్కువ చదరపు అడుగుల విస్తీర్ణం గల జనావాస భవనం ఇదే కాబోతోంది.

మక్కా మసీదుకు అధిపతి అయిన రాజు అబ్దుల్లా ఆధ్వర్యంలో జర్మనీకి చెందిన ఓ కంపెనీ దీని రూపకల్పన చేసింది. గడియారాల చట్రాలన్నీ బంగారంతో చేసినవే. ఆకర్షణీయంగా కనిపించడానికి వీటిని 9 కోట్ల రంగు గాజు ముక్కలతో అలంకరించారు. మొత్తం గడియారాలపై 20 లక్షల లెడ్‌ బల్బులను ఏర్పాటు చేశారు. గడియారాలపై 'అల్లా' అక్షరాలను 21 వేల ఆకుపచ్చ విద్యుత్‌ బల్బులతో ముస్తాబు చేశారు. ముస్లిములు ప్రార్థనలు జరిపే సమయాల్లో రోజుకు అయిదు సార్లు ఇవి వెలుగుతాయి. ఈ గడియారాలు 25 కిలోమీటర్ల దూరం నుంచి కూడా కనిపిస్తాయి. గడియారాలను దగ్గరగా చూసేందుకు వీలుగా టవర్‌పైకి లిఫ్టులు ఉంటాయి. టవర్‌ పైభాగంలో బంగారు చంద్రవంక రూపంలో ఏర్పాటుచేసిన లేజర్‌ కిరణాల వెలుగులు ఆకాశంలోకి 10 కిలోమీటర్ల దూరం వరకూ కనిపించేలా ప్రకాశిస్తాయి.



  • ====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

ఫ్యాన్‌ వేస్తే చల్లనేల? , Fan air gives coolness how?



ప్రశ్న: గదిలో ఫ్యాన్‌ వేయగానే మనకు చల్లగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందువల్ల?

జవాబు: ఫ్యాన్‌ వేయగానే చల్లగాలి వస్తుంది కానీ, ఆ గాలి కానీ, చల్లదనం కానీ ఫ్యానులో లేవు. నిజానికి ఫ్యాన్‌ వేయగానే గదిలోని గాలి వేడెక్కుతుంది. ఎందుకంటే గదిలోని గాలి అణువులలో కదలిక ఎక్కువై ఒకదానితో మరొకటి రాసుకోవడం వల్ల ఉష్ణం జనిస్తుంది. కాబట్టి ఫ్యాన్‌ గదిని చల్లబరచదు. ఫ్యాన్‌ గదిలోని గాలిని అన్ని దిశలకూ వేగంగా వ్యాపింపజేస్తుంది. అందువల్ల మన చర్మం ఉపరితలంపై ఉన్న చెమట ఆవిరవుతుంది. దీన్నే బాష్పీభవనం (Evaporation) అంటారు. ఈ ప్రక్రియలో మన శరీరంలోని వేడి తగ్గి మనకు చల్లగా ఉన్నట్లు అనిపిస్తుంది. మన చేతిపై అత్తరు చల్లుకున్నా చల్లగా అనిపించడాన్ని గమనించే ఉంటారు. ఇది కూడా బాష్పీభవనం వల్లనే. త్వరగా బాష్పీభవనం చెందే అత్తరులాంటి ద్రవాలు మన శరీరంలోని వేడిని గ్రహించి ఆవిరవడంతో ఇలా జరుగుతుంది. ఈ ప్రక్రియ ఎంత ఎక్కువగా, త్వరగా జరిగితే అంత చల్లదనాన్ని అనుభవిస్తాం. అందువల్లనే ఎండాకాలంలో చెమట ఎక్కువగా పట్టినప్పుడు ఫ్యాను వేసుకుంటే చల్లదనాన్ని ఎక్కువగా అనుభవిస్తాం.
- ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్

  • ================================
visit My website > Dr.Seshagirirao - MBBS.