ప్రశ్న: జంతువులు కన్నీరు కారుస్తాయా? 'మొసలి కన్నీరు' అనే పదం ఎలా వచ్చింది?
జవాబు: మన కంట్లో ఏదైనా నలుసులాంటిది పడినప్పుడు, ఉద్వేగానికి గురైనప్పుడు కనుకొలుకుల్లో ఉండే భాష్ప నాళాల్లో (tear ducts) ఉండే ద్రవం కంటిలోకి ఊరి బయటకి జారుతుంది. అదే కన్నీరు. చాలా వరకూ జంతువులు కూడా ఇలాగే కన్నీరు కారుస్తాయి. కానీ మొసలికి మనలాగా కంటిలోపల భాష్పనాళాలు ఉండవు. జలచరమైన అది ఆహారాన్వేషణలో నేలపైకి వచ్చినప్పుడు దాని దేహం కళ్లతో సహా పొడిబారిపోతుంది. అది ఏదైనా జంతువును పట్టుకుని నమిలేప్పుడు దాని కింది దవడ మాత్రమే కదులుతుంది. పై దవడకు చలనం అంతగా ఉండదు. ఆ క్రమంలో మొసలి చాలా శ్రమ పడవలసి వస్తుంది. దాని ముఖంలోని కండరాలకు, గొంతుకు చాలా వత్తిడి కలుగుతుంది. అప్పుడు గొంతులో ఉండే ప్రత్యేకమైన గ్రంథుల నుండి ప్రొటీన్లతో కూడిన ద్రవం మొసలి కంటిలోనుంచి బయటకు ప్రవహిస్తుంది. అది చూస్తే ఆ మొసలి ఆ జంతువును తింటున్నందుకు జాలితో ఏడుస్తున్నట్టు అనిపిస్తుంది. అది నిజం కాదు కాబట్టే కల్లబొల్లి ఏడ్పులు ఏడుస్తూ జాలి నటించే వారిని 'మొసలి కన్నీరు' కారుస్తున్నారనడం వాడుకగా మారింది.
- ==============================================